రివ్యూ: 'ఎన్టీఆర్' కథానాయకుడు

Wed,January 9, 2019 01:53 PM


తారాగణం: బాలకృష్ణ, విద్యాబాలన్, కల్యాణ్‌రామ్, రానా, సుమంత్, రకుల్‌ప్రీత్‌సింగ్, నిత్యామీనన్, హన్సిక తదితరులు..
దర్శకుడు: క్రిష్
నిర్మాతలు: వసుంధరాదేవి, బాలకృష్ణ
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సంభాషణలు: సాయిమాధవ్‌బుర్రా...


అతి సామాన్యుడిగా జీవిత ప్రస్థానాన్ని ఆరంభించి ఆసాధారణ శక్తిగా ఎదిగారు ఎన్టీఆర్. వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా ప్రేక్షక నీరాజనాలందుకున్నారు. రాజకీయరంగంలో సంచలనం సృష్టించారు. ముఖ్యమంత్రిగా పలు సంస్కరణలతో తనదైన ముద్రను వేశారు. తెలుగువారి కీర్తిని ఇనుమడింపజేసిన ఆయన జీవనయానంలో అనేక ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. దాంతో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తొలుత తేజ దర్శకత్వంలో శ్రీకారం చుట్టిన ఈ సినిమాకు అనంతరం క్రిష్ నిర్ధేశక బాధ్యతలు చేపట్టారు. స్వీయ నిర్మాణంలో బాలకృష్ణ ఈ సినిమాను తెరకెక్కించడం మరో ప్రత్యేకతగా నిలిచింది. భారీ నిర్మాణ వ్యయంతో పలువురు అగ్ర తారలు ఈ సినిమలో భాగమవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో నేడు ప్రేక్షకులముందుకొచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ఎంతవరకు అంచనాల్ని అందుకుందో సమీక్షిద్దాం...

ఎన్టీఆర్ జీవితం అనేక పుస్తకరూపాల్లో, సన్నిహితుల వ్యాఖ్యానాల ద్వారా అందరికి సుపరిచితమే. కృష్ణా జిల్లా నిమ్మకూరు మొదలైన ప్రస్థానం గొప్ప సినీ తారగా అపై రాజకీయనాయకుడిగా ఆయన సాధించిన విజయాలు, ఈ క్రమంలో ఆయన జీవనయానం గురించి తెలుగు ప్రజలకు అవగాహన ఉన్నది. అందరికి తెలిసిన కథనే కాబట్టి కొత్తగా ఈ సినిమా ఇతివృత్తం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బెజవాడలో సబ్‌రిజిస్ట్రార్‌గా ఉద్యోగాన్ని వదలుకొని ఆపై సినీ రంగంలో అనేక ఒడుదుడుకులను ఎదుర్కొని అజేయమైన తారగా ఎదిగిన ఎన్టీఆర్ జీవనక్రమాన్ని క్రిష్ కథానాయకుడు సినిమాలో ఆవిష్కరించారు.

ఆరవై ఏళ్ల వయసులో రాజకీయరంగ ప్రవేశం గురించి ఎన్టీఆర్ చేసిన ప్రకటనతో కథానాయకుడికి ముగింపునిచ్చారు. నిజాయితీ, ముక్కుసూటితనం కారణంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మద్రాస్‌అడుగుపెట్టిన ఎన్టీఆర్‌కు తొలినాళ్లలో ఎదురైన పరిణామాలతో ఆసక్తికరంగా సినిమాను ప్రారంభించారు క్రిష్. ఎనిమిది నెలలు నిరీక్షించిన హీరోగా అవకాశాలు రాకపోవడంతో ఒకానొకదశలో నిరాశతో తన ఊరికి వెళ్లిపోదామని నిశ్చయించుకున్న ఎన్టీఆర్ చివరకు తెలుగు ప్రజల ఆరాధ్యనాయకుడిగా ఎదిగిన వైనాన్ని, ఆయన పోషించిన అజరామరమైన పాత్రల ద్వారా చూపించారు.


సీతారామ కళ్యాణంలో ఓ సన్నివేశం కోసం కదలకుండా ఇరవై గంటల పాటు నిల్చొవడం, తన కొడుకు రామకృష్ణ చనిపోయినా కూడా నిర్మాతకు నష్టం రాకూడదని షూటింగ్ పూర్తిచేసి వెళ్లిపోవడం లాంటి సన్నివేశాలు ద్వారా వృత్తి పట్ల ఎన్టీఆర్‌కు ఉన్న తపనను, అంకితభావాన్ని చాటిచెప్పాయి. అలాగే పౌరాణికాలు, జానపద సినిమాలకు ఎన్టీఆర్ పనికిరాడని చెప్పిన నాగిరెడ్డి, చక్రపాణి లాంటి వారి చేతనే మహానటుడిగా ఎన్టీఆర్ ఎలా నిరూపించుకున్నారో చూపించారు. సాంఘికం, జానపదం, పౌరాణికం సినిమా ఏదైనా తనకు తానే సాటి అని ఎన్టీఆర్ ఏ విధంగా కీర్తిప్రతిష్టల్ని సంపాదించుకున్నారో చెప్పారు క్రిష్. ఒక్క సినీ ప్రయాణానికే పరిమితం కాకుండా కె.వి.రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, విఠాలచార్య, దాసరి నారాయణరావు..ఇలా తెలుగు చిత్రసీమలోని పలువురు దర్శకనిర్మాతలతో ఎన్టీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని గురించి ఈ సినిమాలో చూపించారు.

అలాగే ఎన్టీఆర్ విజయంలో ఆయన భార్య బసవతారకం పాత్రను ఉన్నతంగా క్రిష్ తెరపై ఆవిష్కరించారు. బసవతారకం పట్ల ఎన్టీఆర్‌కు ఉన్న ఇష్టాన్ని చక్కగా సినిమాలో తెలియజేప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య ఉన్న స్నేహం, ఆరోగ్యకరమైన పోటీ తాలూకు సన్నివేశాలు అలరిస్తాయి. కుటుంబ బంధాలకు, స్నేహానికి ఎన్టీఆర్ ఇచ్చే విలవను చాటిచెప్పారు. అరవై ఏళ్ల పాటు వెండితెరపై అభిమానుల్ని అలరించిన ఆయన మిగిలిన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని నిర్ణయించుకోవడానికి దారి తీసిన పరిస్థితుల్ని కథానాయకుడిలో చెప్పారు. రాయలసీమ క్షామ పరిస్థితులతో పాటు దివిసీమ ఉప్పెన, ఎమర్జెన్సీ, తెలుగు వారి పట్ల ఉన్న వివక్ష తదితర కారణాలు ఆయన రాజకీయ ప్రయాణానికి ఎలా నాందిగా మారాయో తెరపై చూపించారు.

ఎన్టీఆర్ జీవితంలోని ఎత్తుపల్లాలను రెండింటిని సినిమాలో ఆవిష్కరిస్తే బాగుండేది. అలా కాకుండా కేవలం ఆయన విజయాల్ని, గొప్పతనాల్ని మాత్రమే చూపించడానికే ఈ సినిమాలో ప్రాధాన్యతనిచ్చారు.ఆయనలోని ఒక పార్శాన్ని మాత్రమే చూపించడంతో బయోపిక్ అసంపూర్ణంగా అనిపిస్తుంది. అలాగే ఆయన రాజకీయ ప్రయాణానికి దారి తీసిన పరిస్థితుల్ని నిజానిజాల్ని పూర్తిగా చెప్పలేదు. ఎన్టీఆర్ కెరీర్‌లోని గొప్ప సినిమాల్ని అందులోని పాత్రల ద్వారా సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. వాటిలో ఆసక్తి లోపించింది. తండ్రి బయోపిక్‌లో కొడుకు నటించడం అరుదనే చెప్పాలి. ఎన్టీఆర్ సినిమాతో బాలకృష్ణ ఈ గొప్ప సాహసానికి పూనుకున్నారు. తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ఎన్టీఆర్ మేనరిజమ్స్ పలికిస్తూ సహజంగా నటించారు. తండ్రి పోషించిన పలు పౌరాణిక పాత్రల్లో బాలకృష్ణ కనిపించారు.


అయితే వాటిలో మహానటుడిగా నీరాజనలందుకున్న తండ్రిని మాత్రం మరపించలేకపోయారు. ఆహార్యం విషయంలో మాత్రం ఎన్టీఆర్‌కు దగ్గరగా కనిపించారు. ముఖ్యంగా రాజకీయ ప్రయాణానికి సంబంధించి సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ను చూసిన భావన కలుగుతుంది. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ అద్వితీయ అభినయాన్ని ప్రదర్శించింది. ఏఎన్నాఆర్‌గా సుమంత్ పాత్ర ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. ఈ పాత్రలకు తప్ప మిగిలిన వారంతా సినిమాలో అతిథుల్లాగే కనిపించారు. నాగారెడ్డిగా ప్రకాష్‌రాజ్, చక్రపాణిగా మురళీశర్మ, దాసరి నారాయణరావుగా చంద్రసిద్ధార్థ, త్రివిక్రమరావుగా దగ్గుబాటి రాజా, కె.వి రెడ్డిగా క్రిష్, హెచ్.ఎం రెడ్డిగా సత్యనారాయణ ఇలా చాలా మంది నటీనటులు కనిపించేది కొద్ది క్షణాలే అయినా తమ అభినయంతో వాటిలో ఒదిగిపోయారు.

ఈ బయోపిక్‌ను కమర్షియల్ కోణంలో తెరపై ఆవిష్కరించడంలో క్రిష్ విజయవంతమయ్యారు. ఎన్టీఆర్ సినీ జీవితంలోని భిన్న కోణాలను స్పృశిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయన సినీ జీవితంలో ఏ పాత్రను గురించి చెప్పాలో వాటిని గురించి మాత్రమే చూపించారు. దర్శకుడిగా తన బాధ్యతకు వందశాతం న్యాయం చేశారు. సినిమా కోసం ఆయన చేసిన పరిశోధన, తపన ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. సంభాషణల రూపంలో ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ కథను ముందుకు సాగించిన తీరు బాగుంది. 1950,60 కాలం నాటి పరిస్థితుల్ని సహజంగా చూపించారు. కీరవాణి, సాయిమాధవ్ బుర్రా, జ్ఞానశేఖర్ లాంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల అండ క్రిష్‌కు లభించడం ఈ సినిమాకు ఉపయోగపడింది.

నందమూరి అభిమానులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సినిమా ఇది. ఎన్టీఆర్‌కు ఉన్న ఇమేజ్, ఆయన విజయాల్ని మాత్రమే చూపిస్తూ తెరకెక్కిన ఈసినిమా సగటు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో వేచిచూడాల్సిందే...

రేటింగ్: 2.75/5

10109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles