'థ్రిల్లింగ్ 118' మూవీ రివ్యూ

Fri,March 1, 2019 01:47 PM
kalyan ram 118 Telugu Movie Review

ఇమేజ్, స్టార్‌డమ్‌ను పట్టించుకోకుండా నచ్చిన కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకులకు అందించాలని తపిస్తుంటారు హీరో నందమూరి కల్యాణ్‌రామ్. గత ఏడాది నా నువ్వే అంటూ కొత్త తరహా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారాయన. అది ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. కల్యాణ్‌రామ్ నటించిన తాజా చిత్రం 118. కెరీర్‌లో కేవలం రెండే రెండు పాటలతో చేసిన తొలి యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రతిసారి కొత్తదనంతో మీ ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ఫెయిల్ అవుతున్నాను. ఆ విషయం నాకు కూడా తెలుస్తోంది. కానీ మిమ్మల్ని మెప్పించే వరకు ప్రయత్నిస్తూనే వుంటాను. అయితే తాజా సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో హీరో కల్యాణ్‌రామ్ అన్న మాటలివి. ట్రైలర్‌లోనే సినిమా కథేంటో చెప్పేసి ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా ద్వారా ప్రముఖ కెమెరామెన్ కె.వి. గుహన్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. మరి కల్యాణ్‌రామ్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా వుందా? అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
గౌతమ్ (కల్యాణ్‌రామ్) ఓ టీవీ ఛానల్‌లో ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తుంటాడు. వారాంతంలో ఓ రిస్టార్స్‌కు వెళ్లిన అతనికి అక్కడా రాత్రి కలలో ఆధ్యా (నివేదా థామస్) అనే యువతిని ఎవరో కొట్టి చంపుతున్నట్టు, బాడీని ఓ కారులో పెట్టి క్వారీ గుంతల్లోని నీళ్లల్లో పడేసినట్టు కల వస్తూ వుంటుంది. తనకు అదే రిసార్ట్స్‌లో అదే రూమ్‌లో అందూన పౌర్ణమి రోజు తరచూగా ఈ కల వస్తుంటుంది. అయితే ఈ కలలో కనిపించిన విధంగానే కొన్ని వస్తువులు, క్వారీ గుంతలో కారు ఇవన్నీ అతనికి నిజజీవితంలో కనిపిస్తాయి. ఇక కలలో ఆ ఆమ్మాయి కూడా ఖచ్చితంగా వుంటుందనే నమ్మకంతో వుంటాడు గౌతమ్ అయితే ఆమె నిజంగానే వుందా? వుంటే ఎక్కడుటుంది. ఆమె మిస్సయిపోవడానికి గల కారణం ఏమై వుంటుంది? అని గౌతమ్ అన్వేషించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో తన కలలో కనిపించిన ఆధ్యా నిజంగానే అతనికి తారసపడిందా?. ఆమె వెనకున్న కథేంటి?. అసలు 118కి, ఆమె కలకు వున్న సంబంధం ఏమిటి అన్నదే ఇందులో ఆసక్తికరం.

ఎవరెలా చేశారు..
కేవలం రెండే రెండు పాటలతో సాగే ఇలాంటి యాక్షన్‌థ్రిల్లర్ కథని అటెమ్ట్ చేయడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో కల్యాణ్‌రామ్ చేసిన సాహసాన్ని అభినందించాల్సిందే. నాలుగు పాటలు, ఆరు ఫైట్‌లు అనే మూసధోరణికి కాలం చెల్లిన రోజులివి. ఈ తరుణంలో మూస కమర్షియల్ పంథాకు భిన్నంగా కల్యాణ్‌రామ్ చేసిన సినిమా ఇది. చిత్ర కథకు తగ్గట్టుగా ఆయన ప్రదర్శించిన నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విషయంలో తొలి క్రెడిట్ ఆయనదే. అర్జున్‌రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది షాలిని పాండే. ఈ సినిమాలో ఆమెకు పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఇక సినిమాలో తను కనిపించింది కేవలం 20 నిమిషాలే అయినా కథ మొత్తం నివేదా థామస్ చుట్టే తిరుగుతుంది. ఆ సన్నివేశాల్లో తను నటించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ ప్రీరిలీజ్ వేడుకలో చెప్పినట్టు కొందరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. కొన్నేళ్ల క్రితం గజిని సినిమాలో అసిన్ చనిపోతున్న సన్నివేశం ఎలాంటి ఇంపాక్ట్‌ని కలిగించిందో ఈ సినిమాలోనూ నివేదా థామస్ కనిపించిన సన్నివేశాలు అదే స్థాయి ఇంపాక్ట్‌ని సగటు ప్రేక్షకుడికి కలిగిస్తాయి. అంతా బాగా తన పాత్రని నివేదా థామస్ రక్తికట్టించిందని చెప్పొచ్చు. మిగతా ప్రాత్రల్లో రాజీవ్ కనకాల, హరితేజ, నాజర్, ప్రభాస్ శ్రీను, భరత్, యువ దర్శకుడు తరుణ్‌భాస్కర్ మదర్ గీతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం పనితీరు..
కెమెరామెన్‌గా ప్రశంసలందుకున్న కె.వి.గుహన్‌కిది దర్శకుడిగా తొలి చిత్రం. అయినా ఎక్కడా అలా అనిపించదు. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్‌ని ఎలాంటి గ్రిప్పింగ్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించాలో దానికి ఏమాత్రం తగ్గని రీతిలో చిత్రాన్ని నడిపించారు. అక్కడక్కడ కొన్ని లాజిక్‌లు మిస్సయినా ఇంటెలిజెన్సీతో కథ, కథనాన్ని నడిపించిన తీరు దర్శకుడిగా ఆయన ప్రతిభను తెలియజేస్తుంది. క్లిష్టమైన కథలోని ఒక్కో చిక్కుముడిని విప్పుతూ పక్కా స్క్రీన్‌ప్లేతో చిత్రాన్ని నడిపించి దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే తన ప్రతిభను చాటుకున్నారని చెప్పకతప్పదు. ప్రతి సన్నివేశం ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచే విధంగా వున్నాయి. ఈ సినిమా విషయంలో దర్శకుడిగా ఎంత వరకు సక్సెస్ అయ్యారో ఓ ఛాయాగ్రహకుడిగా కూడా అంతే సక్సెస్ అయ్యారు. విజుల్స్, ఫ్రేమ్స్ ఆకట్టుకుంటాయి. ఇలాంటి యంగేజింగ్ థ్రిల్లర్‌కి ఆయువు పట్టుగా నిలిచేది నేపథ్య సంగీతం..బీజిఎమ్స్. ఈ విషయంలో శేఖర్ చంద్రకు అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే. పట్టుసడలని కథనంలో సాగే సినిమా మూడ్‌ని శేఖర్‌చంద్ర ఇచ్చిన నేపథ్య సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లింది. తమ్మిరాజు ఎడిటింగ్, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ కోనేరు నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్రతిసారి కొత్తదనంతో మీ ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ఫెయిల్ అవుతున్నాను. ఆ విషయం నాకు కూడా తెలుస్తోంది. కానీ మిమ్మల్ని మెప్పించే వరకు ప్రయత్నిస్తూనే వుంటాను అని ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో హీరో కల్యాణ్‌రామ్ ఏ కాన్ఫిడెంట్‌తో చెప్పాడో దానికి ఏ మాత్రం తగ్గని స్థాయిలో సినిమా వుంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో విసిగిపోయిన సగటు ప్రేక్షకుడికి కొన్ని లాజిక్‌లని పక్కన పెడితే ఖచ్చితంగా నచ్చే సినిమా ఇది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను అలరించే అంశాలు ఇందులో వున్నాయి. అయితే ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వసూళ్లు ఏ విధంగా వుంటాయో చూడాలి.

రేటింగ్: 3/5

6190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles