కేశవ సినిమా రివ్యూ

Fri,May 19, 2017 05:17 PM
Kesava movie review

స్వామిరారా చిత్రంతో నిఖిల్ కెరీర్ కొత్త మలుపు తిరిగింది. ప్రయోగాల బాటలో అతడు నడవటానికి ఈ చిత్రం నాందిగా నిలిచింది. ఈసినిమాతో సుధీర్‌వర్మ రూపంలో తెలుగులో చిత్రసీమకు ప్రతిభావంతుడైన దర్శకుడు దొరికాడు. నవ్యమైన కథ,కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించి ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. స్వామిరారా తర్వాత నిఖిల్, సుధీర్‌వర్మ కలయికలో రూపొందిన తాజా చిత్రం కేశవ. పగ, ప్రతీకారాలను మేళవించి రూపొందించిన ఈ చిత్రం షూటింగ్ దశ నుంచే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఈ చిత్ర టీజర్, థియేట్రికల్ ట్రైలర్ ఆ అంచనాల్ని మరింత పెంచింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకోగలిగింది. నిఖిల్ విజయ పరంపరను కేశవ కొనసాగించిందా?...సుధీర్‌వర్మ ఈ సినిమాతో తిరిగి విజయాల బాట పట్టాడా?లేదా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.....

కేశవశర్మ(నిఖిల్) కాకినాడలో న్యాయవిద్యను అభ్యసిస్తుంటాడు. చిన్నప్పుడే ఓ రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నలను కోల్పోయిన అతడు నిరంతరం పగతో రగిలిపోతుంటాడు. అందరిలా కాకుండా అతడికి కుడివైపునా గుండె ఉంటుంది. ఎక్కువ కంగారు పడిన, ఒత్తిడికి గురైన అతడి ప్రాణాలకే ప్రమాదం. చివరకు హత్య చేయాలన్న ప్రశాంతంగా చేయాలి. అలాంటి సమస్యతో బాధపడే కేశవ తన జీవితం చిన్నాభిన్నం కావడానికి కారణమైన ఓ ఆరుగురు పోలీసులను ఒక్కొక్కరిగా హతమారుస్తుంటాడు. ఈ హత్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడుతుంటాడు. దాంతో కేశవను పట్టుకోవడానికి ప్రభుత్వం శర్మిలా మిశ్రా(ఇషా కొప్పికర్) అనే ప్రత్యేక ఆధికారిని నియమిస్తుంది. కేశవ చేసే హత్యల గురించి తెలుసుకున్న అతడి స్నేహితురాలు సత్యభామ(రీతూవర్మ) తొలుత అతడిని అపార్థం చేసుకుంటుంది. కానీ కేశవ ద్వారా అసలు నిజం తెలుసుకున్న ఆమె అతడి పగకు తోడ్పడుతుంది. పోలీసులపై కేశవ పగను పెంచుకోవడానికి కారణమేమిటి? అతడి తల్లిదండ్రులు మరణించడానికి ఆ పోలీస్ అధికారులకు ఉన్న సంబంధమేమిటి?కేశవ వారిని ఎలా హతమార్చాడు?శర్మిలా మిశ్రా అతడిని దోషిగా నిరూపించగలిగిందా?లేదా?అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

