యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దసరా కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. చిత్రంలో రాఘవ పాత్రని ఎన్టీఆర్ పోషిస్తుండగా, అరవింద పాత్రలో పూజా హెగ్డే సందడి చేయనుందని సమాచారం. చిత్ర ఫస్ట్ లుక్‌గా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటోతో పాటు ఎన్టీఆర్,పూజా కలిసి ఉన్న క్లాసీ ఫోటోని షేర్ చేసింది చిత్ర బృందం. ఇవి ఫ్యాన్స్‌ని ఎంతగానో అలరించాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో తారక్ రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తారని వినికిడి. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో పవర్ ఫుల్‌గా కనిపించనున్న ఎన్టీఆర్, హైదరాబాద్ నేపథ్యంలో సాగే సున్నితమైన పాత్రలోను కనిపించనున్నాడు అని అంటున్నారు. అంటే రెండు విభిన్న పాత్రలలో ఎన్టీఆర్ సందడి చేయనున్నాడని టాక్. చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బని కూడా సెలక్ట్ చేసినట్టు సమాచారం . హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.