హైదరాబాద్ సౌతిండియా సిని పరిశ్రమకు వేదికగా మారాలి: మంత్రి కేటీఆర్

Wed,November 20, 2019 08:54 PM

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా దక్షిణ భారత దేశ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికవ్వాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. హెచ్‌ఐసీసీలో ఇండియా జాయ్ కార్యక్రమాన్ని మంత్రి.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ రంగాలపై నిపుణులతో చర్చ జరిగింది. ఆయా రంగాలు అభివృద్ధి జరిగేలా కార్యాచరణ రూపొందించాలని చర్చలో మంత్రి పిలుపునిచ్చారు. అందుకు గానూ నగరంలో రూ. 1000 కోట్ల పెట్టుబడితో ఇమేజ్ టవర్స్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఇమేజ్ టవర్స్ 2021 లేదా 2022లో ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు. యానిమేషన్, గేమింగ్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ వచ్చిన తర్వాత సినిమా చిత్రీకరణలో, కంటెంట్ క్రియేషన్ ఆవశ్యకంగా మారాయని మంత్రి తెలిపారు. మనకు కావల్సింది కేవలం ప్రపంచస్థాయి నిపుణులు, అద్భుతమైన స్టూడియోలు. అవి ఉంటే యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ ఆధారిత సినిమాలు ఇక్కడి నుంచే తెరకెక్కించవచ్చని ఆయన తెలిపారు.


బాహుబలి, లైఫ్ ఆఫ్ పై, అరుంధతి, మగధీర, ఈగ వంటి వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ ఆధారిత చిత్రాలు ఈ మధ్య కాలంలో గొప్ప మార్పును తీసుకొచ్చాయని మంత్రి అన్నారు. గేమింగ్ పరిశ్రమ సైతం విశేషంగా అభివృద్ధి చెందిందనీ, గేమింగ్ విభాగంలోనూ 25 శాతం వృద్ధి నమోదవుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ గురించి మినిస్టర్ కేటీఆర్ చూపిస్తున్న శ్రద్ధ అమోఘమని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు మహేష్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్, వీఎఫ్‌ఎక్స్ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

1458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles