హిప్పీ.. సినిమా రివ్యూ

Thu,June 6, 2019 03:46 PM
Hippi movie review

ఆర్‌ఎక్స్ 100. ఈ సినిమా విజయంతో వెలుగులోకి వచ్చారు యువ హీరో కార్తికేయ. యంగ్ హీరోల్లో ఈ సినిమాతో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్నారాయన. దాదాపు 12 ఏళ్ల క్రితం సూర్య నటించిన చిత్రం నువ్వు నేను ప్రేమ. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుని దర్శకుడు టి.ఎన్.కృష్ణకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. వీరిద్దరి కలయికలో రూపొందిన చిత్రం హిప్పీ. మోర్ క్యాజువల్ అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించారు. క్రేజీ కాంబినేషన్ కలయికలో రూపొందిన ఈ చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆర్‌ఎక్స్ 100 వంటి సంచలన విజయం తరువాత కార్తికేయ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలని అందుకుందా?. కార్తికేయ క్రేజ్‌ని మరింతగా పెంచే స్థాయిలో వుందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
హిప్పీ అలియాస్ దేవదాస్(కార్తికేయ) కిక్ బాక్సర్. స్పోర్ట్స్ కోటాలో ఓ కంపెనీలో జాబ్ చేస్తుటాడు. అదే ఆఫీస్‌లో అతనికి బాస్‌గా పనిచేస్తుంటాడు అరవింద్(జేడీ చక్రవర్తి). జీవితాన్ని ఎలా ఆస్వాదించాలి?. అమ్మాయిల విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి వంటి విషయాల్ని హిప్పీకి చెబుతూ హితబోధ చేస్తుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే లవ్ గురు లాంటి పాత్ర అతనిది. అమ్మాయిలకు ప్లేబాయ్‌లా కనిపించే హిప్పీని స్నేహ(జజ్బాసింగ్) ప్రేమిస్తుంది. ఓ రోజు ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదామని ఫోర్స్ చేస్తుంది. తన ఫోర్స్ వల్ల స్నేహతో కలిసి హిప్పీ గోవా పయనమవుతాడు. ఆ క్రమంలో హిప్పీకి స్నేహ ఫ్రెండ్ అమ్యుక్తమాల్యద(దిగాంగన సూర్యవన్షీ) కలుస్లుంది. తొలి చూపులోనే అమ్యుక్త మాల్యద ప్రేమలోపడిపోతాడు హిప్పీ. అయితే తన ప్రేమను అంగీకరించాలంటే కంప్లీట్‌గా మారాలని, ఇద్దరం కలిసి సహజీవనం చేద్దామని చెబుతుంది. ఆ క్రమంలో ఇద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి?. అమ్యుక్త మాల్యదను హిప్పీ ఎందుకు వదిలించుకోవాలనుకున్నాడు? వీరిద్దరి మధ్యలోకి హిప్పీ బాస్ అరవింద్ ఎందుకొచ్చాడు?. చివరికి హిప్పీ, అమ్యుక్త మాల్యద ఒకటయ్యారా? లేదా విడిపోయారా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు కార్తికేయ. యంగ్ హీరోల్లో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. అతని నుంచి సినిమా అంటే అంచనాలుంటాయి. మోర్ క్యాజువల్ అంటూ ట్యాగ్‌లైన్‌కు తగ్గట్లే సినిమాలో కార్తికేయ పాత్రని తీర్చి దిద్దారు. తన మనసులో ఏం అనిపిస్తుందో దాన్ని వెంటనే ఎలాంటి మోహమాటం లేకుండా బయటికి చెప్పే పాత్రలో కార్తీకేయ ఒదిగిపోయారు. కానీ కొన్ని చొట్ల పాత్ర తేలిపోయినట్లు కనిపిస్తుంది. కిక్ బాక్స్‌ర్‌గా ఆకట్టుకున్న కార్తికేయ లవర్ బాయ్‌గా నటించిన సన్నివేశాల్లో, కీలక ఘట్టాల్లో మరింతగా తన హావభావాల్ని పలికించి వెంటే బాగుండేది. ఓవరాల్‌గా తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఆర్‌ఎక్స్ 100 డైరెక్టర్ స్టోరీ కాబట్టి కార్తికేయ నుంచి తనకు కావాల్సిన హావభావాల్ని రాబట్టుకున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో కార్తికేయ పాత్ర చిత్రణలో అది లోపించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇలాంటి కథల్ని క్రేజ్ వున్న స్టార్స్ చేస్తే మరో లెవెల్లో వుండేదేమో అన్న భావన కూడా సగటు ప్రేక్షకుడికి అనిపించేలా కార్తికేయ నటన వుండటం ఈ సినిమాకు కొంత డ్రాబ్యాక్.

ఈ సినిమాకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ ఎవరైనా వున్నారంటే అది హీరోయిన్ దిగాంగన సూర్యవన్షీ. తనకు తెలుగులో తొలి చిత్రమైనా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. నటనే కాకుండా తన గ్లామర్‌తో ఈ చిత్రానికి తలుకులద్దే ప్రయత్నం చేసింది. ైక్లెమాక్స్ సన్నివేశాల్లోనూ, కార్తికేయను ఏడిపించే సన్నివేశాల్లోనూ.. ఇలా తను కనిపించిన ప్రతి సీన్‌లోనూ ఈజ్‌తో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాతో దిగాంగన రూపంలో క్రేజీ హీరోయిన్ లభించినట్లే. హిప్పీ లవ్‌గా జజ్బాసింగ్ తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించింది. లవ్ గురు తరహా పాత్రలో జేడీ చక్రవర్తి ఒదిగిపోయాడు. తెలంగాణ యాసలో జేడీ చెప్పిన సింగిల్ లైన్ డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఇక ఈ రొమాంటిక్ జర్నీలో హీర్లే డేవిడ్‌సన్ పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వించాడు. బ్రహ్మాజీ, సుదర్శన్ తమ పాత్రల పరిథిమేరకు నటించారు. హీరో హీరోయిన్‌లని మినహాయిస్తే ఈ సినిమాలో జేడీ, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తప్ప చెప్పుకోదగ్గ నటులు కనిపించలేదు.

సాంకేతిక వర్గం
ప్రేమకథలకు, రొమాంటిక్ చిత్రాలకు ఫొటోగ్రఫీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికీ ఆర్.డి. రాజశేఖర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతీ ఫ్రేమ్‌ని చాలా అందంగా తీర్చిదిద్దారాయన. ఈ చిత్రానికి దర్శకుడు టి.ఎన్.కృష్ణ, కాశీ నడింపల్లి మాటలు అందించారు. సినిమాలోని ప్రతి సన్నివేశం, ప్రతీ ఫ్రేమ్‌లోనూ వచ్చే మాటలన్నింటిని ద్వందర్ధాలతో ఈ ఇద్దరు నింపేశారు. యువతను టార్గెట్ చేస్తూ మాటల్ని చాలా బోల్డ్‌గా రాశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందికరంగా వున్నా నేటి యువత ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాతో తమిళ సంగీత దర్శకుడు నివాస్ ప్రసన్న తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆయన అందించిన నేపథ్య సంగీతంతో పాటు ఎవతివే...ైక్లెమాక్స్‌లో వచ్చే సాంగ్, మరో పాట ఆకట్టుకుంటాయి. అనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. వి క్రయేషన్స్ అధినేత కలైపులి ఎస్.థాను నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్ వుండేలా చూసుకున్నారు. ఓ భారీ చిత్రం స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ ఈ చిత్రాన్ని మరింత క్రిస్పీగా కట్ చేసి వుంటే బాగుండేది.

దర్శకుడి పనితీరు:
నేటి యువత మనోభావాల్ని ప్రతిబింబిస్తూ దర్శకుడు టి.ఎన్.కృష్ణ హిప్పీ చిత్ర కథని రాసుకున్నారు. కాన్సెప్ట్ హర్షించదగ్గదే అయినా దాన్ని మరింత బోల్డ్‌గా చూపించే ప్రయత్నంలో దాన్ని ఆయన ప్రాపర్‌గా స్క్రీన్‌పైకి తీసుకురావడంలో నూటికి నూరు శాతం విజయం సాధించలేకపోయారని సినిమా చూస్తే అర్థమవుతుంది. 12 ఏళ్ల క్రితం సూర్య, జ్యోతిక, భూమికల కలయికలో నవ్వు నేను ప్రేమ వంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందించిన ఆయన నుంచి ఇలాంటి బోల్డ్ సినిమాని ప్రేక్షకులు ఊహించలేరు. స్క్రీన్‌ప్లే పరంగానూ కొంత గ్రిప్పింగ్ తగ్గినట్లుగా కనిపిస్తుంది. బోల్డ్ చిత్రాలకు నేటి యువత అలవాటుపడ్డారని అంతా అవే తీస్తే వరూ చూడరు. అందులో ఆకట్టుకునే కథా, కథనం వుండాలి లేదంటే సరైన కథ, కథనాలు లేకుండా బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ప్రతీదీ అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 కాలేవని హిప్పీ చూసిన ప్రతీ ఒక్కరికీ అర్థమవుతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే హిప్పీ అంచనాలతో థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల్ని సంతృప్తిపరచలేకపోయింది.
రేటింగ్: 2.5/5

5330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles