రివ్యూ: ‘సవ్యసాచి’

Fri,November 2, 2018 02:18 PM
Naga Chaitanyas Savyasachi Movie Twitter review

సినిమాల ఎంపికలో నవతరం కథానాయకుల పంథా మారుతోంది. తమ ఇమేజ్‌కు అనుగుణమైన సినిమాలు చేస్తూనే అడపాదడపా ప్రయోగాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సవ్యసాచితో నాగచైతన్య అలాంటి ప్రయత్నమే చేశారు. ప్రేమమ్ తర్వాత నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కలయికలో తెరకెక్కిన సినిమా ఇది. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే సరికొత్త పాయింట్‌కు తోడు మాధవన్ ప్రతినాయకుడిగా నటించడంతో ప్రారంభం నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చింది.


వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ వల్ల తల్లి గర్భంలోనే కవలలిద్దరూ కలిసిపోయి ఒకరిగా పుడతారు. పైకి ఒకరిలా కనిపించినా అంతర్లీనంగా వారిలో మరో వ్యక్తి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ సమస్యతో జన్మిస్తాడు విక్రమ్ ఆదిత్య(నాగచైతన్య). ఈ సిండ్రోమ్ కారణంగా ఎడమచేయి అతడి నియంత్రణలో ఉండదు. తన స్నేహితులతో కలిసి యాడ్ ఫిలిం సంస్థను నిర్వహిస్తుంటాడు. అక్క శ్రీదేవి(భూమిక), కోడలు మహాలక్ష్మి అంటే విక్రమ్ ఆదిత్యకు ప్రాణం. కాలేజీ రోజుల్లోనే చిత్ర(నిధి అగర్వాల్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడతడు. ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటున్న తరుణంలో కుటుంబ పరిస్థితుల కారణంగా చిత్రకు దూరమవుతాడు. ఆరేళ్ల తర్వాత కాకతాళీయంగా చిత్రను కలుస్తాడు. విక్రమ్ ప్రేమలోని నిజాయితీని చూసి చిత్ర అతడిని ఇష్టపడుతుంది. అంతా సవ్యంగా సాగిపోతున్న విక్రమ్ ఆదిత్య జీవితం అరుణ్‌రాజ్(మాధవన్) కారణంగా చిన్నాభిన్నం అవుతుంది. విక్రమ్ బావతో పాటు అతడికి ఆప్తులైన వారందరిని చంపి కోడలు మహాలక్ష్మిని కిడ్నాప్ చేస్తాడు అరుణ్‌రాజ్. దాంతో కంటికి కనిపించిన శత్రువు కోసం విక్రమ్ అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆరుణ్‌రాజ్‌ను కనిపెట్టి అతడిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు. విక్రమ్‌పై అరుణ్‌రాజ్ పగను పెంచుకోవడానికి కారణమేమిటన్నదే మిగతా కథ.

వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే అరుదైన సమస్యకు కుటుంబ బంధాలు, ప్రతీకార డ్రామాను జోడించి దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించారు. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ వల్ల విక్రమ్‌కు ఎదురయ్యే సమస్యల నుంచి కావాల్సినంత వినోదాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేశారు. ఎడమ చేయి ఆధీనంలో ఉంచుకోవడానికి విక్రమ్ చేసే ప్రయత్నాలన్నీ నవ్విస్తాయి. ప్రథమార్థం మొత్తం విక్రమ్, చిత్ర ప్రణయ ఘట్టాలతో సరదాగా సాగుతుంది. వెన్నెలకిషోర్, సత్య, విద్యుల్లేఖరామన్, షకలక శంకర్‌లపై తెరకెక్కించిన కామెడీ వర్కవుట్ అయ్యింది. ద్వితీయార్థంలో అసలు కథలోకి వెళ్లారు దర్శకుడు. తాను ఎవరో ప్రపంచానికి తెలియకుండా అరుణ్‌రాజ్.. విక్రమ్‌ను సమస్యల వలయంలోకి నెట్టే సన్నివేశాలు ఉత్కంఠను పంచుతాయి. ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో ద్వితీయార్థం మొత్తం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు దర్శకుడు. తన తెలివితేటలను గుర్తించని వారిపై ద్వేషంతో సైకోగా మారిన అరుణ్ రాజ్‌ను విక్రమ్ తన ఎడమచేయి సహాయంతో ఎలా పట్టుకోగలిగాడో చూపించిన విధానం బాగుంది.


రెగ్యులర్ రివేంజ్ కథను కొత్తగా చెప్పడంలో కొంతవరకు దర్శకుడు సక్సెస్ అయ్యారు.వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే పాయింట్ బాగానే ఉన్నా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పలేకపోయారు దర్శకుడు. లాజిక్‌లకు దూరంగా కథాగమనం సాగడం చిత్రానికి ప్రధాన అవరోధంగా మారింది. నాయకానాయికల ప్రేమకథను రొటీన్‌గా కాకుండా కొత్తదనంతో తెరకెక్కిస్తే బాగుండేది. అరుణ్‌రాజ్ సమాజంపై ద్వేషం పెంచుకోవడానికి గల కారణాలు బలంగా లేవు. చిన్న చిన్న కారణాలతో మనుషుల ప్రాణాలను తీస్తాడని చూపించడం ఆకట్టుకోదు. మాధవన్‌లోని విలనిజాన్ని సంభాషణల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం పూర్తిగా తేలిపోయింది. అరుణ్‌రాజ్ ఉనికి తెలుసుకోవడానికి విక్రమ్ వేసిన ఎత్తుల్లో లాజిక్ లోపించింది. హీరోకు ఎడమచేయి నియంత్రణలో ఉండదనే పాయింట్ నుంచి వినోదాన్ని రాబట్టుకునే అవకాశం ఉండి వినియోగించుకోలేకపోయారు.

వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌తో బాధపడే యువకుడిగా, కుటుంబ క్షేమం కోసం అనుక్షణం తపన పడే వ్యక్తిగా భిన్న పార్శాల్లో కూడిన పాత్రలో నాగచైతన్య చక్కటి వైవిధ్యతను ప్రదర్శించారు. వినోదం, ఎమోషన్స్‌ను మేళవిస్తూ అతడి పాత్రను చక్కగా తీర్చిదిద్దారు దర్శకుడు. మాధవన్ నటించిన తొలి తెలుగు చిత్రమిది. తన హావభావాలు, నటనానుభవంతో ప్రతినాయకుడి పాత్రలో ఒదిగిపోయారు. నాగచైతన్య, మాధవన్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. నిధి అగర్వాల్ కేవలం పాటలకే పరిమితమైంది. అభినయపరంగా ఆమె చేసిందేమీ లేదు. కథానాయకుడి సోదరిగా భూమిక నటన పర్వాలేదనిపిస్తుంది.

సాంకేతికంగా కీరవాణి బాణీలు, యువరాజ్ ఛాయాగ్రహణం సినిమా ప్రధాన బలంగా నిలిచాయి. కీరవాణి బాణీల్లో చాటుగా చాటుగా దాచిన మాటలు గీతం బాగుంది. నేపథ్య సంగీతం కథలోని ఎమోషన్‌ను బలంగా పండించడానికి దోహదపడింది. మైత్రీ మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కాన్సెప్ట్‌ను నమ్మి ఎక్కడ రాజీపడకుండా ఈసినిమాను నిర్మించారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని ఈ సినిమా కొంతవరకు మెప్పించే అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్‌లో సినిమాను నిర్మించడం, పోటీగా పెద్ద చిత్రాలేవీ లేకపోవడం కలిసివచ్చింది. నాగచైతన్య అభిమానుల్ని అలరిస్తుంది.

3583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles