ముంబై: సినిమా సెట్స్‌లో తనకు ఎన్నోసార్లు ఇతర నటుల నుంచి వేధింపులు ఎదురయ్యాయని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పింది. కంగనా తనకెదురైన చేదు అనుభవాలను పీటీఐకి ఇచ్చిన ఇంటర్క్యూలో వెల్లడించింది. ‘సినిమా సెట్స్‌లో పలుసార్లు నాకు వేధింపులు ఎదురయ్యాయి. అయితే అవి లైంగిక వేధింపులు కావు..ఆ వేధింపులు మీటూ ఉద్యమంలోకి రావు. నేను ఎదుర్కొన్న అనుభవాలు కష్టమైనవి..అవమానకరమైనవి. నా సినీ జీవితంలో వివిధ స్థాయిల్లో, పలు సందర్భాల్లో చాలా మంది నా పట్ల కఠినంగా ప్రవర్తించారు. కొంతమంది వ్యక్తుల ఈగో సమస్య వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా. దీంతో సెట్స్‌కు వెళ్లి ఐదారుగంటలు నిరీక్షిస్తూ ఉండేదాన్ని. నా పాత్రకు వాయిస్‌ను అందించాల్సి వచ్చినపుడు..కొన్నిసార్లు నాకు సరైన సమయానికి ఫోన్ చేసే వాళ్లు కాదు..సెట్స్ వద్ద ఎదురుచూడాల్సి వచ్చేది. నా పాత్రకు సంబంధించిన డబ్బింగ్ విషయంలో కూడా నా అనుమతి తీసుకునేవారు కాదు. కొంతమంది హీరోల వల్ల నాకు చాలా సార్లు తప్పు డేట్స్ ఇవ్వడంతో చివరి నిమిషంలో షెడ్యూల్‌ను రద్దు చేసుకునేదాన్ని. సినిమాకు సంబంధించిన ఏ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించకపోవడం, ట్రైలర్ ఆవిష్కరణలు నేను లేకుండానే చేయడం, నాకు చెప్పకుండా ఎవరితోనే డబ్బింగ్ చెప్పించడం వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని’ తన ఛేదు అనుభవాలను షేర్ చేసుకుంది కంగనా రనౌత్.