ఎన్నో విలక్షణమైన పాత్రలలో, మంచి భావం ఉన్న కథాంశాలతో మెప్పించిన జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్. మలయాళ మెగాస్టార్ గా అభిమానులతో పిలిపించుకునే ఈ నటుడు గత ఏడాది వరుస విజయాలు అందుకున్నాడు. త్వరలో వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న మహా భారతంలోను మోహన్ లాల్ ప్రధాన పాత్ర చేయనున్నాడు. ప్రస్తుతం 600 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఒడియన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదొక ఫాంటసీ మూవీ అని చెబుతున్నారు. ఇందులో మోహన్ లాల్ లుక్ చాలా కొత్తగా ఉంది. చిత్రంలో మోహన్ లాల్ ది 'ఓడియన్ మాణిక్యన్' అనే పాత్ర అని తెలుస్తుండగా ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషలలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. 3డీ టెక్నాలజీతో ఈ మూవీ రూపొందుతుంది . శ్రీ కుమార్ మీనన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఒడియన్ చిత్రంలో మంజు వారియర్, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, సిద్ధిఖీ ప్రధాన పాత్ర లు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆశిర్వాద్ సినిమాస్ బేనర్ పై నిర్మితమవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ వారణాసిలో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. తాజాగా మోహన్‌లాల్ సన్యాసి గెటప్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం మోహన్ లాల్ 50 రోజులలో 20 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరచారు. అసలు ఒడియన్ అంటే ఓ కల్పిత జీవి. సగం మనిషి, సగం జంతువు రూపంలో ఉండి అతీంద్రియ శక్తులున్న జీవి రాత్రిపూట అడవులలో సంచరిస్తుందనేది కేరళలలోని మలబార్ ప్రాంత ప్రజల నమ్మకం. అలాంటి జీవి జీవిత కాలంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఒడియన్ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులలో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.