చ‌నిపోయిన హీరోతో సినిమా తీసిన కోడి రామ‌కృష్ణ‌

Fri,February 22, 2019 04:35 PM
Kodi Ramakrishna creates history with nagarahavu

కోడి రామకృష్ణ... ఈ పేరు ప్రయోగాలకు మారు పేరు. కమర్షియల్ సినిమాలు చేసి ఈ డైరెక్టర్ ఎన్ని హిట్స్ ఇచ్చాడో, ఎక్స్ పెరిమెంటల్ పిక్చర్స్ కూడా తీసి అదే విధంగా సక్సెస్ అయ్యాడు. అరుంధతి, అమ్మోరు, అంజి వంటి సినిమాలు ప్రయోగాత్మక దర్శకుడిగా కోడి రామకృష్ణ కెరీర్ లో కీర్తి కిరీటాలు. 2016లో ఆయ‌న‌ చనిపోయిన హీరోతో ఓ సినిమా తీసి స‌రికొత్త ప్ర‌యోగానికి నాంది ప‌లికాడు.

2009లో చనిపోయిన కన్నడ హీరో విష్ణువర్థన్ తో మూవీ చేసాడు కోడి రామకృష్ణ. విష్ణువర్థన్ కన్నడలో అప్పట్లో స్టార్ హీరో. 1972లో విష్ణువర్థన్ హీరోగా నాగర హావు సినిమా వచ్చింది. ఆ తరువాత అదే మూవీని ఉపేంద్ర హీరోగా రీమేక్ చేశారు. ఆ చిత్రాన్ని మరోసారి విష్ణవర్థన్ హీరోగా నాగరాహువు అనే టైటిల్ తో తెరకెక్కించాడు కోడి రామకృష్ణ . తెలుగులో ‘నాగభరణం’ అనే టైటిల్ తో విడుదల అయింది. చనిపోయిన‌ కన్నడ నటుడు విష్ణువర్ధన్‌ను గ్రాఫిక్స్‌ ద్వారా వెండితెరపై పునః సృష్టించిన తొలి దర్శకుడు ఆయనే కావడం విశేషం. నటి రమ్య, డిగంత్, రాజేశ్, వివేక్ ఉపాధ్యాయ్, ముకుల్ దేవ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గురుకిరణ్ సంగీతాన్ని అందించారు. 2016లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇదే కోడి రామ‌కృష్ణ‌కి చివ‌రి చిత్రం కావ‌డం గ‌మ‌న‌ర్హం.

మరణించిన వారితో సినిమా ఎలా తీస్తారు? అనే అనుమానం అందరికీ రావచ్చు. అయితే ఈ అద్భుతాన్ని, ఈ సాహసాన్ని కోడి రామకృష్ణ గ్రాఫిక్స్ సహాయంతో చేసాడు. విష్ణువర్ధన్ రూపాన్ని మళ్లీ తెర మీద చూపించడానికి ఏడు దేశాలకు చెందిన 576 మంది గ్రాఫిక్స్ నిపుణులు 730 రోజుల పాటు కష్టపడ్డారట. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఏ చిత్రంలో చూడనటువంటి 120 అడుగుల శివనాగంని చూపించి అబ్బుర ప‌ర‌చారు. అయితే చనిపోయిన ఒక హీరోను తీసుకొని పూర్తి స్థాయిలో ఒక సినిమా చేయడం... మన దేశ మూవీ హిస్టరీలో అదే మొదటిసారి. ఈ ఘనత మన తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ సాధించడం మనందరికీ గర్వకారణం. అలాంటి గొప్ప ద‌ర్శ‌కుడు ఈ రోజు మ‌న‌మ‌ధ్య లేకపోవ‌డం బాధాక‌రం.

6338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles