ఏఆర్ రెహమాన్ వీరాభిమానిని..

Sun,May 13, 2018 06:05 PM
I Am die heart fan of AR rahaman says music director mickey j meyer

కమర్షియల్, మాస్, మసాలాల వెంట పరుగెత్తడం నాకు నచ్చదు. తొలి నుంచీ మెలోడీ బాణీలకే ప్రాధాన్యమిస్తున్నాను. అవే సంగీత దర్శకుడిగా నాకంటూ మంచి పేరు తెచ్చిపెట్టాయి అన్నారు మిక్కీ జే మేయర్. హృదయోల్లాసంతో కూడిన శ్రావ్యమైన బాణీలకు ఆయన పాటలు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి. హ్యాపీడేస్, కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో నవతరం సంగీత దర్శకుల్లో ప్రతిభావంతుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. తన ప్రస్థానాన్ని గురించి మిక్కీ జే మేయర్ చెప్పిన ముచ్చట్లివి..

నేను పుట్టింది సికింద్రాబాద్‌లో. ప్యారడైజ్ దగ్గర ఉండేవాళ్లం. మా ఇంట్లో ఎల్లప్పుడూ సంగీత వాతావరణమే కనిపించేది. భాషా భేదాలతో సంబంధం లేకుండా నాన్న పాత పాటలను బాగా వింటుండేవారు. ఆయన ద్వారా క్రమక్రమంగా నాలో సంగీతం పట్ల ఆసక్తి మొదలైంది. పియానో ద్వారా పాత పాటలను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను. నా ఆసక్తిని గమనించిన నాన్న ఏ రోజూ అడ్డు చెప్పలేదు. ఆయన ప్రోత్సాహమే సంగీత దర్శకుడిగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నా విద్యాభ్యాసం మొత్తం సికింద్రాబాద్‌లోనే సాగింది. సెయింట్ మేరీస్‌లో చదువుకున్నాను. మ్యూజిక్ కారణంగా చదువు సరిగా సాగలేదు. పదేళ్ల వయసులోనే సంగీతంలో శిక్షణ తీసుకోవడం ఆరంభించాను. వెస్ట్రన్, క్లాసికల్ మ్యూజిక్‌పై మంచి పట్టు సాధించా. సంగీతపరంగా నా ప్రతిభను నిరూపించుకోవడానికి సినిమా పరిశ్రమే సరైందని అనిపించింది. అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు ప్రారంభించాను. ఈ క్రమంలో చాలా సినీ కష్టాల్ని ఎదుర్కొన్నాను. సొంతంగా కొన్ని బాణీలను తయారుచేసుకొని ఆ సీడీలను పట్టుకొని ఇండస్ట్రీలోని పలువురు దర్శక నిర్మాతల్ని కలిశాను. ఎవరూ ఆవకాశాలు ఇవ్వలేదు. మ్యూజిక్ పరంగా ఇండస్ట్రీలో పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. వాటన్నింటిని తట్టుకొని ప్రతిభను నిరూపించుకోవడం అంత సులభం కాదనిపించింది. ఒక్క అవకాశం కోసం చాలా రోజులు ఎదురుచుశాను. ఆ తరుణంలో తమ్మారెడ్డి భరద్వాజ గారు ఓ సినిమా చేస్తున్నారని తెలిసి ఆయన్ని కలిశాను. నా డెమో గీతాల్ని విన్నారు. ఆయనకు నచ్చడంతో సంగీత దర్శకుడిగా అవకాశమిచ్చారు. అలా పోతే పోనీ సినిమాతో తొలిసారిగా స్వరకర్తగా నా పేరును తెరపై చూసుకున్నాను. ఆ తర్వాత టెన్త్ క్లాస్, నోట్ బుక్ సినిమాలకు సంగీతాన్ని అందించాను. అందులోని పాటలు విజయవంతమయ్యాయి. కానీ సినిమాలు సరిగా ఆడకపోవడంతో నిరాశపడ్డాను.దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన డాలర్ డ్రీమ్స్ సినిమా నాకు నచ్చింది. అలాంటి సున్నితమైన కథాంశాలకయితే నేను బాగా బాణీలను సమకూర్చగలనని అనిపించింది. వెంటనే ఆయన్ని కలిసి ఓ అవకాశమివ్వమని అడిగాను. ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లమని అన్నారు.

దాదాపు ఐదారేళ్ల తర్వాత నన్ను గుర్తుంచుకొని హ్యాపీడేస్‌కు సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఆ సినిమా నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. తొలి విజయం ఎప్పటికీ మధురమైందే. సంగీత దర్శకుడిగా ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటికీ చాలామంది ఆ సినిమాలోని పాటల గురించి మాట్లాడుతుండటం సంతోషాన్ని కలిగిస్తుంది. హ్యాపీడేస్ తర్వాత వెంటనే కొత్త బంగారులోకం రూపంలో మరో విజయం దక్కింది. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, గణేష్,.. మహానటి వరకు నా ప్రయాణం నిదానంగా సాగుతూ వచ్చింది.

బాణీలను సమకూర్చే విషయంలో చాలా వరకు సంగీత దర్శకులపై దర్శక నిర్మాతల ఆధిపత్యం ఉంటుందని అంటుంటారు. కానీ నా విషయంలో మాత్రం అలా ఎప్పుడూ జరగలేదు. చాలా సందర్భాల్లో నేను మొదట వినిపించిన ట్యూన్స్‌నే అందరూ ఓకే చేసేవారు. శేఖర్ కమ్ముల, దిల్ రాజు, నాగ్ అశ్విన్.. ఇలా నేను పని చేసిన దర్శక నిర్మాతలందరికీ సంగీతం పట్ల మంచి అభిరుచి ఉండటంతో నా పని సులభమైంది. మిక్కీ మంచి మ్యూజిక్ అందిస్తాడనే వారిలో ఉండే నమ్మకమే నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి దోహదపడింది.

వ్యక్తిగతంగా అన్ని రకాల సంగీతాల్నీ అభిమానిస్తాను. రేడియో, పాప్ ఆల్బమ్స్ సాహిత్యం బాగుండే ప్రతి పాటను వింటాను. సంగీత దర్శకుడిగా ప్రయోగాలు ఎక్కువగా చేస్తుంటాను. అందులో విజయం, విమర్శలు రెండు ఉంటాయి. వాటిని ఒకేలా స్వీకరించాను. విమర్శలు వచ్చినా నిరాశ చెందను. కొత్తదనాన్ని అందించడానికే ఇష్టపడతాను. ఏ.ఆర్.రెహమాన్‌కు వీరాభిమానిని. అలాగే కొంతమంది హాలీవుడ్ కంపోజర్స్ అంటే ఇష్టం. ఇంతకు ముందు వారు స్వరపరిచిన బాణీలను బాగా వింటుండేవాడిని. కానీ ఇప్పుడు మానేశాను. ఇతరుల ప్రభావం నాపై ఉండకుండా జాగ్రత్త పడుతున్నాను. లేదంటే ఫలానా వారి పాటను కాపీ కొట్టాడనే విమర్శలు ఎదురవుతుంటాయి. శ్రోతల నుంచే నాలోని తప్పొప్పుల్ని తెలుసుకొని సరిదిద్దుకుంటాను. సోషల్‌మీడియా, ఆన్‌లైన్ ద్వారా నా పాటల పట్ల అభిప్రాయాల్ని తెలుసుకుంటాను. ఇంట్లో వాళ్లను మాత్రం అడగను. వారికి నా పాటలన్నీ ఇష్టమే. లేదని ఎప్పుడూ చెప్పరు. '

సంగీత దర్శకుడిగా ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో మహానటి కోసం ఎక్కువ కష్టపడ్డాను. సావిత్రి గారి సినిమాల్ని చూశాను. ఆమె పాటల్ని విన్నాను. కానీ ఆమె జీవిత కథకు సంగీతం అందించే అవకాశం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. సంగీత దర్శకుడిగా నా కెరీర్‌లోఎక్కువ సమయాన్ని తీసుకొని చేసిన ఆల్బమ్ ఇదే. ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ బాగా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన నాకు లేదు. నన్ను వెతుక్కుంటూ వచ్చిన సినిమాలకే బాణీలను అందిస్తున్నాను. కెరీర్ తొలినాళ్ల నుంచీ నిదానంగానే సినిమాలు చేస్తున్నాను. తొందరపడి సినిమాలు చేయడం నాకు నచ్చదు. అలాగని అవకాశాలు రాలేదని ఎప్పుడూ బాధపడలేదు. కెరీర్ ఇలాగే బాగుంది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నాను. వృత్తిని, వ్యక్తిగత జీవితానికి సమంగా సమయాన్ని కేటాయిస్తాను. విరామం దొరికితే స్నేహితులు, కుటుంబసభ్యులతో గడుపుతుంటాను. నా పిల్లలతో కాలక్షేపం చేస్తాను. అలాగే, ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. భిన్న దేశాలు, ప్రదేశాలను దర్శిస్తుంటాను. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ట్రావెలింగ్ నాకు ఆటవిడుపుగా ఉపయోగపడుతుంది.

2735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles