హైదరాబాద్: ఆడపిల్లల పట్ల సామాజిక రుగ్మతను రూపుమాపాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సినీనటుడు మహేశ్‌బాబు అన్నారు. ప్రతీఏడాది జనవరి 24వ తేదీని జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సమాజంలో బాలికలు, యువతులు ఎదుర్కొంటున్న అసమానతలను ప్రజలకు గుర్తుచేస్తూ.. వారికి సరికొత్త అవకాశాల కల్పనతో పాటు మరింత మద్దతును ప్రకటించేందుకు జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నటుడు మహేశ్‌బాబు ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. బాలికలపట్ల సామాజిక అసమానతలను రూపుమాపేందుకు కృషిచేద్దామని పిలుపునిచ్చారు. విద్యావకాశాలు కల్పించాలన్నారు. సాధికారత వైపు అడుగులేస్తూ వృద్ధి చెందేలా వికసించనీయాలన్నారు.