'50 ఏళ్ల రికార్డు'కు రజనీకాంత్ బ్రేక్..!

Thu,January 21, 2016 01:02 PM
Kochadaiiyaan to break 50 years record

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను యానిమేటెడ్ స్టార్ రూపంలో చూపిస్తూ ఆయన కుమార్తె సౌందర్య అశ్విన్ స్వయంగా దర్శకత్వం వహించి ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకువచ్చిన చిత్రం 'కొచ్చాడయాన్' ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళంలతోపాటు హిందీ, మరాఠీ, భోజ్‌పురి, బెంగాలీ వంటి భాషల్లోనూ విడుదలైంది. అయినప్పటికీ ఏ ప్రాంత ప్రేక్షకులను కూడా మెప్పించలేకపోయింది.

కాగా ఈ సినిమా త్వరలో కన్నడ భాషలోనూ విడుదల కానుంది. ఇందులో విశేషమేముంది అంటారా? అవును, మరి విశేషమే. ఎందుకంటే ఇతర భాషా చిత్రాల వల్ల తమ సినీ పరిశ్రమ దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో డబ్బింగ్ చిత్రాల విడుదలపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించగా, దాదాపు 50 ఏళ్ల తరువాత ఇప్పుడు రజనీకాంత్ కొచ్చాడయాన్ కన్నడలో విడుదల కానుంది. దీంతో అన్ని సంవత్సరాల తరువాత కన్నడ భాషలో విడుదలవుతున్న తొలి చిత్రంగా కొచ్చాడయాన్ రికార్డు సృష్టించనుంది. కాగా తెలుగులో సూపర్‌హిట్ అయిన మాయాబజార్ సినిమా కన్నడలో ఒకప్పుడు విడుదలైన చివరి డబ్బింగ్ చిత్రం కావడం కూడా విశేషమే.

కమల్‌హాసన్ స్ఫూర్తితోనే..!
రజనీకాంత్ కొచ్చాడయాన్ చిత్రం కన్నడలో విడుదలయ్యేందుకు యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ ఇచ్చిన స్ఫూర్తే కారణమని పలువురు డబ్బింగ్ సినిమాల నిర్మాతలు చెప్పుకొచ్చారు. అదెలాగంటే మొన్నా నడుమ తన విశ్వరూపం సినిమాను డీటీహెచ్‌లలో విడుదల చేయాలని కమల్ భావించగా తమిళ ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో కమల్ వారిపై కేసు వేసి గెలిచారు. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ స్ఫూర్తితో పలువురు డబ్బింగ్ చిత్రాల ప్రొడ్యూసర్లు ఒక యూనియన్‌గా ఏర్పాటై కన్నడలో వివిధ భాషల చిత్రాలను విడుదల చేయించేలా ఆ నిషేధాన్ని ఎత్తివేయించారు. ఈ క్రమంలోనే దాదాపు 50 ఏళ్ల తరువాత కన్నడలో రిలీజవుతున్న తొలి చిత్రంగా కొచ్చాడయాన్ పేరుగాంచనుంది. కాగా అన్ని భాషల్లోనూ ఫెయిలైన ఈ సినిమా కన్నడలోనైనా హిట్ అవుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఫిబ్రవరిలో కన్నడ కొచ్చాడయాన్‌ను విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ఈ సందర్భంగా తెలిపారు.

3501
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles