నాని, సాయి పల్లవి... 'ఎంసీఏ' మూవీ రివ్యూ

Thu,December 21, 2017 06:09 PM
Nani MCA Movie review

ఫిదా తర్వాత తెలంగాణ నేపథ్య చిత్రాలకు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాన్ని ఆవిష్కరించే సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దర్శకనిర్మాతలు కూడా తెలంగాణ నేపథ్యాన్ని సక్సెస్‌ఫుల్ బాక్సాఫీస్ ఫార్ములాగా పరిగణిస్తున్నారు. వరంగల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంసీఏ తెరకెక్కడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన దర్శకుడు శ్రీరామ్‌వేణు ప్రచార చిత్రంలో వరంగల్ అందాలను సహజంగా చూపిస్తూ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని మరింతగా పెంచారు.

నాని(నాని) ఓ మధ్యతరగతి యువకుడు. ఏ పనీపాట లేకుండా స్నేహితులతో బలాదూర్‌గా తిరుగుతుంటాడు. తల్ల్లిదండ్రులు లేని అతడికి అన్నయ్య(రాజీవ్‌కనకాల) అంటే ప్రాణం. చిన్ననాటి నుంచి ఇద్దరు స్నేహితుల్లా పెరుగుతారు. అన్నయ్యకు జ్యోతి(భూమిక)తో పెళ్లి కావడంలో నానికి కష్టాలు మొదలవుతాయి. వదిన వల్ల అన్నయ్య దూరమయ్యాడనే భావనతో వుంటాడు నాని. ఈ క్రమంలో వదినను అపార్థం చేసుకుంటాడు. దానికి తోడు ఆర్టీవోగా పనిచేసే జ్యోతికి వరంగల్ బదిలీ కావడంతో నాని ఆమెతో పాటు వెళ్లాల్సివస్తుంది.

ఇష్టంలేకపోయినా అన్నయ్య మీద ప్రేమ కారణంగా వరంగల్ వెళ్తాడు నాని. వదిన పురమాయించే పనులతో విసుగు చెందిన నాని కొద్దిరోజుల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ పల్లవి(సాయిపల్లవి) పరిచయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. కాలక్రమంలో వదిన తనకు శత్రువు కాదని, తన మేలు కోరు ఆప్తురాలనే నిజం తెలుసుకున్న నాని ఆమెను అభిమానించడం మొదలుపెడతాడు. ఇంతలోనే వరంగల్ శివ అనే రౌడీ కారణంగా నాని కుటుంబం చిక్కుల్లో పడుతుంది. జ్యోతిని పది రోజుల్లోనే చంపేస్తానని నానితో ఆ రౌడీ ఛాలెంజ్ చేస్తాడు. తన వదినను కాపాడుకోవడానికి నాని ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఆ రౌడీ బారి నుంచి ఆమెను ఏ విధంగా కాపాడుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

మధ్యతరగతి కుటుంబంలో ఉండే అనుబంధాలు, ఆప్యాయతలను వాస్తవిక కోణంలో ప్రతిబింబించే చిత్రమిది. నిజజీవితంలో తాను చూసిన అనుభవాలకు వాణిజ్య హంగులను జోడించి దర్శకుడు శ్రీరామ్‌వేణు ఈ కథను అల్లుకున్నారు. భావోద్వేగాలకు వినోదాన్ని మిళితం చేసి సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు. ప్రథమార్థంలో వదిన కారణంగా నాని పడే ఇబ్బందులు, బావా మరదలి లవ్‌ట్రాక్‌తో సరదాగా సాగుతుంది. ప్రతి సన్నివేశంలో వినోదాన్ని పుట్టించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ద్వితీయార్థంలో కరుడుగట్టిన విలన్‌ను హీరో తన తెలివితేటలతో ఎలా ఎదుర్కొన్నాడనే దృక్కోణంలో కథను నడిపించాడు. ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో సెకండాఫ్ ఉత్కంఠగా సాగుతుంది.

విలన్ ఆటకట్టించేందుకు నాని వేసే ప్లాన్‌లు ఆకట్టుకుంటాయి. అయితే ద్వితీయార్థంలో వేగం మందగించడం, మూసధోరణిలో కథనం సాగడం కొంత మైనస్‌గా మారాయి. పతాక ఘట్టాలు దర్శకుడు సాదాసీదాగా ముగించిన తీరు నిరాశను కలిగిస్తుంది.

పాత్ర ఏదైనా తన సహజ నటనతో దానికి రక్తికట్టిస్తుంటారు నాని. ఈ సినిమాలో మిడిల్‌క్లాస్ అబ్బాయిగా మరోమారు చక్కటి అభినయంతో ఆకట్టుకున్నారు. తన కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టడానికి శాయశక్తులా కృషిచేశారు. ఫిదా తరహాలోనే ఈ సినిమాలో హుషారైన నటనతో ఆకట్టుకుంది సాయిపల్లవి. నాని, సాయిపల్లవి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

ఖుషి, మిస్సమ్మతో పాటు పలు సినిమాల్లో కథానాయికగా నటించిన భూమిక చాలా కాలం విరామం తర్వాత ఈ సినిమాతో తెలుగులో పునరాగమనం చేసింది. వదిన పాత్రకు వందశాతం న్యాయం చేసింది. కొత్త కుర్రాడు విజయ్‌వర్మ తన విలనిజంతో భయపెట్టాడు. రాజీవ్‌కనకాల, ప్రియదర్శి, రచ్చరవి, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ తమ పరిధుల మేర నవ్వించారు.

మధ్యతరగతి కథకు వరంగల్ నేపథ్యాన్ని ఎంచుకోవడం సినిమాకు కలిసివచ్చింది. వరంగల్ అందాలను సినిమాలో సహజంగా ఆవిష్కరించారు. వేయిస్తంభాల దేవాలయం, లక్నవరం చెరువు, వరంగల్ కోటతో పాటు వరంగల్ పరిసరాల్ని కెమెరామెన్ సమీర్‌రెడ్డి సహజంగా చూపించిన తీరు బాగుంది. దేవిశ్రీప్రసాద్ బాణీల్లో టైటిల్‌సాంగ్‌తో పాటు మరోగీతం వినసొంపుగా సాగింది. నేపథ్య సంగీతం కథలోని ఎమోషన్స్‌ను బలంగా చాటడానికి దోహదపడింది.

విలువలతో కూడిన చిత్రాలు, మనవైన అనుబంధాలు, ఆప్యాయతల్ని ప్రతిబింబించే కథాంశాలతో సినిమాలు చేసే దిల్‌రాజు తన అభిరుచులకు అనుగుణంగా ఎక్కడా రాజీపడకుండా సినిమాను తెరకెక్కించారు. వదిన, మరిది మధ్య ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ తెలుగులో సినిమాలు వచ్చి చాలా కాలమైంది. ఎంసీఏ సినిమాకు ఆ ఆంశమే ప్రధాన బలంగా నిలిచింది. కథలో నవ్యత లేకపోయినా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకనిర్మాతలు ఈసినిమాను రూపొందించడంలో విజయవంతమయ్యారు.
రేటింగ్: 3/5

5460
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles