‘నానిస్ గ్యాంగ్‌లీడర్’ రివ్యూ..

Fri,September 13, 2019 02:24 PM

తారాగణం: నాని, లక్ష్మీ, కార్తికేయ, శరణ్య, ప్రియాంక, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్
సంగీతం: అనిరుధ్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సీవీఎం)
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్


దర్శకుడు విక్రమ్ కె కుమార్, హీరో నాని కెరీర్‌లను పరిశీలిస్తే కథాంశాల ఎంపికలో ఇద్దరి మధ్య సారూప్యతలు కనిపిస్తాయి. ఎలాంటి కథనైనా తనదైన సెన్సిబిలిటీస్ మేళవించి అందంగా చెప్పడం విక్రమ్ కె కుమార్ శైలి. ప్రతి సినిమాలో పాత్రపరంగా కొత్తదనాన్ని చూపించాలన్నది నాని నమ్మే సిద్ధాంతం. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకులు ఉత్సుకతను ప్రదర్శించారు. దాంతో నానిస్ గ్యాంగ్‌లీడర్ నిర్మాణం నుంచే ఆసక్తిని రేకెత్తించింది. నవ్యతకు పెద్దపీట వేసే ఈ ఇద్దరు దర్శకహీరోలు చేసిన ప్రయత్నం ఎంత వరకు ఫలించింది? ప్రేక్షకుల అంచనాల్ని ఏ మేరకు అందుకుందీ? ఇవన్నీ తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..

పెన్సిల్ పార్థసారథి (నాని) క్రైమ్‌స్టోరీ రైటర్. ప్రతీకార ఇతివృత్తాంటే బాగా ఇష్టం. తానో గొప్ప రచయితనని ఊహల్లో విహరిస్తుంటాడు. హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొట్టి క్రైమ్ నవలల్ని రాస్తుంటాడు. అప్పటికే 28 నవలలు రాసిన అతను 29వ నవల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఇదిలావుండగా తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సరస్వతి (లక్ష్మీ) అనే వృద్ధురాలు.. నలుగురు మహిళల్ని (శరణ్య, ప్రియాంక, శ్రియారెడ్డి, ప్రాణ్య) తన వెంటతీసుకొచ్చి పార్థసారథిని ఆశ్రయిస్తుంది. ప్రతీకార ఇతివృత్తాలంటే ఇష్టపడే పార్థసారథి ఆ ఐదుగురు మహిళలకు సహాయం చేస్తానని ఒప్పుకుంటాడు. ఇంతకి ఆ ఐదుగురు మహిళలు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు? నగరంలోని బ్యాంక్‌దోపీడీ సందర్భంగా చంపబడిన ఐదురుగు వ్యక్తులకు, సరస్వతి బృందానికి ఉన్న సంబంధమేమిటి? చివరకు ఈ గ్యాంగ్ అన్వేషిస్తున్న హంతకుడెవరు? అనే ఆసక్తికరమైన అంశాల సమాహారమే మిగతా చిత్ర కథ.

సాదాసీదా ప్రతీకార కథ ఇది. అయితే దీనికి కావాల్సినంత వినోదం, భావోద్వేగాలు మేళవించి ఆసక్తికరంగా చెప్పాలని ప్రయత్నించారు దర్శకుడు విక్రమ్ కె కుమార్. సాధారణంగా ప్రతీకార కథలు సీరియస్‌గా సాగుతూ ప్రతి మలుపులో ఉత్కంఠను పంచేలా ఉంటాయి. అయితే ఈ రివేంజ్ స్టోరీలో అలాంటి అనూహ్యమైన మలుపులు ఏమీ ఉండవు. ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేని ఐదుగురు మహిళలు ఓ బృందంగా ఏర్పడటం అన్నది కొత్త పాయింట్‌గా అనిపిస్తుంది. విశ్రాంతికి ముందే హంతకుడెవరో తెలిసిపోవడంతో కథలో చివరిదాకా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాల్ని కొనసాగించే వీలులేకుండా పోయింది. అయితే సినిమా ఆద్యంతం వినోదప్రధానంగా నడిపించడంలో మాత్రం దర్శకుడు సఫలీకృతుడయ్యారు. ప్రథమార్థంలో ఐదుగురు మహిళలు, నాని మధ్య జరిగే సంఘటనలు కావాల్సినంత వినోదాన్ని పంచాయి.

హంతకుడి ఆనవాళ్ల కోసం తొలుత గ్యాంగ్ చేసే ప్రయత్నాలు మంచి సస్పెన్స్‌ను పంచాయి. అయితే ద్వితీయార్థంలో కథాగమనం పట్టుతప్పినట్లుగా అనిపించింది. హంతకుడు తనను వెంటాడుతున్న గ్యాంగ్ గురించి తెలుసుకొని వారిని అంతమొందించాలని చేసే ప్రయత్నాలతో ద్వితీయార్థం మొదలవుతుంది. అయితే ఈ క్రమంలో చోటుచేసుకునే సంఘటనలన్నీ ప్రేక్షకుల ఊహకు అందేలా ఉండటంతో ఏమాత్రం థ్రిల్‌ను పంచలేకపోయాయి. ైక్లెమాక్స్‌ను కూడా సింపుల్‌గా ముగించారు. అయితే ఈ సాధారణ ప్రతీకార కథను భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో అందంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు విక్రమ్ కె కుమార్. కథాగమనంలో గ్యాంగ్ మధ్య ఏర్పడే ఎమోషనల్ బాండ్‌ను హృద్యంగా ఆవిష్కరించారు. అనాథ అయిన పార్థసారథి ఐదుగురి మహిళల్లో తన కుటుంబాన్ని చూసుకోవడం హార్ట్‌టచింగ్ అనిపిస్తుంది. రివేంజ్ కథను సీరియస్ అంశాలతో కాకుండా చక్కటి హాస్యాన్ని జోడించి చూపించడం ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు. కథ అంత ప్రభావవంతంగా లేకపోయినా దర్శకుడు విక్రమ్ కె కుమార్ తనదైన సెన్సిబిలిటీస్‌ను ఎక్కడా మిస్ చేయలేదు. ప్రతీకార కథలో కూడా చక్కటి మానవీయ కోణాన్ని చూపించే ప్రయత్నం చేశారు.

ఈ సినిమాకు నాని, లక్ష్మీ పాత్రలు ఆయువుపట్టులా నిలిచాయి. తనదైన కామెడీ టైమింగ్, పంచ్‌డైలాగ్‌లతో నాని మెప్పించాడు. ఓ సాధారణ కథను తనదైన నటనతో రక్తికట్టించాడు. నానిస్ గ్యాంగ్‌లీడర్ టైటిల్‌కు తగినట్లుగా ఇది నాని వన్‌మెన్ షోగా చెప్పవచ్చు. ఇక సరస్వతి పాత్రలో లక్ష్మీ పరకాయప్రవేశం చేసింది. తనదైన విలక్షణ అభినయంతో పాత్రకు ప్రాణప్రతిష్ట చేసింది. నూతన నాయిక ప్రియాంక అందంగా కనిపించింది. ఆమె కళ్లు చక్కటి హావభావాల్ని పలికించాయి. శరణ్య తనదైన పరిధిలో మెప్పించింది. శనక్కాయల సంతూర్‌గా వెన్నెల కిషోర్ నవ్వుల్ని పంచాడు. ఇక ప్రతినాయకుడి పాత్రలో నటించిన కార్తికేయ ఫరవాలేదనిపించాడు. అతనిలో విలనీ ఛాయలు ఎక్కువగా కనిపించలేదు. ప్రతినాయకుడి పాత్రల్లో అతన్ని స్వీకరించలేం అనే భావన కలుగుతుంది. అయితే రేసర్‌గా కార్తికేయ లుక్స్ ైస్టెలిష్‌గా అనిపించాయి. ఇక ప్రతి సన్నివేశంలో దర్శకుడిగా విక్రమ్ కె కుమార్ తన ముద్రను ప్రదర్శించాడు. అయితే ప్రయోగాత్మక ఇతివృత్తాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్న ఆయన నుంచి ఇలాంటి సింపుల్ కథను ఎవరూ ఊహించలేరు. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. నిర్మాణ విలువలు టాప్‌క్లాస్‌లో ఉన్నాయి. అనిరుధ్ సంగీతం ఫర్వాలేదనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది.

కథాంశంపరంగా ఈ గ్యాంగ్‌లీడర్‌లో ఎలాంటి కొత్తదనం లేదు. రివేంజ్ స్టోరీకి కావాల్సిన ఉత్కంఠ, మలుపులూ లేవు. అయితే నాని పర్‌ఫార్మెన్స్, దర్శకుడు విక్రమ్ కుమార్ టేకింగ్...ఆద్యంతం వినోదప్రధానంగా కథ సాగడం ప్లస్‌పాయింట్స్‌గా చెప్పవచ్చు. బాక్సాఫీస్ రేసులో ఈ గ్యాంగ్‌లీడర్ ఫలితం ఏమిటో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే..

రేటింగ్: 2.75/5


5578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles