‘ఈ నగరానికి ఏమైంది’ పెద్ద విజయం సాధించాలి: కేటీఆర్

Mon,June 25, 2018 10:38 PM
ktr, Rana launches ee nagaraniki emaindi audio cd

‘హ్యాంగోవర్, జిందగీ నా మిలేగీ దొబారా, దిల్ చహతాహై లాంటి బడ్డీ కామెడీ, రోడ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. తరుణ్‌భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా వాటికంటే ఉన్నతంగా ఉంటుందని నమ్ముతున్నాను. ప్రస్తుతం తెలుగు చిత్రసీమ ధోరణిలో మార్పులు కనిపిస్తున్నాయి. తరుణ్‌భాస్కర్, సందీప్‌వంగా, సంకల్ప్‌రెడ్డి కొత్త దర్శకులు మూస హద్దులను చెరిపేస్తూ నవ్యమైన కథాంశాలతో మంచి చిత్రాల్ని తెరకెక్కిస్తున్నారు. మా తరంలో ఇది జరగడం ఆనందంగా ఉందని అన్నారు’ మంత్రి కేటీఆర్. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఈ నగరానికి ఏమైంది.

నేడు హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర గీతావిష్కరణ వేడుకకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై..ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి సోమవారం తెలంగాణ ప్రభుత్వం తరుపున చేనేత కళాకారులకు మద్దతుగా హ్యాండ్లూమ్ మండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నేను సోమవారం చేనేత దుస్తులనే ధరిస్తాను. తరుణ్ నన్ను ఈ వేడుకకు ఆహ్వానించడానికి వచ్చినపుడు అందరూ చేనేత వస్ర్తాలను ధరిస్తానంటేనే వస్తానని అన్నాను. కొందరు తప్పితే ఎక్కువగా మంది చేనేత దుస్తుల్లోనే వచ్చారు. తొలుత ఈ సినిమా టైటిల్ చూసినప్పుడు కొంత భయపడ్డాను. వర్షకాలం వస్తే వార్తపత్రికల్లో ఈ నగరానికి ఏమైంది అనే వార్తలు కనిపిస్తుంటాయి. అయితే వాటితో ఈ సినిమా కథకు సంబంధం ఉండదని అనుకుంటున్నాను. తరుణ్‌భాస్కర్ కోసమే ఈ వేడుకకు వచ్చాను. అతడు తెరకెక్కించిన పెళ్లిచూపులు నాకు చాలా నచ్చింది.

అతడి కుటుంబంతో మంచి సాన్నిహిత్యముంది. అయితే పెళ్లిచూపులు చిత్రానికి ముందు తరుణ్‌ను ఎప్పడూ కలవలేదు. సురేష్‌బాబు ఆహ్వానంతో ఆ సినిమా చూశాను. అప్పుడే తరుణ్ ప్రతిభ ఏమిటో అర్థమైంది. ఓ సినిమా సక్సెస్ అయితే తెలుగు, హిందీతో పాటు ఎక్కడైనా స్టార్స్, డబ్బులు, ప్రొడక్షన్స్ వాల్యూస్ హంగామా ఉంటుంది. కానీ తరుణ్ మాత్రం మళ్లీ స్టార్స్ లేకుండా కొత్తవాళ్లతో సినిమా తీశానని చెప్పగానే అతడు ఏం చెబుతున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. కానీ తరుణ్ మళ్లీ సర్‌ప్రైజ్ చేశారు. పెళ్లిచూపులు కంటే ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. స్టార్‌డమ్, సక్సెస్‌లకు అతీతంగా భవిష్యత్తులో సొంతపంథాను సృష్టించుకుంటూ తరుణ్‌భాస్కర్ ఇలాగే ముందుకు సాగాలి అని తెలిపారు.

తరుణ్‌భాస్కర్ మాట్లాడుతూ మా అందరికంటే అధునికంగా, ముందుచూపుతో ఆలోచిస్తుంటారు సురేష్‌బాబు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేకర్స్‌కు మార్గదర్శిగా నిలుస్తూ తెలుగు ప్రేక్షకుల ఆలోచన ధోరణిలో మార్పుకు కారణమయ్యారని అన్నారు. ఈ చిత్రంలో విశ్వక్సేన్, సాయిసుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గొమటం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్‌బాబు నిర్మించారు. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది.

1892
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles