జైలవకుశ సినిమా రివ్యూ

Thu,September 21, 2017 05:00 PM
Jai Lava Kusha movie review

నటీనటులు: ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేథాథామస్, సాయికుమార్ తదితరులు...
దర్శకుడు:బాబీ
సంగీతం:దేవిశ్రీప్రసాద్
నిర్మాత: కళ్యాణ్‌రామ్

అలనాడు అగ్రనటులెందరో త్రిపాత్రాభినయంతో తమ ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల కాలంలో త్రిపాత్రాభినయంలో కనిపించిన హీరోలు అరుదనే చెప్పుకోవచ్చు. జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని తెలియడంతో సినిమాపై ప్రేక్షకులందరిలో ఆసక్తి పెరిగింది. శక్తివంతమైన కథానాయకుడి పాత్రలకు కేరాఫ్ ఆఫ్‌గా చెప్పుకునే ఎన్టీఆర్ ఈ సినిమాలో నాయక, ప్రతినాయక ఛాయలతో సాగే పాత్రల్లో కనిపించనున్నారని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశన్నాంటాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురుచూశారు. అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా సాగిందా? అభిమానుల్ని ఏ మేరకు మెప్పించిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే....

లవకుమార్(ఎన్టీఆర్) మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్. బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. అతడిలోని మంచితనాన్ని అలుసుగా చేసుకొని లవ్‌ను తోటి ఉద్యోగులే మోసం చేస్తుంటారు. మంచితనమే అతడికి శాపంగా పరిణమిస్తుంది. తన సమస్యలను పరిష్కరించుకొని ప్రేమించిన ప్రియ(రాశీఖన్నాను పెళ్లాడాలనేది అతడి కల.
కుశ(ఎన్టీఆర్) ఓ దొంగ. ప్రేమ పావురాలు సినిమా చూపించినా పావురాలు అమ్ముకుంటే ఎంత వస్తుందని లెక్కలేసుకునే టైపు. డబ్బంటే అమితమైన ప్రేమ. ఇండియాలో కంటే అమెరికాలో దొంగతనాలు చేస్తే ఇంకా ఎక్కువ సంపాదించుకొవచ్చనేది అతడి ఆలోచన. అమెరికావెళ్లడానికి అతడికి డబ్బు అవసరమవుతుంది. ఆ ప్రయత్నాల్లోనే సొంత తమ్ముడిని మోసం చేస్తాడు.

జై(ఎన్టీఆర్) ఓ రౌడీ. రావణాసురుడు తనకు ఆరాధ్యదైవం. అందుకే తన పేరును రావణాగా మార్చుకుంటాడు. పేరులోనే కాదు వ్యక్తిత్వంలోనూ రావణాసురుడే. ప్రేమ, దయ, అభిమానం అనేవి ఏమి ఉండవు. నిరంతరం పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటాడు. అడ్డొచ్చిన వారు ఎవరైనా చంపడమే అతడికి తెలుసు. తన రాజకీయ స్వార్థం కోసం సొంత తమ్ముైళ్లెన లవ, కుశలను చంపడానికి సిద్ధపడతాడు.

ప్పటికి కలిసి ఉంటామని అమ్మకు మాటిచ్చిన జై తన తమ్ముళ్లను చంపడానికి ఎందుకు సిద్ధపడ్డాడు, భిన్న మనస్తత్వాలతో వారు పెరగడానికి కారణమేమిటో తెలియాలంటే ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే...మామయ్యతో కలిసి నాటకాలు వేస్తుంటారు జై,లవ,కుశ. జైకి నత్తి. తనలో ఉన్న వైకల్యం కారణంగా డైలాగులు సరిగా పలకలేడు. మామయ్య లవ,కుశలను ప్రేమగా చూస్తూ జైని అవమానిస్తుంటాడు. తమ్ముళ్లు కూడా తనపై ప్రేమ చూపించకపోవడంతో జై రాక్షసుడిగా మారతాడు. భైరంపూర్ అనే గ్రామాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని భయపెడుతుంటాడు. ఎన్నికల్లో గెలిచి రాజకీయనాయకుడవ్వాలని కలలు కంటాడు. తన స్వార్థం కోసం తమ్ముళ్లను కూడా ఉపయోగించకుంటాడు. తాము చేసిన తప్పును తెలుసుకున్న తమ్ముళ్లు అన్నలో మార్పు తీసుకురాడానికి ప్రయత్నాలు చేస్తారు. వారి ఆశలు నెరవేరాయా?జై మారాడా? తన తమ్ముళ్లను చంపాడానికే సిద్ధపడ్డాడా? ఆ ముగ్గురు ఏకమయ్యారా?లేదా ?అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

ముగ్గురు కవల సోదరుల కథ ఇది. నాటకీయతకు, భావోద్వేగాలను మేళవించి తెరకెక్కించారు. త్రిపాత్రాభినయంలో ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రతినాయక ఛాయలతో సాగే జై పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. రాక్షసుడిగా ఈ పాత్రనుతీర్చిదిద్దిన తీరు బాగుంది. ఇక లవ్ పాత్ర పేరుకు తగినట్లుగానే లవర్‌బాయ్ తరహాలో సాగుతుంది. కుశ పాత్ర వినోదానికి ఉపయోగపడింది. భిన్న పార్వాల్లో సాగే మూడు పాత్రల్లో ఎన్టీఆర్ వైవిధ్యాన్ని చూపించడంలో సక్సెస్‌అయ్యారు. హీరోయిన్లు రాశీఖన్నా, నివేథాథామస్ గ్లామర్, పాటలకు మాత్రమే పరిమితయ్యారు. తమన్నా ప్రత్యేక గీతం ఆకట్టుకుంటుంది.

దర్శకుడు బాబీ ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. కానీ కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఉండేలా చూసుకోవడంలో మాత్రం సక్సెస్‌అయ్యారు. అన్నదమ్ములు విడిపోవడానికి గల కారణాల్ని, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే సన్నివేశాలపై దృష్టిపెడితే బాగుండేది. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం బాగుంది. కలర్‌ఫుల్‌గా సినిమాను తీర్చిదిద్దారు. దేవిశ్రీప్రసాద్ పాటల్లో రావణా గీతం అలరిస్తుంది. అందులోని సాహిత్యం బాగుంది. కల్యాణ్‌రామ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఎన్టీఆర్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. బిగ్‌బాస్ టెలివిజన్ షోతో ఎన్టీఆర్‌కు సరికొత్తగా యాడ్ అయిన ఇమేజ్‌తో ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను కూడా థియేటర్‌కు రప్పించగలిగే అవకాశం వుంది. దసరా పండగ సెలవులు కావడం కూడా ఈ చిత్రానికి కమర్షియల్‌గా కాస్తంత కలిసివస్తుంది. సో.. ఎన్టీఆర్ వన్‌మ్యాన్ షోగా జై లవకుశ ఆయన కమర్షియల్ సక్సెస్‌ల్లో ఒకటిగా నిలుస్తుంది.
రేటింగ్: 3/5

7339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS