లవర్స్ డే రివ్యూ

Thu,February 14, 2019 01:22 PM
Loversday Movie Review

తారాగణం:ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్, నూరిస్ షెరిఫ్, మాథ్యూజోసఫ్, వైశాఖ్ పవనన్ తదితరులు
ఛాయాగ్రహణం:శ్రీను సిద్ధార్థ్
సంగీతం: షాన్‌రెహమాన్
ఎడిటింగ్:అచ్చు విజయన్
స్క్రీన్‌ప్లే: సారంగ్ జయప్రకాష్, లిజో పనాడా
నిర్మాతలు:ఏ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి
దర్శకత్వం:ఒమర్ లులు

అనూహ్యంగా సంభవించే కొన్ని సంఘటనలు మామూలు సినిమాలపై కూడా అసాధారణంగా అంచనాల్ని పెంచుతాయి. ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటడం కూడా అలాంటిదే. చిన్న కన్నుమీటుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ మలయాళీ అమ్మాయి. నేషనల్ క్రష్ అంటూ మీడియా ఆకాశానికెత్తింది. దీంతో మలయాళీ చిత్రం ఒరు ఆడార్ లవ్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం ఎందరో పోటీ పడ్డారు. భారీ వ్యయంతో ఏ.గురురాజ్, సి.హెచ్. వినోద్‌రెడ్డి ఈ సినిమాను దక్కించుకున్నారు. ఓ అమ్మాయి కన్నుగీటుతో విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందిన ఈ చిత్రం ప్రేమికులరోజును పురస్కరించుకొని లవర్స్ డే పేరుతో ప్రేక్షకులముందుకొచ్చింది. మరి కనుమీటు తాలూకు ప్రేమ భావనల్ని ఎంత సాంద్రతతో వెండితెరపై ఆవిష్కరించారు? ఈ టీనేజ్ లవ్‌స్టోరీ యువత అంచనాల్ని ఏ మేరకు అందుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

కళాశాల నేపథ్యంలో సాగే యుక్తవయస్సు ప్రేమకథ ఇది. రోషన్ ప్లస్ టూ చదివే సైన్స్ విద్యార్థి. అతనికో చిన్న మిత్రబృందం. వారంతా కాలేజీ లైఫ్‌ను ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతుంటారు. తన క్లాస్ అమ్మాయి ప్రియాను (ప్రియా ప్రకాష్ వారియర్) తొలిచూపులోనే ఇష్టపడతాను రోషన్. వీరిద్దరి ప్రేమకు.. గాథ (నూరిన్ షెరిఫ్) మధ్యవర్తిగా వుంటూ సహాయం చేస్తుంది. అనుకోని కారణాలతో రోషన్, ప్రియా బ్రేకప్ చెప్పుకుంటారు. ఆ తర్వాత గాథ ప్రేమలో పడతాడు రోషన్. ఈ ముగ్గురి మధ్య ఎలాంటి సంఘర్షణ చోటుచేసుకుంది? ఈ ముక్కోణపు ప్రేమకథ ఏ చివరకు ఏ అంకానికి చేరిందన్నదే మిగతా కథ..

టీనేజ్ ప్రేమకథల్ని సమర్థవంతంగా డీల్ చేయడం కత్తిమీద సాములాంటిది. యుక్తవయస్సు తాలూకు భావోద్వేగాలు, అల్లరి, ఆకతాయితనాన్ని బ్యాలెన్స్ చేస్తూ అర్థవంతంగా కథ చెప్పడంలోనే దర్శకుడి ప్రతిభదాగి ఉంటుంది. ఎక్కడ లోపం జరిగినా సినిమా మొత్తం పట్టుతప్పుతుంది. లవర్స్ డే విషయంలో అదే జరిగింది. సినిమాలోని ఓ సన్నివేశంలో ఓ అమ్మాయిని ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు ప్రేమించాలనే విషయంలో చిన్న సందిగ్ధత వస్తుంది. అప్పుడు టాస్ వేసి ఆ అమ్మాయిని ఎవరు ప్రేమించాలో నిర్ణయిస్తారు. ఇలాంటి సన్నివేశాలు కథలో చిన్నవే అనిపించినా అవి కథాగమనంలోని ఇమ్మెచ్యురిటీని ప్రతిబింబిస్తాయి. కళాశాల ప్రేమకథ అంటే విద్యార్థుల అల్లరి, హంగమా అనే భ్రమలో అవే అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టారు దర్శకుడు. ప్రధాన నాయికనాయికల మధ్య ప్రేమ సన్నివేశాల్లో ఎలాంటి గాఢత కనిపించదు. ఇద్దరు బ్రేకప్‌కావడానికి చూపించిన కారణాలు కూడా సిల్లీగా అనిపిస్తాయి.

బ్రేకప్ తర్వాత గాథ ప్రేమలో పడ్డ రోషన్ అదే నిజమైన ప్రేమ అని, ప్రియాతో లవ్ జస్ట్ ఇన్‌ఫాచ్యుయేషన్ అని చెప్పడం ఏమాత్రం లాజిక్‌కు అందదు. ఇక సినిమాలో చూపించిన కామెడీ ట్రాక్‌లు కూడా అరిగిపోయిన రికార్డుల్లాంటివే. మహాభారత డ్రామాలో కామెడీని పండించడం, లెక్చరర్ ప్రేమలో పడి ఆమె దృష్టిలో పడటానికి తపించే ఓ స్టూడెంట్...అర్థంలేని అల్లరి, అసందర్భ సన్నివేశాలు వెరసి ఎక్కడా కథతో ప్రేక్షకులు ప్రయాణం చేసినట్లుగా అనిపించదు.

ప్రధానా నాయకానాయికలు రోషన్, ప్రియా పాత్ర చిత్రణలు పూర్తి అయోమయంగా అనిపిస్తాయి. ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారో, తిరిగి ఎందుకు కలుసుకోవాలని తపిస్తున్నారనడానికి సరైన కారణాలు కనిపించవు. మొత్తంగా బలమైన సన్నివేశాలు ఒక్కటీలేక కథనం మొత్తం నిస్సారంగా సాగుతుంది. అప్పటివరకు గమ్యం లేకుండా సాగిన కథను ైక్లెమాక్స్‌లో ఓ క్రైమ్ ఎలిమెంట్‌తో విషాదంగా ముగించడం కూడా ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించదు.

తొలుత ఈ సినిమాలో ప్రియాప్రకాష్ వారియర్ పాత్ర నిడివి కేవలం ఇరవైనిమిషాలు మాత్రమే. కన్నుగీటు వీడియోతో ప్రియా ప్రకాష్ ఒక్కసారిగా జాతీయస్థాయిలో సెన్సేషన్‌గా మారడంతో కథలో చాలా మార్పులు చేశారు. సినిమాలో ప్రియా పాత్రను ఫుల్‌లెంగ్త్‌గా తీర్చిదిద్దారు. మొదట అనుకున్న కథకు, మార్పులు చేసిన కథ మధ్య సమన్వయం కుదరకపోవడంతో కథాగమనం ట్రాక్ తప్పింది. తొలుత అతిథి పాత్రకు అనుకున్న ప్రియాప్రకాష్‌ను కథలో ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేయడమే మైనస్‌గా మారిందనిపిస్తుంది.

ఇక సాంకేతికపరంగా ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. అయితే తెలుగు డబ్బింగ్‌లో సరిగ్గా కుదరలేదు. కొన్ని పాత్రలకు డబ్బింగ్ కార్టూన్ సీరియల్ చూసినట్లుగా అనిపిస్తుంది. షాన్‌రెహమాన్ సంగీతం బాగుంది. రెండు పాటలు మెలోడీ ప్రధానంగా ఆకట్టుకుంటాయి. ఛాయాగ్రహణం ఫర్వాలేనిపించింది. ప్రియాప్రకాష్ అభినయం బాగుంది. ముఖ్యంగా చక్కటి కళ్లతో భావోద్వేగాల్ని పలికించడం ఆకట్టుకుంటుంది. భవిష్యత్తులో ప్రతిభావంతురాలైన నాయికగా ఎదిగే అవకాశాలున్నాయి. గాథ పాత్రలో నటించిన నూరిన్‌షెరిష్ కూడా మంచి నటనను కనబరచింది. స్నేహబృందంలోని మిగతా నటులందరూ అతి చేశారనే ఫీలింగ్ కలుగుతుంది.

ఒక్క సన్నివేశం తీసుకొచ్చిన క్రేజ్ చూసి సినిమాను జడ్జ్ చేయడం ఎంత తప్పో లవర్స్ డే సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రేమకథకు హృదయాల్ని స్పృశించే భావోద్వేగాలు, సంఘర్షణ ముఖ్యం. అలాంటి అంశాలు మచ్చుకైనా ఈ సినిమాలో కనిపించవు. పూర్తిగా ఆత్మలోపించిన ప్రేమకథగా ప్రేక్షకుల్ని నిరుత్సాహపరుస్తుంది.

ఫైనల్‌గా : కన్నుగీటు చేసిన చేటు

రేటింగ్: 2.25/5

5204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles