'మజిలీ' రివ్యూ

Fri,April 5, 2019 01:41 PM

ప్రతి వ్యక్తి జీవనపయనంలో ఎన్నో మజిలీలు ఉంటాయి. ఏ ప్రయాణం ఏ మజిలీకి చేరుస్తుందో ఎవరూ ఊహించలేరు. జీవితప్రయాణం ఎప్పడు సాఫీగా సాగదు. అందులో ఎన్నో మలుపులు, వేదనలు, ఎత్తుపల్లాలు ఎదురవుతుంటాయి. అలాంటి జ్ఞాపకాలతో కూడిన యువకుడి జీవన మజిలీయే ఈ సినిమా. ఏమాయచేశావే, మనం చిత్రాలతో తెలుగు చిత్రసీమలో విజయవంతమైన జోడీగా గుర్తింపును సొంతం చేసుకున్న రియల్‌లైఫ్ దంపతులు నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత తొలిసారిగా వెండితెరపై జంటగా నటించిన చిత్రమిది. తొలి చిత్రం నిన్నుకోరి తరహాలోనే హృద్యమైన కథాంశాన్ని ఎంచుకొని దర్శకుడు శివనిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

వైజాగ్‌లోని జ్ఞానపురం రైల్వేకాలనీ చెందిన పూర్ణ(నాగచైతన్య)కు క్రికెట్ అంటే ప్రాణం. ఎప్పటికైనా ఇండియా తరపున క్రికెట్ ఆడాలని కలలు కంటుంటాడు. ఐటీఐ చేస్తూనే మరోవైపు వైజాగ్‌లోని లోకల్‌టీమ్స్ తరపున క్రికెట్ ఆడుతుంటాడు. నేవీ ఉద్యోగి కూతురు అన్షు,(దివ్యాంశకౌశిక్), పూర్ణల మధ్య గొడవలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరు పెళ్లిచేసుకోవాలని అనుకుంటారు. కానీ అన్షు తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లిచేసి వైజాగ్ నుంచి తీసుకెళ్లిపోతారు. దాంతో ఆమె జ్ఞాపకాల్లోనే బతుకుతూ తాగుడుకు బానిసగా మారుతాడు పూర్ణ. పూర్ణను ప్రాణంగా ప్రేమించిన శ్రావణి(సమంత) అతడిని పెళ్లిచేసుకుంటుంది. కానీ పూర్ణ మాత్రం ఆమెను ద్వేషిస్తుంటాడు. అయితే ఎప్పటికైనా అతడి మనసు మారుతుందనే ఆశతో శ్రావణి బతుకుతుంటుంది. ఆమె అనుకున్నట్లుగా పూర్ణ ఎలా మారిపోయాడు? శ్రావణి ప్రేమను ఎలా గుర్తిస్తాడు?వారి జీవితంలో మీరా అనే పదమూడేళ్ల చిన్నారి ఎలా ప్రవేశించింది?పూర్ణకు దూరమైన అన్షు ఏమైంది?అన్నదే మిగతా కథ.

భార్యాభర్తల అనుబంధానికి ప్రేమకథను, సున్నితమైన భావోద్వేగాల్ని జోడించి దర్శకుడు శివనిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేమలో ఓడిపోయిన ఓ యువకుడిని చివరకు ఆ ప్రేమే ఎలా గెలిపించింది?అతడిని ఏ విధంగా మంచివాడిగా మార్చింది?జ్ఞాపకాల మజిలీ దగ్గరే ఆగిపోయిన అతడు కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాడనే అంశాల్ని హృద్యంగా ఈ సినిమాలో చూపించారు. రెండు ప్రేమకథల్ని ఎమోషనల్‌గా నడిపించి ఆకట్టుకున్నారు దర్శకుడు. పూర్ణ పాత్ర పరిచయం, స్నేహితులతో కలిసి చేసే సందడితో సరదాగా సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అన్షు పాత్ర పరిచయం, పూర్ణతో ఆమె ప్రేమలో పడే సన్నివేశాల్ని అందంగా సాగుతాయి. మరోవైపు లోకల్ గ్యాంగ్‌లతో పూర్ణ గొడవలు పడటం, వారి ప్రేమకు ఎదురయ్యే అడ్డంకులతో సినిమాటిక్ ఫీల్‌కు దూరంగా ప్రథమార్థం సహజంగా ఉంటుంది. ద్వితీయార్థాన్ని అందుకు భిన్నంగా భార్యాభర్తల బంధాన్ని ఆవిష్కరిస్తూ నడిపించారు. భర్త తనను ద్వేషించిన అనుక్షణం అతడిని సమర్థిస్తూ వచ్చే భార్యగా నాగచైతన్య, సమంతల మధ్య వచ్చే ప్రతి సీన్ అర్థవంతంగా ఉంటుంది.నాగచైతన్య, సమంతల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకునే విధంగా వుంటాయి. ముఖ్యంగా పతాక ఘట్టాల్లో నాగచైతన్య, సమంతల అభినయం మనసుల్ని కదలిస్తుంది. ఒకవైపు భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమను చూపిస్తూనే తన కొడుకు బాగు కోసం రావురమేష్ పడే తపన, తన కూతురు కాపురం బాగుండాలని పోసాని కృష్ణమురళి లోని ఆవేదనను ఆలోచింపజేసేలా ఆవిష్కరించారు.

మధ్యతరగతి నేపథ్యంలో కథను నడిపించిన తీరు బాగుంది. రైల్వేకాలనీ, సమంత, నాగచైతన్య నివసించే ఇల్లు అన్ని వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. కామెడీ ట్రాక్‌లు, యాక్షన్, మసాలా సన్నివేశాల జోలికి పోకుండా నిజాయితీగా దర్శకుడు శివనిర్వాణ కథను చెప్పిన విధానం బాగుంది. కథ పాతదే అయినా కథనాన్ని కొత్తగా నడిపించారాయన. కథలో ప్రేక్షకుడు లీనమైయ్యే విధంగా దర్శకుడు కథనాన్ని మలిచిన విధానంతో ఓ ఫీల్‌గుడ్ సినిమా చూస్తున్న భావన కలిగించాడు. కథాగమనం నిదానంగా సాగడంతో చాలా చోట్ల సినిమాను సాగతీస్తున్న అనుభూతి కలుగుతుంది.అయితే తాను చెప్పాలనుకున్న ఎమోషన్స్‌ను బలంగా చెప్పేటప్పుడు కథ డైవర్షన్ తీసుకోకుండా దర్శకుడు తీసుకున్న జాగ్రత్త స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు కంటతడిపెట్టించే విధంగా వున్నాయి.

క్రికెట్, ప్రేమ, జీవితానికి మధ్య సంఘర్షణకు లోనయ్యే యువకుడిగా నాగచైతన్య పరిణతితో కూడిన నటనను కనబరిచారు. 19 ఏళ్ల యువకుడిగా, 34 ఏళ్ల భర్తగా రెండు పాత్రల మధ్య వైవిధ్యతను కనబరిచన తీరు బాగుంది. ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగే పాత్రలో ఇమిడిపోయాడు. భర్తను అమితంగా ప్రేమించే భార్యగా సమంత శ్రావణి పాత్రకు వందశాతం న్యాయంచేసింది. అతడి బాగు కోసం అనుక్షణం తపించే ఇల్లాలిగా ఆమె నటన హృదయాల్ని హత్తుకుంటుంది. నాగచైతన్య, సమంత నిజజీవితంలో భార్యభర్తలు కావడంతో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో అద్భుతంగా కుదిరింది. వారు కనిపించే ప్రతి సన్నివేశం సినిమాను నిలబెట్టింది. అన్షుగా దివ్యాంశకౌశిష్ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో పర్వాలేదనిపించింది. మధ్య తరగతి తండ్రులుగా రావురమేష్, పోసాని కృష్ణమురళి తమ అనుభవంతో పాత్రలకు ప్రాణంపోశారు. పోసాని పాత్ర నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. నిన్నుకోరితో క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రంలో క్లాస్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా మెప్పించడంలో సఫలం అయ్యాడు.

గోపీసుందర్ బాణీలు, తమన్ నేపథ్య సంగీతం కథానుగుణంగా చక్కగా కుదిరాయి. దర్శకుడు చెప్పిన కథను నమ్మి ఫలితాన్ని గురించి ఆలోచించకుండా ధైర్యంగా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. గత కొంతకాలంగా మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ఈ చిత్రం ఆ లోటును తీరుస్తుందనే చెప్పాలి. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వేసవిలో కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఈ సినిమా ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


రేటింగ్: 3/5

3647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles