చిన్న పిల్లాడిలా ఏడ్చిన కౌశ‌ల్.. రీ ఎంట్రీ ఇచ్చిన పాత కంటెస్టెంట్స్

Sat,September 29, 2018 08:27 AM
housemates Reunion in the House

బిగ్ బాస్ హౌజ్ కోలాహాలంగా మారింది. గొడ‌వ‌లు, కొట్లాట‌లు, దూష‌ణ‌లు ఇలా ఎన్నో విష‌యాల‌తో వంద రోజుల‌కి పైగా థ్రిల్లింగ్‌గా సాగిన బిగ్ బాస్ సీజ‌న్ 2 రియాలిటీ షోకి రేప‌టితో శుభం కార్డ్ ప‌డ‌నుంది. ఈ వారం అంతా ఇంటి స‌భ్యుల‌ని ఆనందింప‌జేసే క్రమంలో ఉన్నారు బిగ్ బాస్‌. 110వ ఎపిసోడ్‌లో ఒక్కో ఇంటి స‌భ్యుడిని యాక్టివిటి ఏరియాలోకి పిలిచి వారి ప్ర‌యాణం గురించి వివ‌రిస్తూ ఏవి చూపించ‌గా, 111వ ఎపిసోడ్‌లో మిగిలిన కంటెస్టెంట్స్ గీతా మాధురి, కౌశ‌ల్ ఏవి చూపించారు. ముందుగా గీతా మాధురిని యాక్టివిటీ ఏరియాలోకి పిల‌వ‌గా, అందులో ఉన్న టాస్క్ ప్రాప‌ర్టీస్ చూసి థ్రిల్ అయింది గీతా.

గీతా మాధురి జ‌ర్నీని ఏవిగా చూపించే ముందు బిగ్ బాస్‌.. ఆమెకి చీవాట్లు పెడుతూనే ప్ర‌శంస‌లు కురిపించారు. సెల‌బ్రిటీలా వచ్చిన మీలో చిన్న అల్ల‌రి దాగి ఉంద‌నే విష‌యాన్ని ప్రేక్ష‌కులు గ‌మ‌నించారు. కొన్ని సంద‌ర్భాల‌లో మీరు ఇంటి నియ‌మాల‌ని పాటించ‌కుండా, మిగ‌తా వారిలా టాస్క్‌లు ఆడలేద‌ని ఉన్నారు. మొద‌ట టాస్క్‌ని స‌రిగా అర్ధం చేసుకోరు అని కూడా తెలిపారు. అయితే కొన్ని సార్లు బిగ్ బాస్ ఆటను మీ తరహాలో ఆడారు అదే మీలో ఉన్న ప్రత్యేక గుణం. రెండు సార్లు హౌస్ కెప్టెన్ అయిన ప్రత్యేకమైన వ్యక్తి మీరు. నవ్వుతూ నవ్విస్తూ హౌస్‌లో కొనసాగుతూ మీరు నమ్మిన వైపు కట్టుబడ్డారు. ఇంటి సభ్యులే కాకుండా బిగ్ బాస్ కూడా ఎన్నో సందర్భాల్లో మీ పాటకు చిందేశారు. మీ దృడ సంకల్పానికి విశ్వాసానికి అభినందులు తెలుపుతూ మీరు కోరుకునే ఎత్తుకు ఎదగాలన్నారు బిగ్ బాస్. అనంతరం గీతా మాధురి జర్నీకి సంబంధించిన 10 నిమిషాల వీడియోను ప్లే చేశారు బిగ్ బాస్. ఈ వీడియో చూస్తూ ఎమోషన్ అయ్యింది గీతా మాధురి.

ఇక చివ‌రిగా యాక్టివిటీ ఏరియాలోకి వ‌చ్చిన కౌశ‌ల్‌తో మాట్లాడిన బిగ్ బాస్.. ఆయ‌న‌ని చాలా ఎమోష‌న్ చేశారు. స్వ‌తంత్య్ర భావాలు క‌లిగిన వ్య‌క్తిగా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టిన మీరు ప్ర‌ముఖ ఇంటి స‌భ్యుడు అయ్యారు. లోకులు చెప్పిన‌ట్టుగా ప్ర‌జాద‌ర‌ణ పొందుతూనే మంచి ప‌రిణామాల‌ని, చెడు ప‌రిణామాల‌ని ఎదుర్కొన్నారు. ప్ర‌తి టాస్క్‌లో క్రియేటివ్‌గా వంద శాతం ప్ర‌య‌త్నిస్తారో అంద‌రికి అర్ధ‌మైంది. ఇచ్చిన ప్రతి టాస్క్‌లోనూ ప్రాణం పెట్టి ఆడారు. మీ ఆలోచన విధానం, గెలవాలనే పిచ్చి పట్టుదల హౌస్‌లో ఉన్న చాలా మందికి నచ్చలేదు. ఎదురు ప్రశ్నలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ వెనుకడుగు వేయలేదు.


ఎల్ల‌ప్పుడు స్వ‌త‌హాగా మీ బ‌లంతో ముందుకెళ్లారు. మీ మనోధైర్యం ,ప‌ట్టుద‌ల‌ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. ఎన్నోసార్లు మీరు బిగ్ బాస్ హౌస్‌లో ఒంటరి పోరాటం చేసినా కూడా తుది ఫలితం పైనే మీ దృష్టి ఉంచారు. మీరు ఇప్పటి వరకూ ఏకాకిగానే ప్రయాణించారు. మీరు నమ్మిన దాని కోసం ఒంటిరి పోరాటం చేశారు. కొన్ని సార్లు భావోద్వేగానికి గురైన నాన్న‌లా మ‌రి కొన్ని సార్లు మీరు న‌మ్మిన దాని కోసం ఒంట‌రి పోరాటం చేశారు. కాని మీ పట్టుదల కోల్పోలేదు. ఎదుటి వారి బలహీనతల్నే మీ బలంగా మార్చుకున్నారు అని స్ప‌ష్టం చేశారు బిగ్ బాస్‌. అనంత‌రం బిగ్ బాస్ హౌస్‌లో కౌశ‌ల్ కొనసాగించిన జర్నీపై 10 నిమిషాల స్పెష‌ల్ వీడియోని ప్లే చేశారు.

కౌశల్‌కి సంబంధించిన వీడియోలో ఆయ‌న‌ ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు, ఒంట‌రిగా ఉన్న అత‌న‌ని టార్గెట్ చేసి మిగిలిన సభ్యులు ఇబ్బందులకు గురిచేసిన సన్నివేశాలను కళ్లకు కట్టి చూపించారు బిగ్ బాస్. ఇక తన భార్య పిల్లలు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన సన్నివేశం వచ్చినప్పుడు చాలా భావోద్వేగానికి లోనయ్యారు కౌశల్. ఆయ‌న ఎమోష‌న్స్ చూసిన ప్రేక్ష‌కుల‌కి కూడా కంట క‌న్నీరు ఆగ‌లేదు. ఇక హౌజ్ నుండి వీడిన వారు ఎప్పుడొస్తారా అని అంద‌రు ఆతృత‌గా ఎదురు చూస్తున్న క్రమంలో ముందుగా రోల్ రైడా, అమిత్‌లు ఇంట్లోకి వ‌చ్చారు. వీరి చూసిన ఐదుగురు ఫైన‌లిస్ట్‌లు చాలా హ్యాపీగా ఫీల‌య్యారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీల‌తో క‌లిపి మొత్తం ఇంటి స‌భ్యులు 18 కాగా వీరిలో బాబు గోగినేని, భాను శ్రీ, యాంకర్ శ్యామల, కిరీటి దామరాజు, దీప్తి సునైనా, తేజస్వి మదివాడ, గణేష్, సంజనా అన్నే, నందిని రాయ్, పూజా రామచంద్రన్‌లు విడ‌త‌లుగా ఇంట్లోకి ప్ర‌వేశించారు. కౌశ‌ల్‌కి ఇంట్లో ఎంతో స‌పోర్ట్ ఇచ్చిన నూతన్ నాయుడు మాత్రం రీయూనియ‌న్‌లో పార్టిసిపేట్ చేయ‌లేదు. అయితే నూతన్ నాయుడు హాజరుకాకపోవడంపై అంతా ఆసక్తిగా మారింది. సామాన్యుడిగా వ‌చ్చిన నూత‌న్ నాయుడు 15వ ఎపిసోడ్‌లో ఎలిమినేట్ కాగా, రీఎంట్రీ ద్వారా 50వ ఎపిసోడ్‌లో శ్యామ‌ల‌తో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.

కెప్టెన్ టాస్క్ కోసం బాల్స్ విసిరే క్ర‌మంలో ఆయ‌న‌కి భుజం గాయం కార‌ణంగా 69వ ఎపిసోడ్‌లో ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ళారు నూత‌న్‌..ఆ త‌ర్వాత తిరిగి ఇంట్లోకి వ‌చ్చిన 85వ ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యారు. అయితే రీయూనియ‌న్‌కి అంద‌రు హాజ‌రైన నూత‌న్ హాజ‌రు కాక‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన‌డంతో తాను ఓపెన్ లెట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న ఎలిమినేష‌న్ ప్ర‌జా తీర్పుకి అనుగ‌ణంగా జ‌ర‌గ‌నందున నిరాశ‌కి గుర‌య్యాన‌ని ,భారీగా ఓట్లు వ‌చ్చిన కూడా బిగ్ బాస్ అవి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని అన్నారు. ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల‌న‌నే తాను ఎలిమినేట్ అయ్యానంటూ నూత‌న్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ కార‌ణంగానే నూత‌న్ పాత హౌజ్‌మేట్స్‌తో క‌లిసేందుకు రాలేద‌ని తెలుస్తుంది. ఇక నేడు శ‌నివారం కావ‌డంతో నాని హౌజ్‌మేట్స్ అంద‌రితో చేసే సంద‌డి ప‌తాక స్థాయిలో ఉంటుంద‌ని అంద‌రు భావిస్తున్నారు.

7559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles