పద్మావతి డైరెక్టర్‌కు అండగా అద్వానీ!

Fri,December 1, 2017 11:25 AM
LK Advani objected against questioning Padmavathi Director Sanja Leela Bhansali

న్యూఢిల్లీ: సంజయ్ లీలా భన్సాలీ మూవీ పద్మావతి ఎన్ని వివాదాలకు కారణమైందో తెలిసిందే. చరిత్రను వక్రీకరించారంటూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తంకావడంతో ఇవాళ రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడింది. అయితే ఇదే విషయంలో గురువారం సినిమా డైరెక్టర్ భన్సాలీ.. పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరయ్యాడు. ఈ ప్యానెల్లో బీజేపీ సీనియర్ నేత అద్వానీ కూడా సభ్యుడిగా ఉన్నారు. అసలు భన్సాలీకి సమన్లు జారీ చేయడం, ప్రశ్నించడాన్ని కూడా అద్వానీ తప్పుబట్టారు. ప్యానెల్లో అందరు సభ్యులు భన్సాలీపై ప్రశ్నల వర్షం కురిపించినా.. అద్వానీ మాత్రం కామ్‌గా ఉన్నారు. సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా తీశారని ప్యానెల్ చైర్మన్ అనురాగ్ ఠాకూర్ భన్సాలీని నిందించారు. సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకపోయినా.. విదేశాల్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారా అని కూడా ఆయన భన్సాలీని ప్రశ్నించారు. నవంబర్ 11న సీబీఎఫ్‌సీ ముందుకు సినిమాను పంపితే.. డిసెంబర్ 1న ఎలా రిలీజ్ చేద్దామనుకున్నారని నిలదీశారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఏదైనా మూవీకి సర్టిఫికెట్ ఇవ్వడానికి 68 రోజుల సమయం ఉంటుందని తెలియదా అంటూ భన్సాలీని ప్రశ్నించారు.

ఈ సమయంలో అద్వానీ జోక్యం చేసుకొని.. డైరెక్టర్‌ను ఇలా ప్రశ్నలతో వేధించడం మన ఎజెండాలో లేదంటూ వారించినట్లు ప్యానెల్‌లోని ఓ సభ్యుడు తెలిపారు. సంబంధం లేని విషయాలు అడగకూడదని, ఇప్పటికే చాలా అడిగారని చైర్మన్‌కు అద్వానీ చెప్పినట్లు ఆ సభ్యుడు వెల్లడించారు. అయితే సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ ఇవ్వకుండా విదేశాల్లో సినిమా రిలీజ్ చేయబోమని భన్సాలీ హామీ ఇచ్చాడు. అయితే సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ ఇవ్వకముందే కొందరికి సినిమాను ఎలా చూపిస్తారంటూ సీబీఎఫ్‌సీ చైర్మన్ ప్రసూన్ జోషి అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్యానెల్ సభ్యులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే తాను కేవలం 8 మంది తన స్నేహితులు, సీనియర్ జర్నలిస్ట్‌లకు మాత్రమే చూపించానని వివరణ ఇచ్చారు. సినిమా విషయం చూడటానికి తాను కొందరు చరిత్రకారులతో కమిటీని ఏర్పాటు చేశానని, ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని ప్రసూన్ జోషి.. ప్యానెల్‌కు చెప్పారు.

3058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles