‘మహర్షి’ రివ్యూ..

Thu,May 9, 2019 02:24 PM

తారాగణం: మహేష్‌బాబు, అల్లరి నరేష్, జగపతిబాబు, పూజాహెగ్డే, ప్రకాష్‌రాజ్, జయసుధ, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు...
సినిమాటోగ్రఫీ: కె.యు.మోహనన్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కథ: వంశీపైడిపల్లి, హరి, సాల్మన్
నిర్మాతలు: దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ
దర్శకత్వం: వంశీపైడిపల్లి


స్టార్ ఇమేజ్‌కు సామాజిక అంశాల్ని జోడించి సినిమాలు తీస్తే అవి జనబాహుళ్యానికి విస్త్రృతంగా చేరువవుతాయి. ఇటీవలకాలంలో అన్ని భాషల అగ్ర కథానాయకులు ఇదే పంథాలో కథాంశాల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేస్తూ పరిష్కారకోసం ఎదురుచూస్తున్న సమస్యలు ఇప్పుడు వెండితెరపై చక్కటి కథావస్తులవుతున్నాయి. ఈ కోవలోనే మహర్షి చిత్రానికి సామాజిక సందేశం మేళవించిన కథను ఎంచుకున్నారు దర్శకుడు వంశీపైడిపల్లి. అగ్ర కథానాయకుల్లో ఒకరైన మహేష్‌బాబుకు 25వ చిత్రమిదికావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కెరీర్‌లో మైలురాయివంటి ఈ సినిమా కోసం మహేష్‌బాబు దాదాపు ఏడాదిన్నర పాటు శ్రమించారు. నా సినీ ప్రయాణంలో అత్యుత్తమ కథ ఇది.

ప్రతి ఒక్కరి హృదయాల్ని స్పృశిస్తుంది అని ప్రచార కార్యక్రమంలో మహేష్‌బాబు విశ్వాసాన్ని ప్రకటించడంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రేక్షకుల ఆకాంక్షలకు మించి ఈ సినిమాను ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు కూడా గట్టి నమ్మకాల్ని వెలిబుచ్చడంతో మహర్షి సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. బాహుబలి సిరీస్ తర్వాత అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా మహర్షి తొలి అడుగులోనే సంచలనం సృష్టించింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకులముందుకొచ్చిన మహర్షి ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించాడు? సినిమాపై కథానాయకుడు మహేష్‌బాబు, దర్శకనిర్మాతలు పెట్టుకున్న అంచనాలన్నీ ఎంత వరకు నిజమయ్యాయి?..ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..

కథా సంగ్రహణం:
జీవితంలో విజయమే పరమావధి అని, ప్రపంచాన్ని జయించాలనే ప్రగాఢమైన సంకల్పం ఉన్న యువకుడు రిషి (మహేష్‌బాబు). తన తండ్రి సత్యనారాయణ (ప్రకాష్‌రాజ్) మధ్యతరగతి జీవితంలో రాజీపడి పరాజితుడిగా మిగిలిపోయాడని భావిస్తుండే రిషి ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ధ్యేయంగా పెట్టుకుంటాడు. విశాఖపట్నం ఐఐఈటీలో ఎం.టెక్‌లో జాయిన్ అవుతాడు. అక్కడ అతనికి రూమ్మేట్‌గా రవిశంకర్ (అల్లరి నరేష్), స్నేహితురాలిగా పూజా (పూజాహెగ్డే) పరిచయమవుతుంది. కాలేజీ పూర్తయిన అనంతరం తన తెలివితేటలతో అమెరికాలోని ప్రపంచశ్రేణి కంపెనీని సీఈఓ అవుతాడు రిషి. ఈ ప్రయాణంలో అతని కొన్ని అనూహ్య సంఘటనలు తారసపడతాయి. వాటివల్ల రిషిలో పరివర్తన వస్తుంది. విజయం అంటే ధనార్జనేకాదని, ప్రేమించిన వారి శ్రేయస్సును, సమాజ హితాన్నికాంక్షిచడమని తెలుసుకుంటాడు. తండ్రి మరణంతో కర్తవ్యోన్ముకుడై తిరిగి ఇండియాకు వస్తాడు. స్వదేశంలో రిషి ఏం చేశాడు? సాధారణ యువకుడిగా మొదలైన అతని ప్రస్థానం ఓ మహర్షిగా ఎలా మారింది? అందుకు దోహదం చేసిన వ్యక్తులెవరు? పరిస్థితులేమిటన్నదే మహర్షి చిత్ర కథ.

తాను నమ్మిన ఓ విలువ నుంచి మరో ఉన్నతమైన విలువ వరకు ఓ యువకుడు చేసే ప్రయాణమేమిటన్నదే స్థూలంగా మహర్షి చిత్ర కథ. ఇలాంటి ఫిలాసఫికల్ పాయింట్‌ను చక్కెర పూతవంటి కమర్షియల్ అంశాల మేళవింపుతో చెప్పే ప్రయత్నం చేశారు. రిషి జీవితంలో మూడుదశల్ని ప్రతిబింబిస్తూ కథను అల్లుకున్నారు. రిషి ఉపోద్ఘాత సన్నివేశాల్ని ైస్టెలిష్‌గా డిజైన్ చేశారు. ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌లో రిషి అసలు కథమేమిటన్నది మొదలవుతుంది. తొలి అర్ధభాగాన్ని కాలేజీ నేపథ్యంలో నడిపించారు. ఇందులో మహేష్‌బాబు, అల్లరి నరేష్, పూజాహెగ్డే మధ్య స్నేహాన్ని ఆవిష్కరించారు. ముగ్గురు మధ్య చక్కటి హాస్యాన్ని పండించారు. విజయమే లక్ష్యంగా సాగాలని తపించే యువకుడిగా ప్రథమార్థంలో రిషి పాత్రను చూపించారు. ఈ నేపథ్యంలో అతను చెప్పే సంభాషణలు స్ఫూర్తివంతంగా అనిపిస్తాయి. రిషి తన అసలు ప్రయాణమేమిటో అని తెలుసుకోవడంతో తొలి అర్థభాగం ముగుస్తుంది.

తండ్రి మరణంతో రిషిలో పరివర్తన కలుగుతుంది. ఇక ద్వితీయార్థంలోని సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగాయి. గ్యాస్‌పైప్‌లైన్ ప్రాజెక్ట్ నెపంతో ఊరిని కబళించాలని చూసే కార్పొరేట్ శక్తుల దుర్మార్గానికి రిషి చలించిపోతాడు. అటు స్నేహితుడు రవి రుణం తీర్చుకోవడానికి, మరోవైపు ఊరిని రక్షించుకోవడానికి రిషి చేసే ప్రయత్నాలు ఎమోషనల్‌గా సాగాయి. ద్వితీయార్థంలో రైతు సమస్యలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. అన్నదాత దుస్థితిని అర్థవంతమైన సన్నివేశాలు, సంభాషణలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఊరి మేలు కోసం రిషి ఎంతవరకు పోరాటం చేశాడనే అంశాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించారు.

బలమైన సామాజిక సందేశం ఉన్న అంశాల్ని వాణిజ్యపరంగా చెప్పడమే మహర్షి కథలోని ప్రధానబలం. ఇందుకు మహేష్‌బాబు వంటి స్టార్ హీరో తోడవడంతో కథ ఆసక్తిగా సాగింది. అయితే మూడుగంటల నిడివికల సినిమా కావడంతో కొన్ని సన్నివేశాల్ని సాగతీశారనే భావన కలుగుతుంది. అమెరికాలో ఉన్న తన ఆఫీసును రిషి గ్రామంలో ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించడం ఏమాత్రం లాజిక్‌కు అందదు. కొన్ని పోరాటఘట్టాల్ని కూడా కథలో అనవసరంగా ఇరికించారనే ఫీల్ కలుగుతుంది. ద్వితీయార్థంలో కథాగమనమంతా ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగానే సాగుతుంది. ైక్లెమాక్స్‌ను ఎలాంటి మలుపులు లేకుండా ముగించారు. కథాపరంగా కొన్ని సన్నివేశాలను కుదించి సినిమా నిడివి తగ్గిస్తే బాగుండేదనిపిస్తుంది.
సినిమాలో కొన్ని సంభాషణలు మెరిశాయి. ఈ సమాజంలో రైతు సానుభూతి చూపించే ఓ ఐటమ్‌గా మారిపోయాడు..వ్యవసాయమంటే ప్రకృతికి, మనిషికి మధ్య ఉండే గొప్ప అనుబంధం వంటి సంభాషణలు ఆలోచింపచేస్తాయి. ైక్లెమాక్స్ ముందు ఘట్టంలో రైతుల గురించి మహేష్‌బాబు చెప్పే సుదీర్ఘ సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి. స్వార్థపరుడైన వ్యక్తి మొదలుకొని సమాజహితాన్ని కాంక్షించే వ్యక్తిగా కథానాయకుడి పరివర్తనను కన్విన్సింగ్‌గా ఆవిష్కరించారు. కథకు ఆయువుపట్టు అయిన మహేష్‌బాబు-అల్లరి నరేష్ ఎపిసోడ్‌ను మరింత భావోద్వేగభరితంగా చూపిస్తే బాగుండేదనే భావన కలుగుతుంది. ఇక కథానాయిక పూజాహెగ్డే ఎక్కువగా పాటల్లో గ్లామర్‌కే పరిమితమైపోయింది. అభినయపరంగా ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది.

ఇక నటనాపరంగా మహేష్‌బాబు మూడు పార్శాలు కలిగిన రిషి పాత్రలో అద్భుతమై అభినయాన్ని కనబరిచాడు. ముఖ్యంగా రైతు సమస్యలపై పోరాటం చేసే యువకుడిగా అతని పాత్రలోని ఇంటెన్సిటీ ఆకట్టుకుంటుంది. మూడు కోణాలున్న తన పాత్రల్ని చాలా ఈజ్‌తో చేశాడు మహేష్‌బాబు. ఎప్పటిలాగానే తెరపై అందంగా కనిపించాడు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది రవి పాత్రను పోషించిన అల్లరి నరేష్‌ను. శంభోశివశంభో, గమ్యం చిత్రాల్లో అల్లరి నరేష్ పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మరోమారు అంతటి ప్రభావశీలమైన పాత్రను పోషించారు అల్లరి నరేష్. మంచి పాత్రలు లభిస్తే నటనాపరంగా తనకు తిరుగులేదని అల్లరి నరేష్ నిరూపించారు. రిషి తల్లిదండ్రులుగా ప్రకాష్‌రాజ్, జయసుధ తమ సహజసిద్ధమైన అభినయంతో మెప్పించారు. జగపతిబాబు విలన్‌గా ఓకే అనిపించారు. గత సినిమాల్లో మాదిరిగా పవర్‌ఫుల్ విలనిజం ప్రదర్శించే అవకాశం దక్కలేదు. కథానాయిక పూజాహెగ్డే తన అందచందాలతో ఆకట్టుకుంది. అభినయపరంగా తన పరిధిలో మెప్పించింది. అనన్య, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి తమ పాత్రల పరిధుల మేరకు న్యాయం చేశారు.

దేవీశ్రీప్రసాద్ సంగీతం ఫర్వాలేదు. శ్రీమణి అర్థవంతమైన సాహిత్యాన్ని అందించాడు. కె.యు.మోహనన్ కెమెరా పనితనం బాగుంది. దర్శకుడు వంశీపైడిపల్లి చక్కటి సామాజిక సందేశం ఉన్న ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. మహేష్‌బాబు ఇమేజ్‌కు అనుగుణంగా కమర్షియల్ అంశాల మేళవింపుతో సినిమాను తీర్చిదిద్దాడు. అందరిని సంతృప్తిపరిచేలా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. నిర్మాణపరంగా భారీతనం ఉట్టిపడింది. ముగ్గురు అగ్ర నిర్మాతలు తోడవడంతో ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ కనిపించింది.

మహర్షి సినిమాలో చెప్పాలనుకున్న సందేశం చాలా బాగుంది. అయితే ఈ తరహా ఇతివృత్తాల్ని గతంలో అనేక చిత్రాల్లో చర్చించడంతో కథాపరంగా కొత్తదనం కనిపించదు. మహేష్‌బాబు స్టార్‌ఇమేజ్, అత్యుత్తమ నిర్మాణ విలువలు ఈ సినిమాకు కొత్త శోభను తీసుకొచ్చాయి. అయితే వాణిజ్యపరంగా మహర్షి అనుకున్న లక్ష్యాన్ని చేరుతాడో లేదో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.

రేటింగ్: 3/5

10133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles