మిస్టర్ మజ్ను రివ్యూ..

Fri,January 25, 2019 01:41 PM

టైటిల్ : Mr మజ్ను
తారాగణం: అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్, నాగబాబు, జయప్రకాష్, ప్రియదర్శి, హైపర్ ఆది, సితార తదితరులు..
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: అవినాష్ కొల్లా
సంగీతం: తమన్
సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి


ప్రతిభతో సంబంధం లేకుండా చిత్రసీమలో వారసులకు బ్రహ్మరథం పట్టే రోజులు ఎప్పుడో పోయాయి. ఎంతటి సినీ నేపథ్యం ఉన్నప్పటికీ యువ హీరోలు తమ ప్రతిభకు సానపెడుతూ కష్టపడి రాణించాల్సిందే. ఇదే విషయాన్ని అక్కినేని యవహీరో అఖిల్ కూడా అంగీకరించారు. తాను నటించిన గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా తాజా చిత్రం మిస్టర్ మజ్ను తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని ప్రచార కార్యక్రమాల్లో ధీమా వ్యక్తం చేశారు. తొలిప్రేమ చిత్రంతో దర్శకుడిగా ఆకట్టుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు నిర్ధేశక బాధ్యతల్ని తీసుకోవడం సినిమాపై అంచనాల్ని పెంచింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులముందుకొచ్చిన మిస్టర్ మజ్ను అఖిల్ అంచనాల్ని నిజం చేసిందా? తొలివిజయం కోసం ఎదురుచూసిన అతని ప్రయత్నం ఫలించిందా?..ఇవన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

విక్రమ్ కృష్ణ (అఖిల్ అక్కినేని) అలియాస్ విక్కీ లండన్‌లో మాస్టర్స్ చదువుతుంటాడు. అమ్మాయిలను ఇట్టే పడేస్తుంటాడు. వారితో సరదాగా గడపడమే కానీ ప్రేమాగీమా జాన్తానై అనే టైపు అతనిది. విక్కీకి లండన్‌లోనే నిక్కీ (నిధి అగర్వాల్) పరిచయమవుతుంది. మన్మథుడి తరహా విక్కీ మనస్తత్వాన్ని నిక్కీ అస్సలు ఇష్టపడదు. ఈలోగా తన బాబాయ్ కూతురి పెళ్లి కోసం హైదరాబాద్‌కు వచ్చిన విక్కీకి అనుకోకుండా అక్కడ నిక్కీ తారసపడుతుంది. నిక్కీ తనకు కాబోయే బావ చెల్లెలు అని తెలుస్తుంది. భిన్న ధృవాలైన ఈ జంట కొంతకాలం కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది.ఈ క్రమంలో ఏం జరిగింది? ఒకరిమనసులు ఒకరు గెలుచుకోవడానికి ప్రేమజంట చేసిన ప్రయత్నాలేమిటి? వారి ఎలాంటి సంఘర్షణ చోటుచేసుకుంది? అన్నదే మిగతా చిత్ర కథ.

ఇంతవరకు నేను రెండు నెలలకు మించి ఒక్క అమ్మాయితో కూడా స్నేహం చేయలేదు తెలుసా? అనే అబ్బాయి...నిజమైన ప్రేమ ఏమిటో అతనికి తెలియజెప్పాలని పరితపించే అమ్మాయి..ఇలా భిన్న మనస్తత్వాలు కలిగిన అబ్బాయి అమ్మాయి సంఘర్షణే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. కుటుంబ నేపథ్యంలో ఈ కథను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. బయటకు ప్లేబాయ్‌గా కనిపించే విక్కీలో లోలోన మాత్రం స్త్రీగౌరవించే సంస్కారం, కుటుంబం పట్ల బాధ్యత తెలుసుకుని ప్రవర్తించే మనస్తత్వం ఉంటుంది. ఈ లక్షణాలు నిక్కీకి నచ్చి అతని ప్రేమలో పడుతుంది. రెండు నెలలు టైమ్ తీసుకొని తన ప్రేమ గొప్పతనం తెలుసుకోమంటుంది. ఈ లోగా ఇద్దరి మధ్య ఆపార్థాలు తలెత్తుతాయి. ఈ ఎపిసోడ్‌తో ప్రథమార్థాన్ని ముగించాడు దర్శకుడు. ఏ ప్రేమకథలో అయిన నాయకానాయికల మధ్య బలమైన సంఘర్షణ అవసరం. అప్పుడే కథతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతాడు. ఇందులో నాయకానాయికల మధ్య కలహాలు తలెత్తడానికి అంతగా సంఘర్షణ కనిపించదు. ప్రథమార్థాన్ని కథానాయికా కోణంలో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థాన్ని విక్కీ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిపించే ప్రయత్నం చేశాడు. తన తప్పును తెలుసుకున్న విక్కీ ప్రియురాలి మనసు గెలుచుకునే ప్రయత్నాల్ని ద్వితీయార్థంలో చూపించారు. అయితే ఈ ప్రేమ కథ ఎక్కడా హృదయాల్ని స్పృశించలేకపోయింది. సన్నివేశాల్లో ఆర్థ్రత లోపించడంతో పేలవంగా అనిపించాయి. సంభాషణలపై పెట్టిన శ్రద్ధ సన్నివేశాలపై పెట్టలేదనిపిస్తుంది. సాధారణ ప్రేమ కథకు అంతే సింపుల్‌గా ైక్లెమాక్స్‌ను రాసుకున్నారు. పోరాట దృశ్యాల్ని అవసరం లేకపోయినా ఇరికించారనే భావన కలుగుతుంది. ఎక్కడా ఎలాంటి మలుపులు లేకుండా కథ, కథనాలు ప్రేక్షకుల ఊహకు అనుగుణంగా సాగాయి. ప్రియదర్శి, హైపర్ ఆదిలతో కామెడీ ఆకట్టుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న సంభాషణలు బాగున్నాయి. నేను అబద్ధాన్ని ప్రేమ అనుకున్నాను..నువ్వు ప్రేమను అబద్ధం అనుకున్నావు చేసిన పనికి కృతజ్ఞతగా ప్రతిసారి థాంక్యూ చెబితే ఇక ఎప్పుడూ సారీ చెప్పాల్సిన అవసరం లేదు వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

అఖిల్‌కిది మూడో చిత్రం. నటుడిగా ప్రతి సినిమాకు మంచి పరిణితి కనబరుస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ స్క్రీన్ ప్రజెన్స్, లుక్స్‌పరంగా బాగున్నాయి. ప్రథమార్థంలో ప్లేబాయ్ తరహా నటనతో ఆకట్టుకున్నాడు. ఇక కథానాయిక నిధి అగర్వాల్ తన పాత్రలో చక్కగా రాణించింది. సెకండ్‌హాఫ్‌లో పుల్లారావు పాత్రలో హైపర్ ఆది కామెడీ అలరించింది. నాగబాబు, సితార, జయప్రకాష్, రావు రమేష్, సుబ్బరాజు తమ పరిధుల మేరకు బాగా నటించారు. దర్శకుడు వెంకీ అట్లూరి తొలిప్రేమ తరహాలోనే ప్రేమికుల మధ్య అపోహలు, మనస్పర్థలు, తిరిగి ఒక్కటవ్వడం..ఈ లైన్‌లోనే ఈ కథను రాసుకున్నాడు. కథను ఆద్యంతం ఆహ్లాదభరితంగా భావోద్వేగా ప్రధానంగా నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో ఫీల్ మిస్ అయిన భావన కలిగింది. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. లండన్ అందాలను చక్కగా బంధించారు. తమన్ పాటలు కొన్ని మెలోడీ ప్రధానంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. భారీ చిత్రాలకు పెట్టింది పేరైన శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమా విషయంలో కూడా ఖర్చు విషయంలో ఎక్కగా రాజీపడలేదు. ఉన్నతమైన మేకింగ్ వాల్యూస్ కనిపించాయి.

ప్రేమకథలో కొత్తదనం కంటే..కథను కొత్తగా చెప్పడంలో దర్శకుడి ప్రతిభాపాటవాలు దాగివుంటాయి. ఈ సినిమాకు సింపుల్ పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ దానిని మరింత ఆమోదయోగ్యంగా ఆవిష్కరిస్తే బాగుండేదనిపించింది. ప్రస్తుతం అఖిల్ భారీ కమర్షియల్ సక్సెస్‌కోసం ఎదురుచూస్తున్నాడు. అతనికున్న ఇమేజ్‌కు ఆంతటి విజయం అవసరం కూడా. అయితే ఈ సినిమా వాణిజ్యపరంగా మాత్రం యావరేజ్‌గా నిలిచే అవకాశాలున్నాయి. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ఏమిటో ప్రేక్షకులే నిర్ణయించాలి.

రేటింగ్: 2.75
మిస్టర్ మజ్ను: ప్రేమడోస్ తగ్గింది..

8050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles