బోరింగ్ ‘మన్మథుడు’

Fri,August 9, 2019 02:18 PM

మన్మథుడు-2 రివ్యూ


నటీనటులు: నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్, లక్ష్మీ, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఝాన్సీ, దేవదర్శిని, నిషాంతి తదితరులు నటించారు. అతిథి పాత్రల్లో సమంత, కీర్తిసురేష్ నటించారు.
నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌టైప్రైజెస్, వయాకమ్ 18 మోషన్ పిక్చర్స్, ఆనంది ఆర్ట్స్,
నిర్మాతలు: నాగార్జున, జెమిని కిరణ్, అజిత్,
సంగీతం: చైతన్ భరద్వాజ్,
కెమెరా: ఎం.సుకుమారన్.

నాగార్జున కెరీర్‌లో మన్మథుడు చిత్రానికి ప్రత్యేక స్థానం వుంది. కె.విజయభాస్కర్ దర్శకత్వ వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. పదిహేడేళ్ల క్రితం వచ్చన ఈ చిత్రానికి త్రివిక్రమ్ అందించిన కథ, మాటలే ప్రధాన బలంగా నిలిచాయి. రొమాంటిక్ అంశాలతో పాటు పంచ్ డైలాగ్‌లు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే వున్నాయి. అయితే ఆ సినిమాని గుర్తు చేస్తూ అదే టైటిల్‌తో తాజాగా నాగార్జున చేసిన చిత్రం మన్మథుడు-2. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. గతంలో వచ్చిన మన్మథుడు చిత్రానికి సీక్వెల్‌గా కాకుండా ఓ ఫ్రెంచ్ సినిమా(ఐ డూ)కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే మన్మథుడు-2 పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ఫారిన్ కథ ఆశించిన స్థాయిలోనే వుందా?. పదిహేడేళ్ల క్రితం వచ్చిన మన్మథుడు చిత్రాన్ని పోల్చకుని థియేటర్‌కు వచ్చిన సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుందా?. నాగార్జున భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఆయన నమ్మకాన్ని ఎంత వరకు నిజం చేసింది? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ: 1928లో ఇండియా నుంచి పోర్చుగల్‌కు పనికోసం వెళ్లి అక్కడే స్థిరపడిన తెలుగు కుటుంబం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఆ కుటుంబంలోని రెండో తరం వారసుడు సామ్ ఉరాఫ్ సాంబశివరావు (నాగార్జున)కు పెళ్లంటే ఇష్టం వుండదు. అతనికి ఇద్దరు అక్కలు (దేవదర్శిని), (ఝాన్సీ) ఒక చెల్లి(నిషాంతి), ఓ తల్లి(లక్ష్మీ) వెంటారు. వయసు మీదపడుతున్నా సామ్ పెళ్లి చేసుకోవడం లేదని అతని తల్లి దిగులుపడుతూ వుంటుంది. సామ్ మాత్రం ప్లే బాయ్‌లా రోజుకో అమ్మాయిని మారుస్తూ ఈ లైఫ్ బాగుంది. మనకు పెళ్లి సరిపడదు అని పెళ్లి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఒక రోజు తన స్నేహితురాలు సుమ (కీర్తిసురేష్)ని తన వాళ్లకు పరిచయం చేయాలని ఇంటికి తీసుకెళతాడు. అక్కడ పెళ్లి ప్రస్థావన రావడంతో సుమకు కోపం వచ్చి అక్కడి నుంచి సామ్ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతుంది. దాంతో ఆగ్రహించిన సామ్ ఇంటి నుంచి వెళ్లిపోయి కిషోర్( వెన్నెల కిషోర్)తో కలిసి వేరుగా వుంటాడు. ఇదంతా భరించలేని సామ్ తల్లి లక్ష్మి మూడు నెలల్లో సామ్ పెళ్లి చేసుకోవాలని ఓ ప్రతిపాదన చేస్తుంది. చేసేది లేక రెస్టారెంట్‌లో డబ్బుల కోసం వేయిటర్‌గా పనిచేస్తున్న అవంతిక(రకుల్ ప్రీత్‌సింగ్)తో అగ్రిమెంట్ పెళ్లికి సామ్ ప్లాన్ చేస్తాడు. ఆ తరువాత పెళ్లి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన సామ్ కథ ఎలాంటి మలుపులు తిరిగింది?. ఇంతకీ అవంతిక ఎవరు?. ఆమె వెనకున్న కథేంటి?. సామ్, అవంతికల అగ్రిమెంట్ పెళ్లి జరిగిందా? లేదా అన్నది తెరమీదే చూడాలి.

నటీనటుల నటన:


మన్మథుడు పేరు వినగానే పదిహేడేళ్ల క్రితం కె.విజయభాస్కర్, త్రివిక్రమ్‌ల కలయికలో వచ్చిన సినిమా గుర్తొస్తుంది. అయితే సినిమాలో మన్మథుడికి అమ్మాయిలంటే పడదు. ఓ అమ్మాయి ప్రేమించి కనిపించకుండా వెళ్లిపోయిందని, గాఢంగా ప్రేమించిన తనని మోసం చేసిందని ద్వేషాన్ని పెంచుకున్న అభి అమ్మాయిలకు దూరంగా వుంటుంటాడు. కానీ ఈ మన్మథుడు-2 మాత్రం అందుకు భిన్నం. తన వారి కారణంగా తను ప్రేమించిన సుమ(కీర్తిసురేష్) తనని కాదని వెళ్లిపోయిందని ఈ మన్మథుడు ప్లేబాయ్‌గా మారి రోజుకో అమ్మాయితో గడిపేస్తుంటాడు. ఇలాంటి పాత్రలో నాగార్జున కొంత హద్దులు దాటి నటించాడని చెప్పొచ్చు. కన్నడ నటి అక్షరా గౌడతో పాటు కొంత మంది ఫారిన్ అమ్మాయిలతో కలిసి నటించిన సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బదికరంగా అనిపిస్తాయి. మన్మథుడు-2కు వచ్చే సరికి ప్లేబాయ్‌గా మారడం అంతగా ఆకట్టుకోదు. అయితే ఇలాంటి పాత్రని ఎంచుకుని నాగార్జున తనని తాను డీగ్రేడ్ చేసుకున్నాడని సగటు ప్రేక్షకుడు ఫీలయ్యేలా ఆయన పాత్ర చిత్రణ వుండటం ఈ చిత్రానికి ప్రధాన లోపంగా మారింది. ఇక మిగతా పాత్రల గురించి చెప్పాలంటే ఈ కథకి కీ రోల్‌గా మారిన రకుల్ గత చిత్రాలతో పోలిస్తే కొంత బోల్డ్‌గా నటించింది. సిగరేట్ తాగే సన్నివేశంతో పాటు యాంకర్ ఝాన్సీకి లిప్ కిస్ పెట్టే సన్నివేశాల్లోనూ పరిధికి మించి నటించినట్టుగా కనిపిస్తుంది. అయితే పతాక సన్నివేశాల్లో మాత్రం కొంత వరకు ఫరవాలేదనిపించింది. నాగార్జునకు అసిస్టెంట్‌గా నటించిన వెన్నెల కిషోర్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్‌ని తన భుజాలపై మోస్తూ సగటు ప్రేక్షకుడికి పెద్ద రిలీఫ్ ఇచ్చాడు. పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో బ్యాటింగ్‌కి దిగుతావేంట్రా... నువ్వు ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా నీ తుపాకి కాల్చలేదు అంటూ కొనసాగే డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.ఎప్పటిలాగే రావు రమేష్ తన టైమింగ్‌తోఆకట్టుకున్నారు. తల్లి పాత్రలో లక్ష్మి, అక్కలుగా ఝాన్సీ, దేవదర్శిన, చెల్లెలుగా నిషాంతి తమ పాత్రల పరిథిమేరకు నటించారు. అతిథి పాత్రల్లో మెరిసిన కీర్తి సురేష్, సమంత, కన్నడ నటి అక్షర గౌడలు అదనపు ఆకర్షణగా నిలిచారు.

సాంకేతిక నిపుణుల పనితీరు.


దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ ద్వితీయ విఘ్నం దాటలేకపోయాడు. హద్దులు మీరిన సన్నివేశాలతో చిత్రాన్ని ఆనాసక్తిగా మార్చాడు. ఇక పోర్చుగల్ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో ప్రతీ ఫ్రేమ్‌ని ఛాయాగ్రహకుడు మరింత అందంగా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా మూడ్‌ని ప్రతిభింబించడం కోసం ప్రతీ ఫ్రేమ్‌లోనూ కలర్స్‌ని వాడిని తీరు బాగుంది. ఆర్‌ఎక్స్ 100తో ఆకట్టుకున్న చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం, పాటలు ఆశించిన స్తాయిలో లేకపోవడం పెద్ద డ్రాబ్యాక్. చోటా కె. ప్రసాద్, బొంత నాగేశ్వరరావు ఎడిటింగ్ ప్రతిభ తెరపై కనిపించింది. కథను మరింత వేగంగా నడిపించడంలో ఎడిటింగ్ ప్లస్ అయ్యింది.

చివరి మాట:


మన్మథుడు పేరు వినగానే త్రివిక్రమ్ గుర్తొస్తారు. కానీ ఆయన మార్కు పంచ్ డైలాగ్‌లని ఆశించి సినిమాకు వచ్చిన ప్రేక్షకుడికి మన్మథుడు-2 డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో నిరాశపరుస్తుంది. తనకు సూటవ్వని పాత్రలో నాగార్జునని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరు. ఈ చిన్న లాజిక్‌ని మరిచిన రాహుల్ రవీంద్రన్ ఇలాంటి బోల్డ్ కథకు మన్మథుడు-2 టైటిల్‌ని పెట్టి పెద్ద సాహసం చేశారని చెప్పొచ్చు. కథ, కథనంలో సగటు ప్రేక్షకుడిని లీనం చేయడం, కథని గ్రిప్పింగ్‌గా నడిపించడంలో రాహుల్ విఫలమయ్యాడు. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుడికి ఇది నాగార్జున సినిమా అనడం కంటే వెన్నెల కిషోర్ షో అంటే బెటరేమో అనిపిస్తుంది. కొంతకాలం క్రితం నాగార్జున వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో చేసిన భాయ్ గురించి విడుదల తర్వాత ఎంతో రియలైజ్ అయ్యాడు. ఆ సినిమాను తన కుటుంబ సభ్యులను కూడా చూడొద్దని చెప్పిన విషయం మీడియాతో స్వయంగా తెలియజేశాడు నాగ్.. ఇప్పుడు మన్మథుడు-2 గురించి కూడా నాగార్జున ఎలా సమర్థించుకుంటాడో.. లేక రియలైజ్ అవుతాడో వేచిచూద్దాం...మన్మథుడు-2 చూసిన ప్రేక్షకులు ఇమ్మీడియట్‌గా త్రివిక్రమ్ మన్మథుడు చూస్తేనే కాస్త రిఫ్రెష్ అవుతారు...
లాస్ట్‌పంఛ్: మనసు లేని రెండో మన్మథుడు
రేటింగ్: 2/5

9223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles