గీత గోవిందం రివ్యూ...

Wed,August 15, 2018 02:51 PM
Geetha Govindam movie review

అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమాను ఎంచుకుంటాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. మళ్లీ అర్జున్ రెడ్డి జానర్‌లోనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ వైపు వెళతాడని అందరూ అంచనా వేశారు. అయితే విజయ్ మాత్రం ఈ సారి సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించిన పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం పేరుతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ దేవరకొండకు అర్జున్‌రెడ్డితో వచ్చిన స్టార్‌డమ్ వలన ఈ చిత్రంపై అంచనాలు చాలా పెరిగాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీత గోవిందం ప్రేక్షకులకు అంచనాలను చేరుకుందా? లేదా తెలియాలంటే సమీక్షలోకి వెళదాం.


విజయ్ గోవిందం (విజయ్ దేవరకొండ) అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటాడు. కాబోయే భార్య గురించి తనకంటూ కొన్ని కలలు వుంటాయి. తన కలలో కనిపించిన అమ్మాయి గీత (రష్మిక మంథాన) గుడిలో ఎదురవుతుంది. తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడిపోయిన గోవింద్ అనుకోకుండా ఒకసారి ఆమెతో కలిసి బస్సులో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు జరిగిన ఓ సంఘటన ఇద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీస్తుంది. విజయ్ క్యారెక్టర్‌ను తప్పుగా అర్థం చేసుకున్న గీత ఏం చేసింది? వారిద్దరి ప్రేమ ఎలా ఫలించింది? విజయ్ గీతను ఎలా కన్వీన్స్ చేశాడు? వాళ్లిద్దరూ ఎలా ఒక్కటయ్యారు అనేది మిగతా కథ.

కథగా చెప్పుకుంటే చాలా సింపుల్‌గా అనిపించే ఈ పాయింట్‌ను దర్శకుడు పూర్తి వినోదాత్మకంగా.. భావోద్వేగాల సమహారంతో అందంగా మలిచాడు. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా పరశురామ్ స్క్రీన్‌ప్లేను రూపొందించాడు. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. తొలిభాగంలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో, రెండోహాఫ్‌ను ఎమోషన్స్‌తో చక్కగా తెరకెక్కించాడు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా వున్నాయి.

ఈ చిత్రం ప్రొమోస్‌లో నేను మారిపోయాను.. ఐయామ్ కంప్లీట్ డీసెంట్ నౌవ్ అని విజయ్ చెప్పే డైలాగ్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రంలో పాత్ర పరంగా చాలా కొత్త విజయ్‌ను చూస్తారు. అమ్మాయిలంటే గౌరవం వున్న వ్యక్తిగా, భార్య అంటే మంచి అభిప్రాయం వున్న గోవింద్‌గా ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా విజయ్ డైలాగ్ డెలీవరి, అభినయంతో అలరించాడు. గోవింద్ పాత్రలో లీనమై నటించాడు. ఈ చిత్రంతో విజయ్ ఫ్యామిలీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాందించుకుంటాడు. నటన పరంగా కూడా ఆయనకు మంచి పేరును తీసుకొస్తుంది. ఛలో తర్వాత రష్మిక మరోసారి ఈ చిత్రంతో ఆకట్టుకుంది. విజయ్‌తో పోటా పోటీగా నటించింది. తన క్యూట్ డైలాగ్‌లతో, ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది. రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ పాత్రలు కావాల్సినంత వినోదాన్ని అందించాయి. హీరో తండ్రిగా నాగబాబు, హీరోయిన్ అన్నగా సుబ్బరాజులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు పరశురామ్ చక్కని పాయింట్‌తో సినిమాను ఎలాంటి తడబాటు లేకుండా నడిపించాడు. తన కథకు తగ్గ హీరో నటిస్తే ఎలాంటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ తీయగలనో పరశురామ్ ఈ చిత్రంతో నిరూపించుకున్నాడు. సంగీతం, అందమైన ఫోటోగ్రఫీ, వీనులవిందైన సంగీతం ఈ చిత్రానికి వున్న అదనపు ఆకర్షణలు. నిత్యామీనన్, అనూ ఇమ్మాన్యూయల్ అతిథి పాత్రలు చిత్రానికి మరింత కలర్‌ఫుల్ చేశాయి. కథకు తగ్గ నటీనటులతో పాటు ప్రతిభ గల సాంకేతిక నిపుణులు కలిసి పనిచేస్తే ఎలాంటి అవుట్‌పుట్ వస్తుందో గీత గోవిందం మరో ఉదాహరణ. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా ఆకట్టుకుంటుంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో కమర్షియల్ బ్లాక్‌బస్టర్ గీత గోవిందం.తొలిసారిగా పరశురామ్‌గా కూడా తన కెరీర్‌లో కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటికే మంచి ప్రారంభ వసూళ్లు లభించిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ల జాబితాలో చేరుతుంది.

రేటింగ్: 3.25/5

7393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles