మహానటి రివ్యూ..

Wed,May 9, 2018 05:45 PM

సావిత్రి పేరు స్ఫురణకు రాగానే ఓ నిర్మలమైన తేజోమయరూపం కనులముందు కదలాడుతుంది. తెలుగు సినిమా స్వర్ణయుగం నుంచి నేటి వరకు అసమాన నటనకు, అద్వితీయ సౌందర్యానికి, అచ్చమైన తెలుగందానికి ప్రతీక సావిత్రి. ఆమె అభినయం గురించి ఎంత చెప్పినా చర్విత చరణమే అవుతుంది. వెండితెరపై అసాధారణ ప్రజ్ఞాపాటవాలు కలిగిన అభినేత్రిగా ప్రేక్షక జన నీరాజనాలందుకుంది సావిత్రి. మరో పార్శంలో అపర దాతృత్వశీలిగా అశ్రితుల పక్షపాతిగా ప్రజల హృదయాల్ని గెలుచుకుంది. మహోత్సవంగా సాగిన జీవితంలో ఎన్నో ఉత్థానపతానాల్ని చవిచూసింది. మహానటి ప్రేక్షక నీరాజనాలందుకున్న ఆమె జీవితాన్ని వెండితెర దృశ్యమానం చేస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహానటి. తెలుగులో తొలి జీవిత కథగా తెరకెక్కిన ఈ చిత్రానికి స్వప్నదత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించారు.

సావిత్రి సినీ ప్రయాణంతో పాటు బాల్యం నుంచి మరణం వరకు ఆమె జీవితంలో చోటు ముఖ్య ఘట్టాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రమిది. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్తుంది సావిత్రి(కీర్తిసురేష్). ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చుతారు. సావిత్రి ఎవరో, ఆమె గొప్పతనమేమిటో ఆసుపత్రి వర్గాలకు తెలియకపోవడంతో తొలుత ఆమెను ఓ మామూలు వ్యక్తిగానే భావిస్తారు. ఆమెను వెతుక్కుంటూ లక్షలాది మంది అభిమానులు తరలిరావడంతో దక్షిణాది చిత్రసీమలో గొప్ప నటిగా పేరుతెచ్చుకున్న సావిత్రి అనే నిజం ఆ తర్వాత తెలుసుకుంటారు. అదే సమయంలో ప్రజావాణి పత్రిక తరపున మధురవాణి (సమంత) అనే పాత్రికేయురాలు, ఫొటోగ్రాఫర్ విజయ్ ఆంటోనీ (విజయ్ దేవరకొండ)తో కలిసి సావిత్రి జీవితాన్ని గురించి తెలుసుకునే బాధ్యతను చేపడుతుంది. ఆమె జీవితంలోని ఒక్కో విషయాన్ని సేకరిస్తూ వస్తుంది.

సావిత్రి తండ్రి చనిపోవడంతో పెదనాన్న కె.వి. చౌదరి (రాజేంద్రప్రసాద్) ఆమె సంరక్షణ బాధ్యతల్ని తీసుకుంటాడు. చిన్న వయసులోనే తన స్నేహితురాలితో కలిసి నాటకాలు వేస్తూ మంచి పేరుతెచ్చుకుంటుంది సావిత్రి. అయితే నాటకాలకు ఆదరణ తగ్గిపోవడం.. సినిమాల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో సావిత్రిని సినిమా హీరోయిన్ చేయాలని అనుకుంటాడు ఆమె పెదనాన్న. ఆమెను తీసుకొని మద్రాస్ వెళతాడు. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించవు. దాంతో తిరిగి తన ఊరికి వెళ్లిపోతుంది సావిత్రి. అయితే సావిత్రిలోని ప్రతిభను గుర్తించిన జెమిని గణేషన్ ఆమె ఎప్పటికైనా పెద్ద నటి అవుతుందని అనుకుంటాడు. ఇంతలోనే ఏఎన్నాఆర్‌తో కలిసి నటించే అవకాశం సావిత్రికి దక్కుతుంది. సంభాషణలు సరిగా చెప్పలేకపోవడంతో సావిత్రిని ఆ సినిమా నుంచి తప్పిస్తారు దర్శకుడు ఎల్.వి. ప్రసాద్. తనను అవమానించిన ఆ దర్శకుడి ద్వారానే కథానాయికగా చిత్రసీమకు పరిచయమైన సావిత్రి అచిరకాలంలోనే అగ్రనటిగా అందరి మన్ననల్ని అందుకుంటుంది.


మరోవైపు తాను కథానాయికగా తన ఎదుగుదలకు కారకుడైన జెమిని గణేషన్‌తో ప్రేమలో పడుతుంది సావిత్రి. సమాజం, కుటుంబం వ్యతిరేకించిన అతడినే పెళ్లాడుతుంది. పెళ్లి తర్వాత సావిత్రి నటించిన సినిమాలన్ని పెద్ద విజయాల్ని సాధిస్తాయి. దాంతో జెమిని గణేషన్ కంటే ఆమెకు ఎక్కువగా పేరువస్తుంది. దాంతో సావిత్రి విజయాల్ని ఓర్వలేని జెమిని ఆమెకు దూరమవుతాడు. ప్రాణంగా ప్రేమించిన భర్త మోసం చేయడంతో మనుషుల్ని ద్వేషించడం ప్రారంభిస్తుంది సావిత్రి. ఆ తర్వాత సావిత్రి జీవితం ఏమైంది. తాను నమ్మిన వ్యక్తులంతా కలిసి ఆమె మోసం చేశారు. మద్యానికి బానిసగా మారిన సావిత్రి ఎలా కన్నుమూసిందన్నదే ఈ చిత్ర కథ.


సావిత్రి చేసిన సినిమాలు, పాత్రలు తప్ప ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రపంచానికి తెలియదు. తరాలు మారిన ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో మహానటిగా అందరిచేత కీర్తింపబడుతున్న సావిత్రి జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించారు. సాధారణ కుటుంబంలో పుట్టి తన ప్రతిభాపాటవాలతో ప్రేక్షక హృదయ సామ్రాజ్ఞిగా ఎలా మారింది? సినిమాలకే పనికి రావని తేల్చి చెప్పిన మహామహులతోనే గొప్ప నటిగా ఎలా కీర్తించబడింది? ఆమెలోని అంకితభావం, పాత్రలకు ప్రాణం పోయడానికి పడిన తపన, మహోజ్వలంగా సాగిన ఆమె సినీ జీవితాన్ని చూపిస్తూనే మరోపార్శంలో వ్యక్తిగతం జీవితంలో ఆమెకు ఎదురైన ఒడిదుడుకల్ని చూపించారు. జెమిని గణేషన్‌తో ప్రేమాయణం, పెళ్లి బంధం విచ్చిన్నం కావడానికి దారి తీసిన పరిణామాలు, అనుబంధాలు, ఆప్యాయతలకు దూరమై ఆమె ఎదుర్కొన్న సంఘర్షణను తెరకెక్కించారు. సినిమాలు, వ్యక్తిగత జీవితం రెండింటికి సమప్రాధాన్యతనిస్తూ కథను నడిపించారు.

సూటిగా సావిత్రి కథను చెప్పకుండా సమంత, విజయ్ దేవరకొండ పాత్రల ద్వారా ఆమె జీవితాన్ని హృద్యంగా చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా నాగ్ అశ్విన్‌కు ఇది రెండో సినిమా అయినా ఎంతో అనుభవజ్ఞుడిగా సినిమాను తెరకెక్కించారు. నలభై ఐదేళ్ల సావిత్రి జీవితాన్ని మూడు గంటల్లో పరిపూర్ణంగా ఆవిష్కరించారు. ఆనాటి వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. సావిత్రి బాల్యం, నాటకాలు, సినిమా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలతో ప్రథమార్థం సరదాగా సాగుతుంది. ద్వితీయార్థాన్ని ఆద్యంతం భావోద్వేగ ప్రధానంగా తీర్చిదిద్దారు దర్శకుడు. మాయాబజార్ ఎపిసోడ్, కె.వి.రెడ్డి, ఎల్.వి ప్రసాద్, చక్రపాణి, పుల్లయ్య, ఎస్వీరంగారావులతో సావిత్రికి ఉన్న అనుబంధాన్ని చూపించే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. 1940ల కాలం నాటి మద్రాస్ పట్టణం, విజయ, వాహిణి స్టూడియోలు, ఆప్పటి చిత్రీకరణల తీరు వాస్తవికతకు దగ్గరగా రూపొందించారు.


సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుందని తెలియగానే ఆ పాత్రకు ఆమె న్యాయం చేయగలుగుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ తన అసమాన అభినయంతో అందరి అనుమానాల్ని పటాపంచలు చేసింది కీర్తిసురేష్. కొన్ని సన్నివేశాల్లో సావిత్రిని తలపించింది. పరిణతితో కూడిన నటనతో సావిత్రి పాత్రకు ప్రాణం పోసింది. జెమిని గణేషన్‌గా భిన్న పార్శ్వాలున్న పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. జెమిని హావభావాలు, శైలిలో సాగే అతడి పాత్ర ఆకట్టుకుంటుంది. ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు, నాగేశ్వరరావుగా నాగచైతన్య, కె.వి.రెడ్డిగా క్రిష్, ఎల్.వి. ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, చక్రపాణిగా ప్రకాష్‌రాజ్ అతిథులుగానే సినిమాలో కనిపించినా వారి పాత్రలన్ని సినిమాకు బలంగా నిలుస్తాయి. సమంత తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచిన చిత్రమిది. పతాక ఘట్టాల్లో ఆమె నటన కంటతడి పెట్టిస్తుంది. విజయ్ ఆంటోనీగా విజయ్‌దేవరకొండ పాత్ర యువతరాన్ని మెప్పిస్తుంది. సాయి మాధవ్‌బుర్రా సంభాషణలు, డానీ ఛాయాగ్రహణం సినిమాకు ప్రాణంపోశాయి. అవినాష్ నేతృత్వంలో కళా దర్శకత్వ బృందం అలనాటి వాతవరణాన్ని కళ్లకు కట్టినట్లుగా సినిమాలో చూపించారు.

నిజాయితీతో కూడిన మంచి ప్రయత్నమిది. సావిత్రి గొప్పతనం గురించి తెలియని వారితో పాటు తెలిసిన వారిని సైతం మెప్పించేలా దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దారు. కమర్షియల్ హంగుల కోసం తాపత్రయపడకుండా సావిత్రి జీవితాన్ని వాస్తవిక కోణంలో చూపించిన విధానం మెప్పిస్తుంది. చక్కటి జీవితకథా చిత్రంగా ప్రేక్షకుల హృదయాల్లో చాలా కాలం పాటు నిలిచిపోతుంది.
రేటింగ్: 3.75/5

7375
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles