ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతి బాబు విలన్‌గా టర్న్ తీసుకొని ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీ అయ్యారు. తండ్రి పాత్రలో, విలన్ పాత్రలోను కనిపించి మెప్పిస్తున్నాడు. తాజాగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రంలో ప్రెసిడెంట్ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రెసిడెంట్ పాత్రని జగపతి బాబు తప్ప మరెవరు పోషించలేరనేలా నటించాడు. అయితే తాజాగా జరిగిన రంగస్థలం విజయోత్సవంలో తనని ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జగపతి బాబు త్వరలో ఓ గుడ్ న్యూస్ చెబుతానని అన్నాడు. బాలీవుడ్ నుండి పిలుపు వచ్చిందని ఆ ప్రాజెక్ట్ ఏంటీ, ఆ వివరాలేంటీ త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. అయితే ఉత్తరాదిన జగపతి బాబు చేయబోవు ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ దబాంగ్ సిరీస్ లో మూడో భాగంగా రాబోతున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర చేయనున్నాడని సమాచారం. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళ భాషలలో నటించి అలరించిన జగపతి బాబు నార్త్ ప్రేక్షకులని ఎంతగా అలరిస్తాడో చూడాలి.