నోటా రివ్యూ..

Fri,October 5, 2018 05:12 PM
NOTA Movie review

కెరీర్ తొలినాళ్లలో రాజకీయ కథాంశాల్ని ఎంచుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. అగ్ర కథానాయకులు సైతం పొలిటికల్ ఇతివృత్తాల్లో నటించడానికి సంశయిస్తుంటారు. అయితే విజయ్ దేవరకొండ పంథాయే వేరు. కథాంశాలపరంగా రిస్క్‌లు తీసుకోవడం, ప్రతి సినిమాలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని తపిస్తారాయన. అర్జున్‌రెడ్డి గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ క్రేజ్ తారాస్థాయికి చేరింది. యువతరానికి ఆయనో ైస్టెల్ ఐకాన్‌గా మారాడు.

గీత గోవిందం దాదాపు 125కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో ట్రేడ్ వర్గాలు సైతం విజయ్‌దేవరకొండ సినిమాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో తమిళ, తెలుగు భాషల్లో నోటా సినిమాతో ప్రేక్షకులముందుకొచ్చారు విజయ్ దేవరకొండ. తమిళంలో ఆయనకిది అరంగేట్ర చిత్రంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆనంద్‌శంకర్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత కె.ఇ.జ్ఞావవేళ్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.

వరుణ్(విజయ్ దేవరకొండ) ఓ వీడియోగేమ్ డిజైనర్. తండ్రి వాసుదేవ్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా వరుణ్‌కు మాత్రం రాజకీయాలంటే ఇష్టం ఉండదు. తండ్రిపై వచ్చిన ఓ నేరారోపణ కారణంగా అనుకోని పరిస్థితుల్లో వరుణ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సివస్తుంది. పదిహేను రోజులు సీఎంగా ఉంటే చాలానుకున్నా వరుణ్ తండ్రిపై హత్యాప్రయత్నం జరగడంతో పూర్తిస్థాయిలో బాధ్యతల్ని చేపడతాడు. రాజకీయ అనుభవం లేని వరుణ్‌కు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆత్మీయుడైన చంద్రం(సత్యరాజ్) సహాయంతో వాటిని ఎదుర్కొంటూ ప్రజల ఆరాధ్య నాయకుడిగా పేరుతెచ్చుకుంటాడు వరుణ్. ఇంతలో తండ్రి వాసుదేవ్ నుంచి అతడికి ముప్పు ఎదురవుతుంది. అదేమిటి? తండ్రిని ఎదురించి వరుణ్ ఎందుకు పోరాడాల్సివస్తుంది? తనను పదవీచ్యుతుడిని చేయడానికి పన్నిన కుట్రల్ని వరుణ్ ఎలా ఎదురించాడు? అన్నదే ఈ చిత్ర కథ.

సమకాలీన రాజకీయ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు ఆనంద్‌శంకర్ ఈసినిమాను తెరకెక్కించారు. వారసత్వ రాజకీయాలు, అధికారదాహం, పదవీవ్యామోహం, హవాలా వ్యాపారాలు ఇలా ప్రస్తుత రాజకీయాల్లోని పలు కీలకాంశాలను స్పృశిస్తూ ఫిక్షనల్ డ్రామాగా ఈ కథను రాసుకున్నారు. రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేని నిజాయితీపరుడైన యువకుడికి ఎదురైన సవాళ్లు, పరీక్షలతో ఈ సినిమా సాగుతుంది. జీవితంలో నిర్ధిష్టమైన లక్ష్యాలంటూ ఏమీ లేని నవతరం యువకుడిగా విజయ్ పాత్రను ఓ పాట రూపంలో ఆవిష్కరించి నేరుగా అసలు కథలోకి వెళ్లిన తీరు బాగుంది. ముఖ్యమంత్రి పదవి గురించి ఏమీ తెలియకుండానే విజయ్ రాష్ర్టాన్ని పాలించే సన్నివేశాలన్నీ వినోదాన్ని పంచుతాయి. ఓ అల్లర్లలో చిన్నారి మరణించే సన్నివేశంలో కథ ఆసక్తికరంగా మారుతుంది. తనదైన శైలి డైలాగ్ డెలివరీ, నటనాపటిమతో ఆ సన్నివేశానికి ప్రాణంపోశారు విజయ్‌దేవరకొండ.

తండ్రి ప్రమాదంలో చిక్కుకోవడంతో పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగాబాధ్యతల్ని చేపట్టే సన్నివేశంతో ద్వితీయార్థంలో ప్రవేశించిన దర్శకుడు మిగతా కథను నడిపించారు. ముఖ్యంగా తండ్రిలో మార్పు తీసుకొచ్చే సన్నివేశాలతో పతాక ఘట్టాలను ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు. రాజకీయ నేపథ్యంలో సినిమా చేయాలనే ఆలోచన మంచిదే. అయితే రాజకీయాల్లో ఉండే లోతుపాతులు, అధికారం కోసం నాయకులు వేసే ఎత్తుగడలతో వాటిని ఆసక్తికరంగా నడిపిస్తేనే ఈ కథలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఆనంద్‌శంకర్ ఎంచుకున్న కథ బాగానే ఉన్నా సన్నివేశాలను కాస్త ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది. సినిమా మరింత రక్తికట్టేది. కథానాయకుడికి ధీటైన ప్రతినాయక పాత్రలు ఈ సినిమాలో లేకపోవడం మైనస్‌గా మారింది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా చేసి మరోసారి తన వైవిధ్యతను చాటుకున్నారు. జీవితాన్ని సరదాగా గడిపే ప్లేబాయ్‌గా, ప్రజలకు మంచి చేయాలని తపించే నాయకుడిగా భిన్న పార్శాల్లో సాగే పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. గత సినిమాలకు పూర్తి విభిన్నంగా కనిపించారు. నటన, ఆహార్యంలోవైవిధ్యతను ప్రదర్శించి మరోసారి విలక్షణీయతను చాటుకున్నారు. నటుడిగా అతడికి కొత్త పంథాలో ఆవిష్కరించిన చిత్రమిది. కథలోని కీలకమైన పాత్రలకు తమ నటనానుభవంతో సత్యరాజ్, నాజర్ ప్రాణంపోశారు. జ్ఞానవేళ్‌రాజా నిర్మాణ విలువలు బాగున్నాయి.

రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. పొలిటికల్ జానర్ సినిమాలు, ఇష్టపడే వారికి విజయ్ దేవరకొండ అభిమానుల్ని ఈ సినిమా మెప్పించే అవకాశం ఉంది.

7183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles