పద్మావతిపై గుజరాత్ నిషేధం

Wed,November 22, 2017 05:25 PM
Gujarat bans release of Padmavathi

గాంధీనగర్: సంజయ్ లీలా భన్సాలీ మూవీ పద్మావతిని మరో బీజేపీ పాలిత రాష్ట్రం నిషేధించింది. వచ్చే నెలలో ఎన్నికలకు వెళ్తున్న గుజరాత్ ఈ మూవీని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ర్టాలే అయిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ పద్మావతిని నిషేధించిన విషయం తెలిసిందే. ఇవాళ సినిమాపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ స్పందించారు. రాజ్‌పుత్‌ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్న ఈ సినిమాను గుజరాత్‌లో విడుదల కానివ్వం. చరిత్రను నాశనం చేసే ఈ ప్రయత్నాన్ని మేం అడ్డుకుంటాం. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తాం కానీ ఇలా ఘనమైన చరిత్రను తప్పుగా చూపిస్తే మాత్రం సహించం అని రూపానీ స్పష్టంచేశారు.


రూ.190 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన పద్మావతిలో రాణి పద్మిణిని కించపరిచేలా అల్లావుద్దీన్ ఖిల్జీతో ప్రేమాయణం జరిపినట్లు చూపించారంటూ రాజ్‌పుత్ కర్ణిసేన ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు సినిమాను నిషేధించగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమా విడుదలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కేంద్రానికి లేఖ రాసింది. భన్సాలీ తలకు వెల కట్టేవాళ్లు చేసేది తప్పయితే.. భన్సాలీ చేసింది తప్పే అంటూ నిన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ వివాదాల మధ్య డిసెంబర్ 1న విడుదల కావాల్సిన పద్మావతి వాయిదా పడింది. ఇక వచ్చే ఏడాదే సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు సీబీఎఫ్‌సీ కూడా ఇప్పటికీ ఇంకా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.

1632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS