జ్యో అచ్యుతానంద మూవీ రివ్యూ..

Fri,September 9, 2016 04:47 PM
jyo achyutananda movie review


నిత్యజీవితంలో మన చుట్టు పక్కల ఉండే వ్యక్తులు, కుటుంబాలు, జీవన పరిస్థితులు కొన్ని కథలకు స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. జ్యో అచ్యుతానంద ఆ తరహా చిత్రమే. ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడిగా కమర్షియల్ సక్సెస్‌ను దక్కించుకున్న అవసరాల శ్రీనివాస్ ద్వితీయ ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రమిది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో మల్టీస్టారర్ సినిమాగా దీనిని తీర్చిదిద్దారు. నారా రోహిత్, నాగశౌర్య కథానాయకులుగా నటించారు. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.

అచ్యుత్(నారా రోహిత్) ఆనంద్(నాగశౌర్య) అన్నదమ్ములు. ఒకరంటే మరొకరికి చాలా ప్రేమాభిమానాలు ఉంటాయి. వారి ఇంటిపైకి జ్యోస్న(రెజీనా) అద్దెకు దిగుతుంది. ఆమె రాకతో ఆ అన్నదమ్ముల ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఆమెను ప్రేమలో దించేందుకు ఒకరికి తెలియకుండా మరొకరు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. కానీ జ్యోస్న మాత్రం వారి ప్రేమను తిరస్కరించి అమెరికా వెళ్లిపోతుంది. జ్యోస్న కారణంగా విడిపోయిన ఆ అన్నదమ్ములు మళ్లీ ఏ విధంగా ఏకమయ్యారు. అచ్యుత్, ఆనంద్‌ల ప్రేమను తిరస్కరించిన జ్యోస్న మళ్లీ వారిని వెతుక్కుంటూ ఎందుకు రావాల్సివచ్చింది? అనేది చిత్ర కథ. అన్నదమ్ముల అనుబంధానికి భావోద్వేగాలు, వినోదం మేళవించి రూపొందించిన చిత్రమిది.

jyoachyutannada44తొలినుంచి రొటీన్‌కు భిన్నమైన సినిమాలు చేసుకుంటూ వస్తోన్న నారా రోహిత్ జ్యో అచ్యుతానందతో మరోసారి తన వైవిధ్యతను చాటుకున్నారు. అచ్యుత్ పాత్రలో సహజ నటనను ప్రదర్శించారు. హీరోయిజం, మాస్ ఎలిమెంట్స్ పరంగా కేవలం ఎమోషన్స్ ప్రధానంగా సాగే పాత్రలో ఇమిడిపోయారు. నారా రోహిత్, నాగశౌర్య మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తూనే హృదయాన్ని తాకుతుంటాయి. నిత్యజీవితంలో తారసిల్లే వ్యక్తుల దృక్పథాల్ని తలపిస్తూ ఆయన పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. నాగశౌర్య పరిణితితో కూడిన నటనను ప్రదర్శించారు. తండ్రి, కుటుంబ ప్రేమకోసం తపించే కుర్రాడిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. రోహిత్, నాగశౌర్యలు చూడటానికి అన్నదమ్ముల్లా ఉండటం ఈ సినిమాకు కలిసివచ్చింది.

ఇటీవల కాలంలో గ్లామర్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన రెజీనా ఇందులో విలక్షణ పాత్రను పోషించింది. తన కారణంగా విడిపోయిన కుటుంబాన్ని ఏకం చేసే యువతిగా ఆమె పాత్ర విభిన్నంగా సాగుతుంది. నారా రోహిత్, నాగశౌర్య భార్యలుగా నటించిన పావని గంగిరెడ్డితో మరో అమ్మాయి పాత్రలు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. హీరో నాని పతాక ఘట్టాల్లో కనిపించి అలరించారు.

ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తిన నటుడు అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను చాటారు. తొలి సినిమాను వినోదాత్మక పంథాలో నడిపించి విజయాన్ని అందుకున్న ఆయన ఈ సినిమాతో ఎమోషన్స్‌ను పండించగలనని నిరూపించుకున్నారు. మనవైన అనుబంధాలు, ఆప్యాయతలకు తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌ను జోడించి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రచయితగా ప్రతి సన్నివేశంలో తన ముద్రను బలంగా చాటారు. అశ్లీలతకు తావు లేకుండా చక్కటి ప్రాసలతో ఆహ్లాదకరమైన సంభాషణలను అందించారు. ప్రతి సన్నివేశం వాస్తవికతను ప్రతిబింబిస్తూ సాగుతుంది. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం కొంత వేగం మందగించడం సినిమాకు మైనస్‌గా మారింది. అన్నదమ్ములు విడిపోవడానికి కారణాలు బలంగా ఉండవు. అనూహ్యంగా వారిలో మార్పులు వచ్చినట్టుగా చూపించిన తీరు బాగలేదు. కళ్యాణ్ మాలిక్ బాణీలు, నేపథ్య సంగీతం ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. ఒక లాలన పాటతో పాటు మిగిలిన బాణీలన్ని వీనులవిందుగా ఉంటాయి. ఛాయాగ్రహకుడు వెంకట్ దిలీప్ ప్రతి ఫ్రేమ్‌ను సహజంగా అందంగా ఆవిష్కరించారు.
జ్యో అచ్యుతానంద ఇద్దరు అన్నదమ్ముల కథతో సాగే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. మల్టీఫ్లెక్స్ వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. బీ,సీ క్లాస్ ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టమే.

రేటింగ్: 2.75/5

3814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles