సీరియ‌ల్ న‌టిపై హెయిర్ డ్రెస్స‌ర్ దాడి

Wed,June 19, 2019 08:29 AM
hair dresser attack on Raga Madhuri

బుల్లితెర న‌టి రాగ‌మాధురి (37) పై హెయిర్ డ్రెస్స‌ర్ జ్యోతిక దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఓ ధారావాహిక‌కి సంబంధించిన షూటింగ్ సెట్లోనే ఆమె దాడి చేయ‌డంతో అంద‌రు బిత్త‌ర‌పోయారు. రాగ‌మాధురి సోమ‌వారం రాత్రి త‌న‌పై జ‌రిగిన దాడి గురించి బంజారాహిల్స్ పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు జ్యోతిక‌తో పాటు మ‌రో ఏడుగురిపై ప‌లు సెక్ష‌న్స్ కింద కేసులు న‌మోదు చేసిన‌ట్టు తెలుస్తుంది. వివ‌రాల‌లోకి వెళితే గ‌చ్చిబౌలిలో నివ‌సించే రాగ‌మాధురి .. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 13లోని లక్ష్మీపార్వతి నివాసం వద్ద ఓ తెలుగు సీరియల్‌ షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈనెల 16న షూటింగ్ అనంత‌రం త‌న న‌ల్లపూస‌ల గొలుసు మాయ‌మైన‌ట్టు గుర్తించిన రాగ‌మాధురి సెట్లో ఉన్న‌వారంద‌రిని అడిగి చూసింది. ఫ‌లితం లేక‌పోవ‌డంతో బంజారా హిల్స్ పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది. హెయిర్‌ డ్రెసర్‌తోపాటు మరో ఇద్దరిపై త‌నకి అనుమానం ఉంద‌ని రాగ‌మాధురి తెలిపింది.

రాగ‌మాధురి ఫిర్యాదు మేర‌కు జ్యోతిక‌ని ఠాణాకి పిలిపించారు పోలీసులు. ఆ సమయంలో షూటింగ్‌కు చెందిన కొందరు కారులో గొలుసు దొరికిందంటూ స్టేష‌న్‌కి వచ్చి అది పోలీసులకిచ్చి జ్యోతికను తీసుకెళ్లారు. అయితే త‌న‌పై ఫిర్యాదు చేసింద‌నే కోప‌మో ఏమో తెలియ‌దు కాని సోమ‌వారం ఎనిమిది మంది స‌భ్యుల‌తో షూటింగ్ ప్రాంతానికి వ‌చ్చి రాగ‌మాధురితో దుర్భాష‌లాడింది. నానా హంగామా చేసింది. రాగ‌మాధురిపై దాడి కూడా చేసింది. సెట్‌లో వారు ఆపే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికి వారు రాగమాధురిపై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. దీంతో రాగమాధురి బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో జ్యోతిక‌తో పాటు ఆ ఎనిమిది మందిపై ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

5320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles