ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ

Fri,February 22, 2019 11:09 AM
NTR Mahanayakudu gets mixed response

సంక్రాంతి కానుకగా గత నెలలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ సినీ ప్రయాణం ఎలాంటి మలుపులు లేకుండా సాఫీగా సాగడం, ఆసక్తికర అంశాలకు కథలో చోటివ్వకపోవడంతో ప్రేక్షకుల్ని ఈ చిత్రం మెప్పించలేకపోయింది. దాంతో రెండో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడును ఎలాంటి ప్రచారం, ఆర్భాటాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు చిత్రబృందం. ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఎన్నో ఎత్తుపల్లాల మధ్య సాగింది. అడుగడుగునా కుట్రలు, సవాళ్లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించిన అనంతరం రాజకీయపరంగా, వ్యక్తిగతంగా ఎన్టీఆర్‌కు ఎదురైన పరిణామాలతో పాటు వైస్రాయ్ ఘటన లాంటి అంశాలు సినిమాలో ఉంటాయా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది? సినిమాలో తనను విలన్‌గా చూపిస్తే సహించేది లేదంటూ నాదెండ్ల భాస్కర్‌రావు చిత్రబృందాన్ని హెచ్చరించడంతో ఈ సినిమాలో చర్చించే అంశాలేమిటో అనే ఆసక్తి తెలుగు ప్రేక్షకుల్లో నెలకొంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రంలో వాస్తవాల్నిచూపించారా? చరిత్రను వక్రీకరించారా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్పిందే..


తెలుగు దేశం పార్టీ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చైతన్యరథం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని ఎన్టీఆర్(బాలకృష్ణ) నిర్ణయించడంతో మహానాయకుడు కథ మొదలవుతుంది. ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లడాన్ని పార్టీ వర్గాలు, సన్నిహితులు వారిస్తారు.కానీ వారి మాటల్ని పట్టించుకోకుండా ధైర్యంగా ముందడుగువేస్తారు ఎన్టీఆర్. ఈ యాత్రలో ప్రజలతో మమేకమై వారి అభిమానాన్ని కూడగట్టుకుంటారు. ప్రజల మద్దతు ఎన్టీఆర్‌కు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌పై తమ పట్టును కోల్పోతామని భావించిన ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ప్రచారం చేయడానికి సమయం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికల్ని ప్రకటించడంతో కథ మొదలవుతుంది. ప్రజాభిమానంతో తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎలా అయ్యారు?రాజకీయ అనుభవం పెద్దగా లేని ఆయనకు పాలనలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? నమ్మిన వారే అధికారం కోసం ఆయన్ని ఎలా మోసం చేశారు? ఇందిరాగాంధీ నిరంకుశత్వాన్ని ఎదురించి ఎన్టీఆర్ ఎలాంటి పోరాటం సాగించారు? కోల్పోయిన అధికారాన్ని తిరిగి ఎలా హస్తగతం చేసుకున్నారన్నదే ఈ చిత్ర కథ.

చైతన్యరథం ద్వారా ప్రజల్లోకి వెళ్లిన ఎన్టీఆర్‌కు ఎదురైన సవాళ్లతో కథను మొదలుపెట్టారు క్రిష్. ఈ సన్నివేశాల్లో ఎక్కువగా డ్రామా లేకపోవడంతో వాటిని అలా టచ్‌చేస్తూ వెళ్లిపోయారు. ఇందిరాగాంధీ వ్యూహాల్ని తిప్పికొట్టి ఎన్నికల్లో 203 స్థానాల్ని కైవసం చేసుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా అధిరోహించారో చూపించారు. ప్రజా సంక్షేమంకోసం తాలూకాల రద్దు, రెండు రూపాయలకు కిలోబియ్యం లాంటి పథకాల ద్వారా ప్రజాభిమానాన్ని ఎలా చూరగొన్నారో ఆవిష్కరిస్తూనే మరోవైపు పదవీ విరమణ వయోపరిమితి తగ్గింపు నిర్ణయంతో జేజేలు కొట్టిన ప్రజల చేతే ఆయన ఎలా విమర్శలకు గురయ్యారో తెరపై చూపించారు దర్శకుడు క్రిష్. అవినీతిని స‌హించ‌ని ఎన్టీఆర్ తన పార్టీకి చెందిన మంత్రినే తొలగించడం, పాలనపై తన మనసును లగ్నం చేయడానికి కాషాయం వస్ర్తాలనే ధరించాలని నిర్ణయించుకోవడం ఇలా ఎన్టీఆర్ జీవితంలో పలు అంశాలకు కథలో చోటుకల్పించారు. తెలుగు దేశం స్థాపన నుండి ఎన్టీఆర్ శ్రేయోభిలాషిగా ఉండి, పార్టీలో కీలకనేతగా, మంత్రిగా ఉన్నా నాదెండ్ల భాస్కర్‌రావు ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇందిరాగాంధీ, గవర్నర్ రాంలాల్ అండదండలతో ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసిన నాదెండ్ల భాస్కర్‌రావు ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి ఆ పదవిలో తాను కూర్చుండే సన్నివేశంతో ప్రథమార్థాన్ని ముగించారు. నాదెండ్ల కుట్రపై తన అల్లుడైన చంద్రబాబు సహాయంతో ఎన్టీఆర్ ఎలా పోరాడాడో తిరిగి ఎలా అధికారం చేపట్టాడో ద్వితీయార్థం మొత్తం చూపించారు. ఎన్టీఆర్, నాదెండ్ల ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో ద్వితీయార్థం సాగుతుంది. తనకు అండగా నిలబడిన శాసనసభ్యులను కాపాడుకోవడానికి ఎన్టీఆర్ చేసే ప్రయత్నాలతో పాటు ఇందిరాగాంధీ నిరంకుశధోరణిని ఎదురించి ఢిల్లీ స్థాయిలో ఎలా పోరాడారో చూపించారు. రాజకీయ అంశాలను స్పృశిస్తూనే మరోవైపు బసవతారకంపై ఎన్టీఆర్‌కు ఉన్న ప్రేమను, కుటుంబ బంధాలకు ఆయన ఇచ్చే విలువను కథలో అంతర్లీనంగా ఆవిష్కరించారు క్రిష్. ఎన్టీఆర్‌లోని మంచిని మాత్రమే చూపించారంటూ తొలిభాగంపై వచ్చిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండో భాగంలో ఆయనకు ఎదురైన కొన్ని పరాభవాల్ని ప్రస్తావించారు క్రిష్.

ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. అందరికి తెలిసిన కథతోనే ఈ సినిమాను తెరకెక్కించారు క్రిష్. ఉత్కంఠకు తావు లేకుండా ఆద్యంతంఊహాతీతంగానే సినిమా సాగుతుంది. చెప్పాల్సిన అంశాలు ఎక్కువగా ఉండటం, నిడివి తక్కువ కావడంతో ప్రతి అంశాన్ని పైపైన స్పృశిస్తూ వెళ్లిపోయారు. దాంతో సినిమాలోని చాలా సన్నివేశాలతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. 1983 కాలంలో జరిగిన కథ ఇది. కానీ ఆనాటి ఛాయలేవి సినిమాలో మచ్చుకైనా కనిపించవు. కథాగమనం నిదానంగా సాగుతూ డాక్యుమెంటరీని తలపిస్తుంది. నేటి రాజకీయ కథను చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

ఎన్టీఆర్, బసవతారకం మధ్య ఉన్న అనుబంధమే ప్రధాన కథాంశం అంటూ ప్రారంభంలో చిత్రబృందం చెప్పిన మాటలకు సినిమా కథకు ఎలాంటి సంబంధం కనిపించదు. కేవలం నాదెండ్ల భాస్కర్‌రావుపై ఎన్టీఆర్ చేసిన పోరాటానికే పెద్దపీట వేస్తూ సినిమాను రూపొందించారు. నాదెండ్ల భాస్కర్‌రావును విలన్‌గా చూపించడానికే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. ఎన్టీఆర్ జీవితంలో చివరి అంకాన్ని పూర్తిగా విస్మరించారు. వాటికి కథలో చోటు కల్పించలేదు. ఎన్టీఆర్ జీవితంలో పలు కీలక సంఘటనల్ని విస్మరిస్తూ తెరకెక్కించిన చిత్రాన్ని బయోపిక్ అని సంభోదించడం ఎంతవరకు సబబో చిత్రబృందానికే తెలియాలి.

ఎన్టీఆర్ రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి చంద్రబాబునాయుడు చేసిన కృషి ఎక్కువగా ఉందనే కోణంలో సినిమా సాగుతుంది. ఆయనే మరో హీరోగా సినిమాలో చూపించారు. ఆ సన్నివేశాలన్నీ కథాగమనాన్ని పక్కదారి పట్టించాయి.ఎన్టీఆర్‌ను పదవి నుండి తొలగించడానికి వైస్రాయి హోటల్ ఘటననను, చంద్రబాబు చేసిన కుట్రను ప్రజాపరిరక్షణ పేరుతో అప్పట్లో కొందరు ప్రచారం చేశారు. జామాతా దశమగ్రహం అంటూ చంద్రబాబు చేసిన ఈ కుట్రను ఎన్టీఆర్ అనేక ఇంటర్వ్యూలలో బయటపెట్టారు.తెలుగు రాజకీయాల్లో ప్రాధాన్యత ఉన్న ఆ అంశాలను పూర్తిగా విస్మరించారు. బాలకృష్ణ, చంద్రబాబు మధ్య ఉన్న బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చారిత్రక సత్యాలకు కథలో చోటివ్వనట్లుగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాల కాలాలు మారిపోయారు. మూడో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ప్రవేశపెట్టిన పలు పథకాల్ని ముందుగానే ఆమోదం తెలిపినట్లు చూపించారు.

ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ చాలా చోట్ల తండ్రిని తలపించారు. ఎన్టీఆర్ హావభావాల్ని, ఆహార్యాన్ని అనుకరిస్తూ పాత్రలో ఇమిడిపోయే ప్రయత్నం చేశారు. బవసతారకంగా విద్యాబాలన్ పాత్ర ద్వితీయార్థంలో హృద్యంగా సాగింది. భర్తపై ఆమెకున్న ప్రేమను ఈ భాగంలో చూపించారు క్రిష్. సినిమాలో చంద్రబాబునాయుడిని పూర్తిగా అనుకరించారు రానా. రానా మాట్లాడేతీరు, హవభావాలు చంద్రబాబునాయుడిని గుర్తుకు తెస్తుంది. నాదెండ్ల భాస్కర్‌రావుగా సచిన్ ఖేడ్కర్ చక్కటి నటనను ప్రదర్శించారు. కీరవాణి పాటల్లో గుర్తుంచుకోతగ్గవి ఏమీ లేవు. కథపైనే ఎక్కువగా దృష్టిసారించిన చిత్రబృందం పాటలకు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు.

ఎన్టీఆర్ అభిమానుల్ని మినహా మిగతా వారిని ఈ సినిమా మెప్పించడం కష్టమే. అందరికి తెలిసిన కథ కావడం, అనాసక్తిగా సాగే కథాగమనం కారణంగా ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ కాలేరు. ఎన్టీఆర్ కంటే చంద్రబాబు పాత్రకు అమిత ప్రాధాన్యతనిస్తూ సినిమాను తెరకెక్కించిన అనుభూతి కలుగుతుంది. పరిపూర్ణ బయోపిక్ అనదగ్గా సినిమా కాదిది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి కొన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించినా సరైన వసూళ్లు మాత్రం రాబట్టలేదు. మరి రెండో భాగమైన మహానాయకుడు ఏ మేరకు నిర్మాతలకు లాభాల్ని చేకూర్చుతుందో చూడాల్సిందే..

రేటింగ్:2.5/5

5612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles