మహానుభావుడు రివ్యూ

Fri,September 29, 2017 07:46 PM
mahanubhavudu movie review

గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ విజయాల్లో వినోదాత్మక చిత్రాలదే అగ్రస్థానం. స్టార్‌ఇమేజ్, బడ్జెట్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని రెండున్నర గంటల పాటు నవ్వించే సినిమాలు మంచి వసూళ్లను రాబడుతున్నాయి. కామెడీ కథాంశాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్న కథానాయకుల్లో శర్వానంద్ ఒకరు. భలే భలే మగాడివోయ్ ఈ తరహా కథాంశాలకు తాను న్యాయం చేయగలనని నిరూపించుకున్నారు దర్శకుడు మారుతి. శర్వానంద్, మారుతి కలయికలో తెరకెక్కిన తాజా చిత్రం మహానుభావుడు. ఓసీడీ అనే పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు నవ్వించింది? శర్వానంద్ విజయపరంపరను కొనసాగించిందా?లేదా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆనంద్‌కు ఓసీడీ(అతిశుభ్రత) అనే సమస్య ఉంటుంది. దాంతో చేసిందే పదే పదే చేస్తాడు. తన చుట్టుపక్కల ఉండే మనుషులతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండాలని కోరుకుంటాడు. శుభ్రత పాటించలేదేమోననే అనుమానం వస్తే అమ్మ చేతి వంట కూడా తినడానికి ఇష్టపడడు. ఎదుటివారు ఎవరైనా తన ముందు మురికిగా కనిపిస్తే సహించడు. అలాంటి ఆనంద్...మేఘన(మెహరీన్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. పెళ్లిచేసుకోవాలనుకుంటాడు. ఆమె మాత్రం తన తండ్రి రామరాజు(నాజర్) అంగీకరిస్తేనే తమ పెళ్లిజరుగుతుందని ఆనంద్‌తో చెబుతుంది. దాంతో తన ప్రేమకోసం మేఘన పుట్టిన ఊరికి వెళతాడు ఆనంద్. ఓసీడీతో బాధపడే ఆనంద్‌కు ఆ పల్లెటూరిలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? మేఘన తండ్రిని ఎలా ఒప్పించాడు? తన ప్రేమను ఎలా గెలుపించుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
అతిశుభ్రత అనే పాయింట్‌కు వినోదాన్ని జోడించి దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కించారు. ఓసీడీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో హాస్యం బాగా పండింది. ఆఫీస్‌లో ఆనంద్ చేసే పనులు, పల్లెటూరిలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులు నవ్వుల్ని కురిపిస్తాయి. కామెడీతో పాటు అంతర్లీనంగా భావోద్వేగాలను చూపించిన తీరు బాగుంది. ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలతో పాటుగ్రామీణ ప్రాంతాల్లో ఉండే పంతాలను సహజంగా ఆవిష్కరించారు దర్శకుడు మారుతి. పతాక ఘట్టాలు హృద్యంగా సాగుతాయి. అయితే కథలో కొత్తదనం లేకపోవడం కొంత మైనస్‌గా మారింది. దానిపై మరింత దృష్టిసారిస్తే బాగుండేది. వినోదానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే క్రమంలో ఇతర ఎమెషన్స్‌కు సరిగా పట్టించుకోలేదు. అయితే ఆ లోపాలను తన కామెడీతో కనిపించకుండా చేయడంలో మారుతి సక్సెస్ అయ్యారు.

నటుడిగా తాను చేసే ప్రతి పాత్రలో కొత్తదనం ఉండాలని తపిస్తుంటారు శర్వానంద్. ఓసీడీతో బాధపడే యువకుడిగా సహజ అభినయంతో ఆకట్టుకున్నారు. పాత్రలో పూర్తిగా ఇమిడిపోయారు. భావోద్వేగ సన్నివేశాల్లో చక్కటి నటనను కనబరిచారు. మెహరీన్ గ్లామర్ పరంగా ఒకే. వెన్నెలెకిషోర్, భద్రంలపై వచ్చే కామెడీ ట్రాక్‌లు బాగున్నాయి. నాజర్‌తో పాటు చాలా మంది నటులు తెరపై కనిపించినా వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు.

తమన్ బాణీల్లో టైటిల్ సాంగ్‌తో పడిన పడనట్లున్నావే గీతం ఆకట్టుకుంటుంది. నిజార్ షఫీ ఛాయాగ్రహణం, రవిందర్ కళా దర్శకత్వం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. పాటలతో పాటు హీరోయిన్ ఇంటి పరిసరాల్ని చాలా అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ. యు.వి. క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమా అయినా ఎక్కడ ఆ అనుభూతి కలగకుండా జాగ్రత్తపడ్డారు.
ఆద్యంతం ప్రేక్షకులను అలరించే చక్కటి ఎంటర్‌టైనర్ ఇది. ఓసీడీ పాయింట్‌తో పాటు శర్వానంద్, మెహరీన్ కెమిస్ట్రీ, మారుతి టేకింగ్ బాగున్నాయి. దసరాకు మంచి సినిమాగా మహానుభావుడు ప్రేక్షకుల్ని అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రేటింగ్-3/5

4434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles