రివ్యూ: క‌న్ఫ్యూజ‌న్‌ పొలిటికల్ డ్రామా...ఎన్‌జీకే

Fri,May 31, 2019 03:46 PM

సూర్య నుంచి సినిమా వస్తున్నదంటే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కథాంశాల ఎంపికలో నవ్యతకు ప్రాధాన్యతనిస్తూ ఆయన చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై పెద్ద విజయాల్ని అందుకున్నాయి. యువ అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయ కథాంశంతో సూర్య నటించిన చిత్రం ఎన్‌జీకే. 7/ జీ బృందావన కాలనీ, అడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్య, సెల్వరాఘవన్ కలయికలో రూపొందిన తొలి చిత్రమిది. ఈ కాంబినేషన్ ఎలా వర్కవుట్ అయ్యింది? పరాజయాల్లో ఉన్న సూర్యతో పాటు సెల్వరాఘవన్ ఈ చిత్రంతో విజయాల బాట పట్టారా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..


శృంగవరపు కోటకు చెందిన నందగోపాలకృష్ణ(సూర్య)ఉన్నత ఉద్యోగాన్ని కాదనుకొని సొంత ఊరిపై మమకారంతో సేంద్రీయ వ్యవసాయం చేయడానికి సిద్ధపడతాడు. అతడి ఇష్టానికి భార్య గీతాకుమారి(సాయిపల్లవి) అడ్డుచెప్పదు. అయితే గోపాలం చేసే సేంద్రీయ వ్యవసాయం వల్ల వడ్డీవ్యాపారులు, ఫర్టిలైజర్స్ దుకాణదారులు నష్టాలపాలవుతారు. దాంతో గోపాలం చేసే మంచి పనులకు అడ్డుతగులుతారు. వారిని ఎదిరించాలంటే రాజకీయనాయకుల వల్లే సాధ్యమవుతుందని నిర్ణయించుకున్న గోపాలం స్థానిక ఎమ్మెల్యే సహాయాన్ని కోరుతాడు. తన రాజకీయ పార్టీలో చేరితేనే గోపాలానికి సహాయం చేస్తానని ఎమ్మెల్యే అంటాడు. అందుకు అంగీకరించిన గోపాలం ఆ ఎమ్మెల్యేను ఓ పావుగా వాడుకొని తాను రాజకీయాల్లో పైకి రావాలని ప్రయత్నం చేస్తాడు.

ఒకేసారి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకుల దృష్టిలో పడతాడు. అయితే గోపాలానికి ప్రజల మద్దతు పెరుగుతుండటంతో అది సహించని రెండు పార్టీలు అతడిని చంపాలని ప్రయత్నాలు చేస్తాయి. వారి ఎత్తుగడలను గోపాలం ఎలా తిప్పికొట్టాడు? రాజకీయాల్లో తాను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? ఈ క్రమంలో గోపాలానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతడి ప్రయాణంలో వనిత(రకుల్‌ప్రీత్‌సింగ్) పాత్ర ఏమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

ఓ సాధారణ యువకుడికి రాజకీయ చదరంగంలో ఎదురైన ఆటుపోట్లతో దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టిన గోపాలం తన తెలివితేటలు, కుయుక్తులతో ప్రజాభిమానాన్ని సంపాదించి ఎలా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడో సందేశాత్మకంగా తెరపై ఆవిష్కరించాలని అనుకున్నారు. కానీ తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను స్పష్టంగా, సూటిగా చెప్పడంలో తడబడిపోవడంతో సినిమా మొత్తం గతితప్పి సాగుతుంది. కొత్త కథ పేరుతో ఎప్పుడు అవుట్‌డేటెడ్ పాయింట్‌ను తీసుకొని దానికి సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్ లాంటి స్టార్ ఇమేజ్‌ను జోడించి సినిమాను తెరకెక్కించారు సెల్వరాఘవన్. ఒకే ఒక్కడు, ఆపరేషన్ దుర్యోధన, నేనే రాజు నేనే మంత్రి, శకుని ఇలా ఎన్నో సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి.

రాజకీయ కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే కథనంలో మలుపులతో పాటు బలమైన సంఘర్షణ ఉండాలి. ఇందులో అవేమీ కనిపించవు. సూర్యకు ఎదురయ్యే సవాళ్లు హాస్యాస్పదంగా ఉంటాయి . సాధారణ కార్యకర్తగా ఎమ్మెల్యే అభిమానాన్ని చూరగొనడం కోసం అతడు చేసే పనులన్నీ సినిమా నిడివిని పెంచడానికే దోహదం చేశాయి. రకుల్‌ప్రీత్‌సింగ్,సాయిపల్లవి పాత్రల మధ్య ఉన్న అసూయద్వేషాల నుంచి కామెడీని రాబట్టుకోవాలని చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. పీఆర్ లీడర్ అంటూ, తాను చెప్పిందే వేదం అంటూ రకుల్‌ప్రీత్ పాత్రను పరిచయం చేసిన దర్శకుడు చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా నడిపించారు.

విలన్ పాత్రలను పూర్తిగా డమ్మీ చేసేశాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా సామాన్యుడి బెదిరింపులకు భయపడిపోయి అతడు చెప్పినట్లు వినడం, అతడిని ఎదిరించడానికి అధికారం, ప్రతిపక్షం కలిసిపోయే సన్నివేశాలు ఇలా ఎన్నో అద్భుతాలు సినిమాలో కనిపిస్తాయి. అప్పటివరకు రాజకీయ స్వార్థం కోసం ఆలోచించే హీరో హఠత్తుగా సిగ్నల్ దాటోద్దు, ఆలోచించి ఓటేయ్యాలి అంటూ సందేశాలు చెప్పడం ఏమిటో అంతుపట్టదు.

ప్రజలకు నచ్చే విషయాల్ని మాట్లాడితేనే జనాలు సభల్లో కూర్చొంటారు. లేదంటే వీడు ఎప్పడూ ఆపుతాడా అని ఎదురుచూస్తారు అంటూ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ఆ మాట సినిమాలకు వర్తిస్తుంది. ఆ బేసిక్ పాయింట్ మర్చిపోయి సినిమా చేశారు సెల్వరాఘవన్ . సినిమా ఎప్పుడూ పూర్తవుతుందా అని ఎదురుచూసేలా చేశారు.

సూర్య తన నటనతో ఈ సినిమాను నిలబెట్టడానికి శాయశక్తులా ప్రయత్నించారు. భిన్న పార్శాలతో కూడిన పాత్రలో చక్కటి వైవిధ్యతను ప్రదర్శించారు. దర్శకుడు సెల్వరాఘవన్ తప్పిదం వల్ల అతడి కష్టం మొత్తం వృథాగానే మిగిలిపోయింది. దర్శకుడిని గుడ్డిగా నమ్మి సినిమా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఇది ఓ ఉదాహరణగా నిలుస్తుంది. సాయిపల్లవి లాంటి మంచి నటిని ప్రాధాన్యత లేని పాత్రలో చూపించారు దర్శకుడు. తెలుగు నటీనటులు ఎవరూ ఈసినిమాలో లేకపోవడం, తమిళ ఛాయలతో పూర్తిగా సాగడం మైనస్‌గా మారింది.

కొత్తదనం మచ్చుకైనా లేని కథ, గందరగోళానికి గురిచేసే కథనం, ఏం చేయాలో, ఏం చేస్తున్నారో స్పష్టత లేని పాత్రలు వెరసి ఎన్‌జీకే ప్రేక్షకుల సహనానికి పరీక్షగానిలిచింది. సెల్వరాఘవన్ మరోసారి దర్శకుడిగా, కథకుడిగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. సూర్య ఫ్లాప్‌లా సంఖ్యను పెంచడానికి తప్ప అతడికి ఏ విధంగాను ఈ సినిమా ఉపయోగపడదు.
సినిమాలు, రాజకీయాలు రెండు ఓకేలా ఉండవు అంటూ ఇందులో సూర్యతో ఓ నటుడు డైలాగ్ చెబుతాడు. దర్శకుడు సెల్వరాఘవన్‌కు సైతం ఆ తేడా ఏమిటో మరిచిపోయినట్లున్నారు. సినిమాలో సెల్వరాఘవన్ చెప్పిన రాజకీయం ఎవరికి అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం మంచిదేమో అనిపిస్తుంది.సూర్య ఈ సినిమాను ఎందుకు అంగీకరించాడో, సెల్వరాఘవన్ అతడిని ఎలా ఒప్పించాడో అనే అనుమానం ప్రతిక్షణం కలుగుతూనే ఉంటుంది.

రేటింగ్-2/5


3637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles