నేను ఊహించని ప్రయాణమిది!

Sun,April 15, 2018 03:14 PM
I never expected this kind of response telugu actor suman says

భగవంతుడు ఉన్నాడని నా సినీ జర్నీతో అర్థమైంది. భగవంతుడి ఆశీస్సుల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. నటుడిగా రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణగార్ల జనరేషన్‌తో పాటు ఆ తరువాత వచ్చిన రెండు జనరేషన్‌లతో కలిసి నటించడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు నటుడు సుమన్. అనుకోకుండానే నటుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన ఈ 40 యేండ్ల కెరీర్‌లో ఇప్పటికి 450 చిత్రాల్ని పూర్తి చేశారు. పడి లేచిన కెరటంలా సాగిన ఆయన ప్రస్థానం ఆయన మాటల్లోనే..

-రవి గోరంట్ల, సెల్ : 9182777593

మాది కర్ణాటకలోని మంగళూరు. 1959 ఆగస్టు 28న పుట్టాను. నా అసలు పేరు సుమన్ తల్వార్. నా చిన్నతనంలోనే మంగళూరు నుంచి మా కుటుంబం చెన్నైకి మకాం మార్చింది. నా స్కూలింగ్ చెన్నైలోని ది బసంత్ థియాసాఫికల్ ఉన్నత పాఠశాలలో గడిచింది. ఆ తరువాత చెన్నైలోనే బీఏ ఇంగ్లిష్ లిటరేచర్ చేశాను. చెన్నైలోని ఉమెన్స్ యతిరాజ్ కాలేజ్‌లో ప్రిన్సిపల్‌గా బాధ్యతల్ని నిర్వర్తించేది మా అమ్మ. మా నాన్న పేరు సుశీల్ చంద్ర. ఐఓసీలో ఉద్యోగం చేసేవారు. నా మాతృభాష తుళు. హెచ్.ఎ.ఎస్ శాస్త్రి వద్ద సంగీతంతో పాటు సంస్కృతం నేర్చుకున్నాను. కాలేజీ రోజుల్లో మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి పెరిగింది. దాంతో కరాటే, కలరీ ఫైట్ నేర్చుకున్నాను. హీరోగా నటించాలని, సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకు నటించడం, డాన్స్ చేయడం తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే కరాటే. అందులో నేను బ్లాక్‌బెల్ట్ సాధించాను. నాకు తెలిసిన కిట్టు అనే కార్ మెకానిక్‌కు సినిమాలంటే చాలా పిచ్చి. ఎలాగైనా సినిమాల్లో నటించాలని తపన పడుతుండేవాడు. రోజూ నన్ను చూసిన ఆయన నువ్వెందుకు నటుడివి కాకూడదని వెంటపడ్డారు. మాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. నేను సినిమాల్లోకి రావడం ఏంటని కిట్టుతో అన్నాను. నీకు పర్సనాలిటీ ఉంది. హీరోగా నిలబడతావు. నీ పర్సనాలిటీనే నీకు ఎస్సెట్. ఒక్కసారి ఊ అను అని బలవంతపెట్టాడు. ఈ విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. అనుకోకుండా వారూ అంగీరరించారు. ఇష్టం ఉంటే నన్ను అడగడం దేనికి? అని మా అమ్మ అన్నారు. అమ్మ అలా మాట్లాడతారని నేను ఊహించలేదు. ఆమె మాటలు విని ఒక్కసారి షాక్‌కు గురయ్యాను. ఆ సమయంలో దర్శకుడు భారతీరాజా కొత్త వాళ్లతో సినిమాలు తీస్తూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఎంజీఆర్, శివాజీలని కలిపి సినిమా చేసి అప్పట్లోనే సంచలనం సృష్టించిన దర్శక నిర్మాత సీఆర్ రామన్న. అతని దగ్గరికి నన్ను తీసుకెళ్లి పరిచయం చేశారు. నన్ను చూసి ఇంప్రెస్ అయిన ఆయన తొలి అవకాశం ఇచ్చారు. నాలుగు రోజుల తరువాత సెట్‌లోకి వెళ్లాక నటన ఎంత కష్టమో అర్థమైంది. డాన్సింగ్ మరీ కష్టమని తెలిసింది. దాంతో ప్రతీరోజు ఉదయం ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ వద్దకు వెళ్లేవాడిని. ఆ తరువాత సీఆర్ రామన్న రూపొందించిన నీచకులం అనే తమిళ సినిమా ద్వారా 1977లో తెరంగేట్రం చేశాను. దీని తరువాత తమిళంలోనే వరుసగా వీట్టుక్కు వీడు వసపాడి, ఉలమై కోలం, థీ, కాదన్ మీన్‌గల్, ఎల్లమ్ ఇన్బ మయ్యం, నల్లాతు నాదంతే నాదంతే తీరుమ్, వాడగైవీడు, ఎన్నక్కాగ కాతిరు, ఆరాధనై వంటి పలు చిత్రాల్లో నటించాను. అప్పుడే నాకు భానుచందర్‌తో పరిచయం ఏర్పడింది. ఆయనే నన్ను తెలుగు చిత్రపరిశ్రమకు తీసుకొచ్చారు.

ఆయన వల్లే తెలుగులో ఇద్దరు కిలాడీలులో నటించాను. తెలుగులో ఇదే నా తొలి చిత్రం. తమిళ చిత్ర పరిశ్రమ కంటే తెలుగులోనే హీరోగా వెలిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉందని జోస్యం చెప్పిన భానుచందర్ పట్టుబట్టి నన్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అప్పట్లో సుధాకర్ హీరోగా మంచి రైజింగ్‌లో ఉన్నాడు. తను తెలుగులో నటిస్తూనే తమిళ చిత్రాలు చేసేవాడు. ఆయన్ని చూపించే నన్ను తెలుగులోకి తీసుకొచ్చారు. తెలుగులో భానుచందర్‌తో కలిసి నటించిన ఈ సినిమా తరువాత ఇక నేను వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, మలయాళం, భోజ్‌పురి, ఇంగ్లిష్, హిందీ చిత్రాలతో కలిపి మొత్తం ఎనిమిది భాషల్లో హీరోగా నటించాను. హీరోగా అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు 150 చిత్రాలకు పైగా చేశాను. వీటికి తోడు క్యారెక్టర్ నటుడిగా చాలా చిత్రాలు చేశాను. వాటన్నింటినీ కలిపితే 450 చిత్రాలు పూర్తయ్యాయి. తెలుగులో 99 చిత్రాల్లో హీరోగా నటించాను. ఒక్క సినిమా చేస్తే తెలుగులో హీరోగా సెంచరీ పూర్తవుతుంది. తొలి నాళ్లలో నాకు తెలుగు రాకపోయినా నన్ను ఆదరించి తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రోత్సహించారు. తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ఈ ఆదరాభిమానాల వల్లే నేను అత్యధిక చిత్రాల్లో నటించగలిగాను. నాకు కరాటే తెలుసు కాబట్టి అప్పట్లో నా ఫైట్స్ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత అదే ట్రెండ్‌గా మారి నాకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని అందించింది. నా ఫైట్స్ చూసిన వాళ్లంతే నన్ను కరాటే సుమన్ అని పిలిచేవారు. అప్పట్లో ప్రమాదకర స్టంట్స్ డూప్ లేకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు జంప్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. రోప్స్ వాడడం మొదలైంది. ఈ టెక్నాలజీ ఆ రోజుల్లో ఉండి ఉంటే పోరాట ఘట్టాల్ని మరింత అద్భుతంగానూ రక్తి కట్టించే వాళ్లం.

తెలుగులో నేను అంగీకరించిన తొలి చిత్రం ఇద్దరు కిలాడీలు. అయితే తొలుత విడుదలైంది మాత్రం తరంగిణి. ప్రతాప్ ఆర్ట్స్ కె.రాఘవ నిర్మాణంలో కోడిరామకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఏడాది పాటు ఆడి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నటుడిగా మాత్రం టి.కృష్ణ రూపొందించిన నేటి భారతం గుర్తింపు తెచ్చింది. మూడు సెంటర్‌ల్లో ఈ చిత్రం ఏడాది పాటు ప్రదర్శింపబడింది. పెద్దింటల్లుడు, రెండిళ్ల పూజారి, బావ బావమరిది, దొంగల్లుడు, చిన్నల్లుడు, భలే మావయ్య వంటి చిత్రాలు కమర్షియల్‌గా మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. అప్పట్లో పోటీ గురించి అసలు పట్టించుకునేవాడిని కాదు. ఆ దశలో నాకు సినిమాలు రాకపోతే ఇండస్ట్రీని వదిలేసి వేరే ఉద్యోగం వెతుక్కునేవాడిని. నా అదృష్టం కొద్దీ నాకు ఫ్లాప్స్ తక్కువే వచ్చాయి. ఒకవేళ నేను నటించిన చిత్రాలు పరాజయం అయినా భారీగానే వసూళ్లనూ సాధించేవి. హీరోగా వరుస చిత్రాల్లో నటిస్తున్న సమయంలో నాకు బ్యాడ్‌టైమ్ మొదలైంది. కొంతమందికి బ్యాడ్‌టైమ్ అనేది కెరీర్ తొలినాళ్లలోనే ఎదురవుతుంది. కొంతమందికి కెరీర్ ముగింపు దశలో వస్తుంది. దీని వెనుక ఎలాంటి రాజకీయాలు లేవు. నా బ్యాడ్ టైమ్ వల్లే అది అలా జరిగింది. ఆ తరువాత జైలుకు వెళ్లాను. ఇక అక్కడితో నా కెరీర్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో బయటికి రావడం.. నా గురించి తెలిసిన వాళ్లు వరుసగా నాతో సినిమాలు నిర్మించడంతో మళ్లీ ట్రాక్‌లో పడ్డాను. కండీషన్ బెయిల్ మీద బయటికి వచ్చిన సందర్భంలోనూ సినిమాలు చేశాను. వాటిల్లో దర్శకుడు శరత్ దర్శకత్వంలో వచ్చిన చాదస్తపు మొగుడు, కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించిన బందిపోటు, ఉగ్రనేత్ర, పల్నాటి రుద్రయ్య మంచి విజయాల్ని సాధించాయి. జైలు నుంచి పూర్తిగా రిలీవ్ అయిన తరువాత కంచు కవచం చేశాను. అప్పట్లోనే ఇది వందరోజులు ఆడింది. ఓ దశలో సరైన కథలు లభించక హీరోగా ఆపేసి క్యారెక్టర్ నటుడిగా మారాలని నిర్ణయించుకున్నాను.

అలా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన సినిమా గంగోత్రి. ఇందులో అల్లు అర్జున్‌కు తండ్రిగా నటించాను. ఈ సినిమా నుంచి క్యారెక్టర్ నటుడిగా నా ప్రయాణం ఇప్పటి వరకు సాఫీగా సాగిపోతున్నది. నేను డివోషనల్ పాత్రల్లో నటించగలనని ముందు నమ్మింది దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ఓ రోజు ఆయన మేనేజర్ ఫోన్ చేసి డైరెక్టర్‌గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని చెప్పారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన రాఘవేంద్రరావుగారు నన్ను అన్నమయ్య చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా నటించమని అడిగారు. ఏంటండీ తమాషా చేస్తున్నారా? నేనేంటీ వేంకటేశ్వరస్వామిగా నటించడం ఏమిటి? అన్నాను. ఆ పాత్ర స్కెచెస్ వేశాం. నువ్వు పర్‌ఫెక్ట్‌గా సూటవుతున్నావు, ఆ పాత్ర నువ్వే చేయాలి అన్నారు. అది విని షాక్ అయ్యాను. తరువాత ఇంట్లో చెప్పి చూస్తానన్నాను. రాఘవేంద్రరావు దర్శకుడు కాబట్టి మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. నిస్సందేహంగా అంగీకరించండని ఇంట్లో వాళ్లు చెప్పారు. గెటప్ చూసిన తరువాత 70 శాతం నమ్మకం ఏర్పడింది. అయితే సినిమా ఆడాలి కదా? అనుకున్నాను. దేవీ థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశాను. నన్ను వేంకటేశ్వరస్వామి పాత్రలో చూసిన ప్రేక్షకులంతా స్పెల్‌బౌండ్ అయ్యారు. సినిమా పూర్తయి బయటికి వస్తుంటే అంతా వచ్చి నా కాళ్లపై పడ్డారు. దాంతో సినిమా అందరికీ బాగా నచ్చిందని అర్థమైంది. అక్కడి నుంచి దేవుడి పాత్రలు అంటే సుమన్ అనే మంచి ఇమేజ్ వచ్చింది. ఈ చిత్రాన్ని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా చూడడం నాకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నాను.

శంకర్ రూపొందించిన శివాజీ సినిమా నటుడిగా నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమా కోసం నన్ను విలన్‌గా అనుకున్న సందర్భంలో సుమన్ ఏంటి? రజినీకాంత్ చిత్రంలో విలన్‌గా నటించడం ఏంటనే మాటలు వినిపించాయి. ఆ పాత్రకు నేను కరెక్ట్‌గా సూటవుతానని నన్ను నమ్మి దర్శకుడు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా చూసిన చాలామంది మహిళలు అద్భుతంగా నటించానని అభినందించారు. తమిళంలో ఈ సినిమా ద్వారా ఉత్తమ విలన్‌గా తమిళనాడు ప్రభుత్వం నన్ను అవార్డుతో సత్కరించింది. ఈ సినిమా నుంచి నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టాను. ఈ సినిమా వల్లే అక్షయ్‌కుమార్ హీరోగా క్రిష్ రూపొందించిన గబ్బర్ ఈజ్ బ్యాక్‌లో విలన్‌గా నటించాను. తెలుగులో ఆ స్థాయి పాత్రలు రాకపోవడం వల్ల విలన్ పాత్రల్లో నటించలేకపోయాను. నటుడిగా ఈ 40 యేండ్ల ప్రయాణంలో అన్ని రకాల పాత్రల్లో నటించాను. నటుడిగా నేను ఇన్నేళ్లు కొనసాగడం ఓ మిరాకిల్. నేను ఊహించని ప్రయాణమిది. నటుడిగా రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణగార్ల జనరేషన్‌తో పాటు ఆ తరువాత వచ్చిన రెండు జనరేషన్‌లతో కలిపి మూడు జనరేషన్‌లతో కలిసి నటించడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను.

3243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles