బాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, రిషికపూర్ 27 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి నటించిన చిత్రం 102 నాటౌట్. మే 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీలో ఈ ఇద్దరూ తండ్రీ కొడుకులుగా నటించారు. ఓ మై గాడ్లాంటి ఓ సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన ఉమేష్ శుక్లా.. ఈ మూవీకి డైరెక్టర్‌గా ఉన్నారు. చిత్రంలో 102 ఏళ్ల కురువృద్ధుడిగా అమితాబ్, 75 ఏళ్ల వయసున్న కొడుకుగా రిషి కపూర్ నటించారు. గుజరాతీ రచయిత సౌమ్యజోషి రాసిన నాటకం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో బిగ్ బీ, రిషీ కలిసి జోరుగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ మూవీపై స్పందించిన 103 ఏళ్ల బామ్మ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆల్ ది బెస్ట్ అమితాబ్.. నువ్వు 102 నాటౌట్ అయితే నేను 103 నాటౌట్ అంటూ వీడియోలో తెలిపింది ముసలి బామ్మ. ఈ వీడియోని అమితాబ్ తన ఫేస్ బుక్ పేజ్‌లో పోస్ట్ చేస్తూ.. ఈ లవ్లీ లేడీ మాకు విషెస్ తెలిపారు. ఆమెను దేవుడు చల్లగా చూడాలంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బామ్మ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. బామ్మ ఇంత ఏజ్‌లో అంత చలాకీగా ఉండడంతో నెటిజన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బీ, రిషి గతంలో ఐదు సినిమాల్లో కలిసి నటించారు. కభీ కభీ (1976), అమర్ అక్బర్ ఆంటోనీ (1977), నసీబ్ (1981), కూలీ (1983), అజూబా (1991) సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరూ మళ్లీ 27 ఏళ్ల తర్వాత జతకట్టారు. 102 చిత్రం భారీ విజయం సాధిస్తుందనే హోప్ తో టీం ఉంది.