'జార్జిరెడ్డి' రివ్యూ

Fri,November 22, 2019 01:16 PM

రివ్యూ: జార్జిరెడ్డి
తారాగణం: సందీప్‌మాధవ్ (సాండీ), సత్యదేవ్, ముస్కాన్, దేవిక, చైతన్యకృష్ణ, మనోజ్‌నందన్, శత్రు తదితరులు
సినిమాటోగ్రఫీ: సుధాకర్‌రెడ్డి యెక్కంటి
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్: ప్రతాప్‌కుమార్
ఆర్ట్: గాంధీ నడికుడికార్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాణ సంస్థలు: మైక్ మూవీస్, సిల్లీమంక్స్, త్రీలైన్స్ సినిమా
నిర్మాతలు: అప్పిరెడ్డి, దామోదర్‌రెడ్డి, సంజయ్‌రెడ్డి
రచన-దర్శకత్వం: జీవన్‌రెడ్డి


60వ దశాబ్దంలోని ప్రపంచ విప్లవోద్యమాలు నాటి యువతరాన్ని ఉర్రూతలూగించాయి. వామపక్ష భావజాలంతో ప్రభావితమైన అనేక మంది విద్యార్థులు వ్యవస్థను ధిక్కరిస్తూ ఆధిపత్య భావజాలంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఆ పరంపర నుంచి ఉద్భవించినవాడే జార్జిరెడ్డి. జీనాహైతో మర్‌నా సీఖో, కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీఖో..అంటూ జార్జిరెడ్డి ఇచ్చిన నినాదంతో 60ల నాటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం మార్మోగిపోయింది. చైతన్యానికి, ధిక్కారస్వరానికి, ఆశ్రితపక్షపాతానికి ప్రతీకగా జార్జిరెడ్డిని అభివర్ణించేవారు. కేవలం 25ఏళ్ల స్వల్ప జీవితాన్ని గడిపిన జార్జిరెడ్డి విద్యార్థి ఉద్యమాల చరిత్రలో చెరగని ముద్రవేశారు. అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. సాంఘిక అసమానతలపై, ఫ్యూడల్ సిద్ధాంతాలపై ఎక్కుపెట్టిన అస్త్రం జార్జిరెడ్డి స్ఫూర్తిదాయక కథతో జార్జిరెడ్డి చిత్రాన్ని రూపొందించారు. నిర్మాణం నుంచే ఈ చిత్రం ప్రేక్షకుల్లో..ముఖ్యంగా నాటి విద్యార్థి ఉద్యమాలపై అవగాహన ఉన్నవారిలో ఎనలేని ఉత్సుకతను కలిగించింది. దళం చిత్రంతో పేరుతెచ్చుకున్న జీవన్‌రెడ్డి ఈ సినిమాకు నిర్ధేశక బాధ్యతల్ని నిర్వర్తించారు. ట్రైలర్‌తోనే సంచలనం సృష్టించిన జార్జిరెడ్డి ప్రేక్షకుల అంచనాల్ని ఏ మేరకు అందుకున్నాడు? జార్జిరెడ్డి జీవితాన్ని వెండితెరపై ఏస్థాయిలో పునఃప్రతిష్ట చేయగలిగారో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే...

జార్జిరెడ్డి ప్రయాణం...

కేరళలోని పాల్ఘట్‌లో జన్మిస్తాడు జార్జిరెడ్డి (సందీప్‌మాధవ్). చిన్నతనం నుంచే అన్యాయాన్ని సహించని తత్వాన్ని అలవర్చుకుంటాడు. తల్లి (దేవిక) సంరక్షణలో కేరళ సంప్రదాయ యుద్ధవిద్యల్లో తర్ఫీదు పొందుతాడు. ఆయన తల్లి జీవనాధారాన్ని వెతుక్కుంటూ హైదరాబాద్‌కు చేరుకుంటుంది. అప్పటికి జార్జిరెడ్డి వయసు పదిహేనేళ్లు. హైదరాబాద్‌లోనే కాలేజీ విద్యను పూర్తిచేసిన అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ అభ్యసిస్తూ విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటుంటాడు. కాలేజీలో జరిగే అన్యాయాల్ని ప్రశ్నిస్తూ ఓ హీరోయిక్ ఇమేజ్‌ను సృష్టించుకుంటాడు. తన సిద్ధాంతాల ఆధారంగా నూతన విద్యార్థి సంఘాన్ని నెలకొల్పుతాడు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకు తన భావజాలాన్ని విస్తరించే ప్రయత్నాలు చేస్తుంటాడు. విరుద్ధ సిద్ధాంతాలు ఉన్న ప్రత్యర్థి వర్గంతో జార్జిరెడ్డి పోరు యూనివర్సిటీ క్యాంపస్‌లో అలజడిని రాజేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతీప శక్తులకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి చేసిన పోరాటమేమిటి? ఓ అమ్మాయితో జార్జిరెడ్డి ప్రణయం ఏ తీరాలకు చేరింది? విద్యార్థులను విప్లవ భావాల వైపు నడిపించడానికి జార్జిరెడ్డి ఏం చేశాడు? ముష్కరుల చేతిలో జార్జిరెడ్డి హత్యకు గురవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? అన్నదే జార్జిరెడ్డి చిత్ర ఇతివృత్తం.

జార్జి జీవన విశ్లేషణ...

జార్జిరెడ్డి జీవితంలోకి కీలక ఘట్టాల్ని యథాతథంగా తీసుకొని వాటికి కాస్త నాటకీయత ఆపాదిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యూనివర్సిటీలో జార్జిరెడ్డిని ఓ అమ్మాయి ఆరాధిస్తుంటుంది. అమెరికాలో ఉండే ఆమె మనమరాలు జార్జిరెడ్డిపై డాక్యుమెంటరీ తీసే ప్రయత్నంలో ఇండియాకు రావడం, ఆమె దృష్టికోణం నుంచి కథను ఆరంభించడంతో కథాగమనాన్ని ఓ నాస్టాల్జిక్ జర్నీగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు జీవన్‌రెడ్డి. ఆరంభ సన్నివేశాల్లోనే కేరళలో జార్జిరెడ్డి బాల్యాన్ని, అమ్మతో ఉన్న అనుబంధాన్ని హృద్యంగా దృశ్యమానం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డి అడుగుపెట్టిన తర్వాత కథ, కథనాలు ఊపందుకుంటాయి. అప్పటివరకు అన్యాయాన్ని సహిస్తూ నిస్తేజంగా ఉన్న విద్యార్థుల్లో జార్జిరెడ్డి రాకతో నూతనోత్తేజం వస్తుంది. ప్రథమార్థంలో యూనివర్సిటీ ప్రాంగణంలో జార్జిరెడ్డి తనదైన బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం, అన్యాయాలపై ధిక్కార స్వరం వినిపించడం..ఈ నేపథ్యంలో చోటుచేసుకునే సంఘటనలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. విద్యార్థి సంఘ ఎన్నికల్లో జార్జిరెడ్డి గెలుపొందడం, విశ్రాంతికి ముందు ఆర్ట్స్ కాలేజీ నుంచి జార్జిరెడ్డి అందించిన సందేశం రొమాంచితంగా అనిపిస్తాయి. విద్యార్థి నాయకుడిగా జార్జిరెడ్డి ప్రస్థానాన్ని ఫస్ట్‌హాఫ్‌లో అర్థవంతంగా ఆవిష్కరించారు. క్యాంపస్‌లోని గుండాయిజాన్ని అడుగడుగునా అడ్డుక్కుంటూ జార్జిరెడ్డి చేసే పోరాటం ఉత్కంఠగా సాగింది.

ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడలిస్ట్ అయిన జార్జిరెడ్డి గొప్ప ఉద్యోగాన్ని చేసే అవకాశాన్ని వదులుకొని క్యాంపస్ రాజకీయాలవైపే మొగ్గుచూపడం, విద్యార్థుల పక్షాన పోరాటానికి సిద్ధపడటం స్ఫూర్తివంతంగా అనిపిస్తాయి. ద్వితీయార్థంలో ప్రత్యర్థివర్గంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ జార్జి చేసే పోరాటం ఆసక్తిని పంచుతుంది. పతాకఘట్టాల్ని భావోద్వేగభరితంగా తీర్చిదిద్దారు. జార్జిరెడ్డిని హత్య చేసే ఘట్టం కన్నీళ్లను తెప్పిస్తుంది. ఓ యోధుడి నిష్క్రమణ విద్యార్థులో ఎంతటి ఉద్వేగాల్ని నింపిందో అనే అంశాల్ని హార్ట్‌టచింగ్‌గా ఆవిష్కరించారు. అయితే ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాల్ని సాగతీశారనే భావన కలిగింది. నేటి తరానికి జార్జిరెడ్డి పోరాట స్ఫూర్తిని తెలియజేసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఎలాంటి అతిశయాలకు తావులేకుండా చిత్రాన్ని అత్యంత సహజంగా, నిజాయితీగా రూపొందించారనే భావన కలుగుతుంది.

నటీనటుల పనితీరు...

జార్జిరెడ్డి పాత్రలో సందీప్‌మాధవ్ చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు. సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్ కనబరిచాడు. ముఖ్యంగా పోరాట ఘట్టాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఆయన కెరీర్‌ను మలుపుతిప్పే పాత్రగా చెప్పవచ్చు. జార్జిరెడ్డిని అభిమానించే అమ్మాయిగా ముస్కాన్ చక్కటి అందం, అభినయంతో మెప్పించింది. సత్యదేవ్ కీలక పాత్రలో మెప్పించాడు. తనదైన సహజ అభినయంతో ఆకట్టుకున్నాడు. చైతన్యకృష్ణ, మనోజ్‌నందం తమ పాత్రల మేరకు చక్కటి పర్‌ఫార్మెన్స్ కనబరిచారు. జార్జిరెడ్డి తల్లి పాత్రలో దేవిక నటన బాగుంది. చాలా పాత్రల్లో కొత్తవారిని తీసుకున్నారు. తమ పాత్రల మేరకు వారందరూ మంచి నటనను కనబరిచారు.

దర్శకుడు జీవన్‌రెడ్డి చక్కటి పరిశోధనతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. జార్జిరెడ్డి జీవనయానంలోని భిన్న పార్శాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. సంభాషణలు స్ఫూర్తివంతంగా అనిపిస్తాయి. సురేష్‌బొబ్బిలి సంగీతం, హర్షవర్థన్ రామేశ్వర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధానాకర్షణగా నిలిచాయి. కళాదర్శకత్వం బాగుంది. 60 దశాబ్దం నాటి కాలమాన పరిస్థితుల్ని ఆవిష్కరిస్తూ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సెట్స్‌కు రూపకల్పన చేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కథ డిమాండ్ మేరకు నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడలేదు. సుధాకర్‌రెడ్డి ఛాయాగ్రహణం అద్భుతంగా అనిపిస్తుంది.

తీర్పు..

ఎక్కడో కేరళలో పుట్టిన ఓ యువకుడు జీవితాన్ని వెతుక్కుంటూ హైదరాబాద్‌కు చేరి..అక్కడ కేవలం పదేళ్లు జీవితాన్ని గడిపి యువతరానికి ఆరాధ్యుడిగా నిలవడం ఓ మహోజ్వల ఘట్టం. 60వ దశకం తెలుగునాట విద్యార్థి రాజకీయాల్లో ప్రబలశక్తిగా ఆవిర్భవించి, ప్రగతిశీల భావాలతో లక్షల మందిలో చైతన్యాన్ని రగిల్చిన జార్జిరెడ్డి జీవితానికి వెండితెర నివాళిగా జార్జిరెడ్డి చిత్రాన్ని అభివర్ణించవొచ్చు..

రేటింగ్: 3.25/5

3618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles