జై సింహా రివ్యూ

Fri,January 12, 2018 03:47 PM
jai simha Movie review

మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్ బాలకృష్ణ. ఇప్పటికీ డ్యాన్సుల్లో, యాక్షన్ సన్నివేశాల్లో, నేటి తరం యువ కథానాయకులతో పోటీపడుతుంటారాయన. సంక్రాంతికి, బాలకృష్ణ కెరీర్‌కి విడదీయరాని అనుబంధం వుంది. సంక్రాంతి బరిలో దిగిన ఆయన సినిమాలన్నీ మంచి విజయాల్ని సొంతం చేసుకున్నవే. ఈ సంక్రాంతికి ఆయన నటించిన తాజాగా జై సింహా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఇది వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా. పైసావసూల్ వంటి పరాజయం తరువాత బాలకృష్ణ. లింగా వంటి డిజాస్టర్ అనంతరం దర్శకుడు కె.ఎస్.రవికుమార్ హిట్టు కోసం చేసిన సినిమా ఇది. వీరిద్దరి కలయికలో వచ్చిన జై సింహా వారి కలను నిజం చేసిందా? ఎప్పుడూ సంక్రాంతి బరిలో నిలిచి జైకొట్టించుకునే బాలయ్య ఈ సారి కూడా ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేశాడా? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...

నరసింహం (బాలకృష్ణ) గౌరి(నయనతార)కు తెలియకుండా ఆమె కొడుకుని తీసుకుని వైజాగ్ నుంచి కుంభకోణం చేరుకుంటాడు. అక్కడి ఆలయ ధర్మకర్త మురళీకృష్ణ(మురళీమోహన్) ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. ఆలయ ధర్మ కర్త కూతురు ధాన్య (నటాషా దోషి) యాక్సిడెంట్ వల్ల కనియప్పన్ (బాహుబలిప్రభాకర్) తమ్ముడిని గాయపరుస్తుంది. ఆ నేరాన్ని నరసింహా తనమీద వేసుకుంటాడు. అక్కడి నుంచి అతనికి సమస్యలు మొదలవుతాయి. ఓ సంఘటన కారణంగా ఓ ఏసీపీకి ఎదురుతిరగడంతో నరసింహ అతనీకీ శత్రువు అవుతాడు. ఇంత మంది శత్రువుల మధ్య చిన్నారిని వుంచడం శ్రేయస్కరం కాదని భావించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో తన కొడుకుని వెతుక్కుంటూ గౌరి( నయనతార) కుంభకోణం వస్తుంది. అక్కడ నరసింహను చూసి ఎందుకు అసహ్యించుకుంటుంది? నరసింహకు, గౌరీకి వున్న సంబంధం ఏమిటి? నరసింహను అంతం చేయాలని తోటరామిరెడ్డి (అశుతోష్‌రాణా) ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు? నరసింహ కుంభకోణం రావడానికి కారణం ఏంటి? అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.

నిత్యం గొడవల్లో తలదూర్చే హీరో వాటన్నింటినీ పక్కనపెట్టి తనెవరో తెలియని చోటికి వెళ్లి కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం అనే ఫార్ములాతో ఇప్పటికి చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాను కూడా దర్శకుడు అదే ఫార్ములాను నమ్ముకుని తెరకెక్కించాడు. మాస్, యాక్షన్ అంశాలకు సెంటిమెంట్‌ను జోడీంచి రూపొందించాడు. బాలకృష్ణ సినిమా అంటే సాధారణంగా హైఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలుంటాయి. ఇందులోనూ అవే కనిపిస్తాయి. అయితే కథానాయకుడి పాత్ర పరిచయసన్నివేశాన్ని భిన్నంగా మలచడంతో ప్రేక్షకుడు సినిమాపై ఓ అంచనాకు వస్తాడు. అయితే ఆ అంచనాకు భిన్నంగా దర్శకుడు కథను నడిపించాడు. పురోహితుల గొప్పదనాన్ని వివరిస్తూ బాలకృష్ణ చెప్పే డైలాగ్‌లు, ఆయన నటన, అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. డైలాగ్‌లు చెప్పడంలో బాలకృష్ణకు ఉన్న ప్రత్యేకత ఏమిటో ఈ సన్నివేశం మరోసారి నిరూపిస్తుంది. విశ్రాంతికి ముందు వచ్చే పోరాట ఘట్టాలు మాస్‌ను ఆకట్టుకుంటాయి. బ్రహ్మానందంపై వచ్చే హాస్య సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు సరికదా సాగదీతగా అనిపిస్తాయి. ప్రధమార్థంలో ఎలాంటి ప్రత్యేకతను ప్రదర్శించలేకపోయిన దర్శకుడు తన గత చిత్రాల తరహాలో ద్వితీయార్థంపైనే ఆధారపడ్డాడు. బాలకృష్ణ, నయనతార, ప్రకాష్‌రాజ్‌ల చుట్టూ కథని నడిపించాడు. సెంటిమెంట్ సన్నివేశాలతో ఆకట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే ద్వితీయార్థంలో వచ్చే లవ్ ట్రాక్‌లో కొన్ని సన్నివేశాల్ని సాగదీయకుండా అనవసరమైన వాటికి కత్తెరేస్తే బాగుండేది. బాలకృష్ణను ఓ స్వచ్ఛమైన ప్రేమికుడిగా చూపించడంలోనూ, పతాక ఘట్టాల్ని విభిన్నంగా మలచడంలోనూ దర్శకుడు సక్సెస్ అయ్యాడు. బాలకృష్ణకు భిన్నమైన సినిమాగా కనిపిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమికుడి త్యాగమే ఈ సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే సినిమా మరోలా వుండేది.

ప్రేమికురాలి కోసం త్యాగం చేసే పాత్రలో బాలకృష్ణ తనదైన శైలిలో నటించాడు. గతంలో వచ్చిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి చిత్రాల తరహాలోనే ఈ చిత్రంలోనూ రెండు కోణాల్లో బాలకృష్ణ ప్రదర్శించిన నటన ఆకట్టుకుంటుంది. అమ్మకుట్టి పాటలో నేటి యువ హీరోలకు ధీటుగా బాలకృష్ణ వేసిన స్టెప్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. నయనతార తండ్రిగా ప్రకాష్‌రాజ్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పకోవాల్సిన పని లేదు. తన పాత్ర పరిధి మేరకు నటించారు. ముగ్గురు కథానాయిలకు వున్నా కథకు కీలకమైన గౌరీ పాత్రలో నయనతార తనదైన అభినయాన్ని ప్రదర్శించింది. నటాషా దోసి గ్లామర్‌తో ఆకట్టుకుంటే, మంగ పాత్రలో హరిప్రియ అలరిస్తుంది. చిరంతన్‌భట్ అందించిన పాటల్లో అమ్మకుట్టి ఆకట్టుకోగా, మిగతావి మెలోడీ ప్రధానంగా సాగాయి. నేపథ్య సంగీతాన్ని ఆశించిన స్థాయిలో అందించలేకపోయాడు. పాత కథ కావడం కూడా ఓ మనస్‌గా మారింది. రత్నం డైలాగ్‌లు, సి.రామ్‌ప్రసాద్ ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి. గతంలో వచ్చిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను గుర్తుచేసే కథ, కథనాలతో సినిమా సాగడం, ఎంటర్‌టైన్‌మెంట్ తగినంతగా లేకపోవడం, సెంటిమెంట్ మరీ ఎక్కువకావడం సినిమాకు ప్రధాన మైనస్‌లుగా నిలిచాయి. అయితే బాలకృష్ణ అభిమానుల ఆశించే అంశాలు చిత్రంలో పుష్కలంగా వున్నాయి. 80ల నాటి కథను తీసుకోని కేవలం అభిమానులను, మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రమిది. సో.. జై సింహా ఓన్లీ ఫర్ బాలకృష్ణ అభిమానులకు మాత్రమే.

రేటింగ్ 2.75/5


4745
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles