రాజ‌మౌళి సినిమా కోసం హైద‌రాబాద్‌లో భారీ సెట్‌

Fri,June 8, 2018 12:15 PM
huge set for rajamouli movie

ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌కి బ్రేక్ అనేదే లేదు. రోజుకొక వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా కోసం భారీ సెట్ వేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సాబు సిరిల్ మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట‌, ఈ సెట్‌లో యాక్షన్‌ సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

సంవత్సరాంతంలో చిత్రాన్ని సెట్స్‌మీదకు తీసుకొస్తామని ఇటీవల నిర్మాత డి.వి.వి.దానయ్య ప్రకటించారు. చిత్ర బృందం ముగ్గురి కలయికను స్ఫురించేలా ఆర్.ఆర్.ఆర్ అనే మూడు ఇంగ్లీష్ అక్షరాల లోగోతో కూడిన వీడియోను విడుదల చేసి అభిమానుల‌లో అంచ‌నాలు పెంచింది చిత్ర బృందం. ఈ చిత్రం ఒక్కరోజు వ్యవధిలో జరిగే సంఘటనల సమాహారంగా ఈ చిత్ర కథాంశం వుంటుందని చెబుతున్నారు. ప్రథమార్థంలో రామ్‌చరణ్, ద్వితీయార్థంలో ఎన్టీఆర్ పాత్రలు కీలకంగా ఉంటాయని అంటున్నారు. అనూహ్య మలుపులతో ఉత్కంఠభరితంగా సాగే ఇతివృత్తమిదని సమాచారం. ఇక చిత్రంలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండ‌గా, ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడనేది తాజా స‌మాచారం. ఇద్దరు అన్న‌ద‌మ్ములైన‌ప్ప‌టికి వారు ఎంచుకున్న మార్గాలు వేరే కావ‌డంతో కొన్ని అనూహ్య పరిమాణాలు చేసుకోనున్నాయి.

ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రం దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితం కానున్న‌ట్టు సమాచారం. భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వనిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజమౌళి ఇటీవల ఎన్టీఆర్‌, చెర్రీలకు పూర్తి స్క్రిప్ట్‌ వినిపించడంతో వారు క‌థ విని ఫుల్ హ్యాపీగా ఫీల‌య్యార‌ట‌. మ‌రి ఈ చిత్రంతో జ‌క్క‌న్న ఎన్ని రికార్డులు కొల్ల‌గొడ‌తాడో చూడాలి.

3176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles