పద్మావతి రిలీజ్‌కు బ్రిటన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Thu,November 23, 2017 10:36 AM
Padmavati to release in UK on December 1

హైదరాబాద్‌: సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి ఫిల్మ్‌ డిసెంబర్‌ ఒకటవ తేదీన బ్రిటన్‌లో రిలీజ్‌ కానున్నది. బ్రిటీష్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ క్లాసిఫికేషన్‌ ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వాస్తవానికి ఇండియాలో కూడా డిసెంబర్‌ ఒకటవ తేదీన ఈ ఫిల్మ్‌ రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ కొన్ని రాష్ట్రాలు పద్మావతి రిలీజ్‌ను అడ్డుకుంటున్నాయి. సెన్సార్‌ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సీబీఎఫ్‌సీని చిత్ర నిర్మాతలు కోరారు. కానీ సెన్సార్‌ బోర్డు మాత్రం నిర్మాతల అభ్యర్థనలను తోసిపుచ్చింది.

సెన్సార్‌ జాప్యం
పద్మావతి చిత్రంపై నవంబర్ 30లోగా నివేదిక అందించాల్సిందిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ), కేంద్ర సమాచార, ప్రసారశాఖలను లోక్‌సభ కమిటీ బుధవారం కోరింది. అదేవిధంగా సెన్సార్‌బోర్డు, సమాచార, ప్రసారశాఖల అధికారులను తమముందు హాజరుకావాల్సిందిగా కమిటీ ఆదేశించింది. మరోవైపు పద్మావతి చిత్ర నిర్మాణ సంస్థ సెన్సార్ బోర్డుకు తగిన పత్రాలు సమర్పించకపోవడంతో సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నది. ఆందోళనలు, సెన్సార్ సర్టిఫికేట్ లభించని కారణంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ వయాకాం 18 తెలిపింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చిత్రాన్ని చూసిన పలువురు ఇందులో ఎలాంటి వివాదాస్పద సన్నివేశాలు లేవని, రాజపుత్ర రాణి పద్మావతి, ఢిల్లీ సుల్తాన్ ఖిల్జీ ఒకే సన్నివేశంలో కనిపించలేదని చెప్తున్నారు.

పద్మావతిపై గుజరాత్ ప్రభుత్వ నిషేధం
గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు పద్మావతి సినిమా విడుదలను నిలిపివేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ బుధవారం చెప్పారు. ఇలాంటి వివాదాల వల్ల ఎన్నికల వాతావరణం దెబ్బతింటుంది. రాజపుత్రుల మనోభావాలను దెబ్బతీసే ఈ చిత్రాన్ని గుజరాత్‌లో విడుదల కానివ్వం. భావప్రకటన స్వేచ్ఛపై మాకు విశ్వాసం ఉంది. కానీ చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదు అని రూపానీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ సెన్సార్ బోర్డు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా పద్మావతి సినిమా వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సమాచార, ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉండటానికి కారణం ఏమిటని బీజేపీ ఎంపీ, సీనియర్ నటుడు శతృఘ్నసిన్హా ప్రశ్నించారు. బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్ సైతం వివాదంపై స్పందించకపోవడానికి కారణం ఏమిటని ప్రజలు అడుగుతున్నారని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

3585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS