హాలీవుడ్‌ను కుదిపేస్తున్న వైన్‌స్టీన్ స్కాండల్

Thu,October 12, 2017 01:37 PM
హాలీవుడ్‌ను కుదిపేస్తున్న వైన్‌స్టీన్ స్కాండల్

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ మొఘల్ హార్వే వైన్‌స్టీన్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డాడు. ప్రఖ్యాత ప్రొడ్యూసర్‌గా పేరుగాంచిన వైన్‌స్టీన్‌పై అత్యాచార ఆరోపణలు ఎక్కువయ్యాయి. రోజు రోజూకూ వైన్‌స్టీన్‌పై ఆరోపణలు చేస్తున్న నటీమణుల సంఖ్య పెరుగుతున్నది. గత వారం రోజుల నుంచి వైన్‌స్టీన్ ఉదంతం హాలీవుడ్‌ను అత్యంత దారుణంగా కుదిపేసింది. వైన్‌స్టీన్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండడంతో హాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైన్‌స్టీన్.. మానసికంగానూ ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తున్నది. నటి కావాలన్న మోజులో సినీరంగంపై ఆసక్తి కనబరిచే అమ్మాయిలను.. వైన్‌స్టీన్ లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే యువ హీరోయిన్లు ఒక్కొక్కరుగా తాము అనుభవించిన ఇబ్బందులను బయటపెడుతున్నారు. దీంతో వైన్‌స్టీన్‌పై ఒత్తిడి ఎక్కువైంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను వైన్‌స్టీన్ ఖండించారు. ఆయన తరపున లాయర్లు కూడా అదే మాట చెబుతున్నారు. నిర్మాత వైన్‌స్టీన్ ప్రవర్తనపై వరుసగా వస్తున్న ఆరోపణలతో అమెరికా పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఒక్క హాలీవుడ్‌నే కాదు.. వైన్‌స్టీన్ వల్ల అమెరికా రాజకీయాల్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. డెమోక్రాట్లకు వైన్‌స్టీన్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డెమోక్రటిక్ నేతలు హిల్లరీ క్లింటన్.. బరాక్ ఒబామాతోనూ వైన్‌స్టీన్‌కు లింకులు ఉన్నాయి. గత అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం కోసం క్లింటన్‌కు భారీ స్థాయిలో వైన్‌స్టీన్ నుంచి విరాళాలు అందాయి. అయితే ఈ అంశంపై హిల్లరీ క్లింటన్ స్పందించారు. వైన్‌స్టీన్ ఇచ్చిన విరాళాలను మొత్తంగా ఛారిటీకి డొనేట్ చేయనున్నట్లు హిల్లరీ చెప్పారు. వైన్‌స్టీన్ తమను వేధించారని ఫేమస్ హీరోయిన్లు గ్వినిత్ పాల్ట్రో, ఏంజలినా జోలీలు ఆరోపించారు. కొన్ని దశాబ్ధాలుగా వైన్‌స్టీన్ ఇలాగే ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 20 మంది హీరోయిన్లు ఈ ఆరోపణలు చేశారు. వైన్‌స్టీన్ చర్యలు హేయంగా ఉన్నాయని హాలీవుడ్ హీరో బెన్ ఎఫ్లెక్ ట్వీట్ చేశాడు.

1286

More News

VIRAL NEWS