పగ, ప్రతీకార నేపథ్యాలతో తెలుగులో గతంలో చాలా సినిమాలు రూపొందాయి. వాటితో పోలిస్తే విభిన్నంగా ఉండే చిత్రమిది. రెగ్యులర్ సినిమాల్లో కనిపించే హీరోయిజం, పోరాట ఘట్టాలు, రొమాన్స్, మాస్ అంశాలేవి లేకుండా దర్శకుడు సుధీర్‌వర్మ వినూత్న పంథాలో సినిమాను రూపొందించారు. గుండె సంబంధిత సమస్యతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న ఓ యువకుడు తన తెలివితేటలతో శత్రువులపై ఎలా పగ తీర్చుకున్నాడనే అంశాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. అయితే హీరో బాధపడుతున్న గుండె వ్యాధి నేపథ్యాన్ని కథకు సరైన రీతిలో పూర్తిగా ఉపయోగించుకోలేదు.దీనితో ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేసిన మెరుపులు ఇందులో కనిపించవు. స్వామిరారా సినిమాలో కనిపించిన స్క్రీన్‌ప్లే మ్యాజిక్ ఈ సినిమాలో లోపించింది. మరింత బిగువైన స్క్రీన్‌ప్లే అల్లుకోవడానికి ఆస్కారం వున్న ఈ కథ స్క్రీన్‌ప్లేపై సుధీర్‌వర్మ మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. అయితే అక్కడక్కడా హీరో తెలివితేటలు, పోలీసులకు దొరకకుండా అతడు వేసే ఎత్తులను వైవిధ్యంగా చూపించారు. టైటిల్స్‌లో సినిమా పోస్టర్స్ ద్వారా 12 ఏళ్ల్లు కాలం గడిచిపోయిందని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. కథాగమనం ఎక్కడ దెబ్బతినకుండా పాటలు, ఆనవసరపు కామెడీ అంశాల జోలికి వెళ్లకుండా సహజత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. తన తలకు రాయి తగలడంతో అది కూడా పోలీసులకు ఓ ఆధారంగా ఉపయోగపడుతుందనే ఆలోచనతో దానిని హీరో తీసుకెళ్లడం లాంటి చిన్న చిన్న లాజిక్స్ కథను ఆసక్తికరంగా మార్చాయి. అయితే ప్రథమార్థాన్ని ఉత్కంఠగా నడిపించిన సుధీర్‌వర్మ ద్వితీయార్థంలో దానిని కొనసాగించలేకపోయారు. కథలోని చిక్కుముడి వీడటంతో దర్శకుడు కథపై పట్టు కోల్పోయిన భావన కనిపించింది. పతాక ఘట్టాలు సాధారణంగా ముగించడం ఆకట్టుకోదు. హీరోకు ధీటైన బలమైన ప్రతినాయకుడు లేకపోవడం సినిమాకు లోటుగా నిలిచింది. పోలీసులై ఉండి కూడా శత్రువు చేతిలో సులువుగా ప్రాణాలు పోగోట్టుకోవడం అతిశయోక్తిగా కనిపిస్తుంది. నిడివి తక్కువైనా కథనం నెమ్మదిగా సాగడం మైనస్‌గా నిలిచింది.

ప్రతి సినిమాలో కథ, తన పాత్రల పరంగా వైవిధ్యతకు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చే నిఖిల్ కేశవతో మరోసారి ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు లవర్‌బాయ్, మాస్ తరహా పాత్రల్లో కనిపించిన ఆయన ఇందులో అనునిత్యం పగ, ప్రతీకారాలతో రగిలిపోయే యువకుడిగా కనిపించారు. సీరియస్‌గా సాగే ఈ పాత్రలో నిఖిల్ చక్కటి అభినయాన్ని కనబరిచారు. సినిమా మొత్తం ఒకే తరహా భావోద్వేగాలను పండిస్తూ తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేశారు. పాత్ర కోసం తనను తాను కొత్తగా మలుచుకున్న తీరు బాగుంది. బరువు పెరగడంతో పాటు లుక్‌లో మార్పులు చేసుకున్నారు. పరిణితితో కూడిన నటనను కనబరిచారు. నటుడిగా అతడిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. పెళ్లిచూపులు చిత్రంతో సహజ నటనతో ఆకట్టుకున్న రీతూవర్మ ఇందులో అభినయానికి ఆస్కారమున్న పాత్రలో కనిపించింది. కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యత తక్కువ ఉండటం మైనస్‌గా నిలిచింది. సీరియస్ సినిమాలో తమ కామెడీతో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సత్య నవ్వించారు. ఈ సన్నివేశాలు దర్శకుడిలోని సెన్సాఫ్ హ్యుమర్‌ను తెలియజేస్తుంది. ఇక ఇషా కొప్పికర్ పాత్రను దర్శకుడు శక్తివంతంగా మలచలేకపోయారు. పతాక ఘట్టాల్లో రావు రమేష్ తన విలనిజంతో ఆకట్టుకున్నారు.

దివాకర్ మణి ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు తన కెమెరాతో ప్రాణం పోశారాయన. కాకినాడ మడ అడవుల్ని అందంగా చూపించారు. ప్రశాంత్ పిైళ్లె నేపథ్య సంగీతం కథను తెరపై బలంగా చూపించడానికి దోహదపడింది. రివేంజ్ డ్రామా సినిమా కావడంతో ఇందులో పాటలకు పెద్దగా ఆస్కారం లేదు.కానీ దొరికిన కొద్ది అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు సంగీత దర్శకుడు సన్నీ.ఎం.ఆర్. అతడు స్వరపరచిన గీతాల్లో బహుషా ఇది తెలుసా అనే గీతం ఆకట్టుకుంటుంది.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రమిది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకుల్ని మాత్రమే ఈ చిత్రం మెప్పించే అవకాశం వుంది. నిఖిల్ గత సక్సెస్‌లు, ఈ చిత్రానికి వచ్చిన ప్రచారంతో సినిమాకు మంచి ప్రారంభ వసూళ్లు లభించాయి. అయితే ఈ వసూళ్లు ఎంత మేరకు కొనసాగుతాయో చూడాలి...కేశవ బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు నిలదొక్కుకుంటో వేచిచూడాలి..!
రేటింగ్: 2.75/5

4641
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles