మళ్లీరావా సినిమా రివ్యూ

Fri,December 8, 2017 05:16 PM
Malli Raava cinema review

సుమంత్ హిట్ అనే మాట విని ఏళ్లు గడిచాయి. సుదీర్ఘ సినీ ప్రయాణంలో కొన్ని విజయాలు దక్కినా వాటిని కొనసాగించడంలో విఫలమయ్యారాయన. సక్సెస్ కోసం భిన్నంగా అడుగులు వేసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తున్న ఆయన నూతన దర్శకుడు గౌతమ్‌తిన్ననూరితో చేసిన సినిమా మళ్లీరావా. సుమంత్‌కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టింది? అతడు కోరుకున్న విజయం దక్కిందా?లేదా?అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే....

కార్తీక్(సుమంత్) ఓ పద్నాలుగేళ్ల అల్లరి కుర్రాడు. తన స్కూల్‌లోనే కొత్తగా చేరిన అంజలి(ఆకాంక్షసింగ్) అనే అమ్మాయిని తొలిచూపులోనే ఇష్టపడతాడు. తన ప్రేమను ఆమెకు వ్యక్తం చేస్తాడు. అనుకోకుండా కార్తీక్, అంజలి విడిపోతారు. అంజలి తనకు దూరమైన ఆమె జ్ఞాపకాల్లోనే బతుకుతుంటాడు కార్తీక్. పదమూడేళ్ల తర్వాత కార్తీక్‌ను వెతుక్కుంటూ అంజలి తిరిగి వస్తుంది. అతడు పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థలోనే మేనేజర్‌గా చేరుతుంది. కార్తీక్ ఇంకా తనను ప్రేమిస్తున్నాడనే నిజం తెలుసుకొని అతడిని పెళ్లిచేసుకోవాలని అనుకుంటుంది. మరికొద్ది నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా కార్తీక్‌కు దూరంగా వెళ్లిపోతుంది అంజలి. ఆమె నిర్ణయానికి కారణమేమిటి? కార్తీక్‌కు దూరంగా ఎందుకు వెళ్లిపోయింది? తిరిగి వారిద్దరు ఎలా ఏకమయ్యారు? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

ప్రేమజంట జీవితంలోని మూడు దశలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రమిది. బాల్యంలో మొదలైన ఓ జంట ప్రేమకథఎలాంటి మలుపులు తిరిగింది? వారి మధ్య చోటుచేసుకున్న భావోద్వేగాలు, సంఘర్షణను చూపిస్తూ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్‌తిన్ననూరి. మూడు భిన్న కాలల్లో సాగే కథలో వైవిధ్యాన్ని చక్కగా చూపించారు. 1999 నాటి నేపథ్యాన్ని, ఆనాటి వాతావరణాన్ని సహజసిద్ధంగా చూపిస్తూ నాటితో పోలిస్తే నేడు ప్రేమను వ్యక్తం చేసే తీరులో వచ్చిన మార్పులను అర్థవంతంగా చెప్పారు. కథలో కొత్తదనం లేకపోయినా వినోదానికి భావోద్వేగాలను మిళితం చేస్తూ కథనాన్ని ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్‌అయ్యాడు. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ సినిమాను నడిపించిన తీరు బాగుంది.

కార్తీక్ పాత్రకు సుమంత్ వందశాతం న్యాయం చేశారు. చాలా రోజుల తర్వాత గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు. భావోద్వేగ ప్రధాన సన్నివేశాల్లో పరిణితితో కూడిన నటనను కనబరిచారు. సుమంత్, ఆకాంక్షసింగ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరోహీరోయిన్ల చిన్ననాటి పాత్రల్లో కనిపించిన సాత్విక్, ప్రీతి నటన ఆకట్టుకుంటుంది. హీరో స్నేహితుడిగా అభినవ్ తన సహజ నటనతో ఆకట్టుకున్నారు. మిర్చి కిరణ్ కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అతడిపై వచ్చే ప్రతి సన్నివేశం వర్కవుట్ అయింది. తెరపై నటులు కాకుండా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ప్రతి పాత్ర నిత్యజీవితంలో మనకు తారసిల్లే వ్యక్తులను తలపిస్తుంటుంది.

సాంకేతికంగా శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం, సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మళ్లీ రావా...గీతం వినసొంపుగా ఉంది. రాహుల్‌యాదవ్ నక్కా నిర్మాణవిలువలు బాగున్నాయి. చిన్న సినిమా అయినా ఎక్కడ ఆ అనుభూతి రాకుండా అత్యున్నతంగా తెరకెక్కించారు.
ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. రొటీన్‌కు భిన్నంగా స్వచ్ఛమైన ప్రేమకథను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో దర్శకనిర్మాతలు చేసిన మంచి ప్రయత్నంగా చెప్పవచ్చు.
రేటింగ్3/5

6137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS