గ్యాంగ్ రివ్యూ

Fri,January 12, 2018 04:10 PM
gang movie review

నటీనటులు: సూర్య, కీర్తిసురేష్, రమ్యకృష్ణ, కార్తీక్, సెంథిల్, ఆర్.జే.బాలాజీ, తంబిరామయ్య తదితరులు
సంగీతం: అనిరుధ్
సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్
ఎడిటింగ్: శ్రీకరప్రసాద్
నిర్మాణం: యు.వి.క్రియేషన్స్
దర్శకుడు: విఘ్నేష్ శివన్

నవ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ పాత్రలపరంగా ప్రతి సినిమాలో వైవిధ్యాన్ని ప్రదర్శించాలని తపిస్తుంటాడు సూర్య. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాలంటే దక్షిణాది ప్రేక్షకులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తారు. గత కొన్నేళ్లుగా తమిళంతో సమాంతరంగా తెలుగులో కూడా మార్కెట్‌ను సృష్టించుకున్నారాయన. గత ఏడాది ఆయన నటించిన సింగం-3 ఆశించిన మేరకు విజయం సాధించలేదు. దాంతో నూతన సంవత్సరంలో సూర్య తొలి చిత్రం గ్యాంగ్ కోసం ప్రేక్షకులు ఉత్సుకతతో ఎదురుచూశారు. తమిళంలో తానా సెర్న్‌ద కోట్టమ్ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో గ్యాంగ్ పేరుతో ఏకకాలంలో విడుదల చేశారు. విఘ్నేష్ శివన్ దర్శకుడు. హిందీలో విజయవంతమైన స్పెషల్ 26 చిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పరిశోధనాత్మక యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథ వివరాల్లోకి వెళ్లాల్సిందే..

కథా సంగ్రహణం
1980 దశకం నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. నువ్వు ఏం చేసినా సరే అది సమాజానికి ఉపయోగపడితే చాలు. అందులో మంచిచెడుల విచక్షణలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు.. కమల్‌హాసన్ నటించిన నాయకుడు చిత్రంలో ఈ డైలాగ్ అంటే తిలక్ (సూర్య)కు చాలా ఇష్టం. అతని తండ్రి సీబీఐ ఆఫీసులో క్లర్క్‌గా పనిచేస్తుంటాడు. తన కొడుకుని సీబీఐ అధికారిగా చూడాలన్నది అతని ఆశయం. తిలక్ లక్ష్యం కూడా అదే. ఇదిలావుండగా సీబీఐ ఆఫీసులో ఉద్యేగం కోసం వెళ్లిన తిలక్‌కు ఇంటర్వ్యూలో అవమానాలు ఎదురవుతాయి. ఉద్యోగం రావాలంటే తప్పకుండా లంచం ఇవ్వాల్సిందే అని చెబుతారు. తనలాంటి నిజాయితీ వున్న వ్యక్తులు సీబీఐ డిపార్ట్‌మెంట్‌కు పనికిరారని అవహేళన చేస్తారు. ఇదే సమయంలో ఉద్యోగం కోసం లంచం ఇచ్చుకోలేక తిలక్ మిత్రుడొకరు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ పరిణామాలన్నింటితో చలించి పోయిన తిలక్ నకిలీ సీబీఐ అధికారిగా అవతారమెత్తుతాడు. బుజ్జమ్మ అలియాస్ ఝాన్సీలక్ష్మీభాయి (రమ్యకృష్ణ)తో పాటు మరో నలుగురితో కలిసి నకిలీ గ్యాంగ్‌ను తయారుచేస్తాడు. సీబీఐ దాడుల పేరిట అత్యంత చాకచక్యంగా డబ్బులు, నగదు దోచుకుంటుంటారు. ఈ నకిలీ బృందం ఆటకట్టించే బాధ్యతను నిజాయితీ సీబీఐ అధికారి అయిన శివశంకర్ (కార్తీక్)కు అప్పగిస్తారు. ఆయన నేతృత్వంలోని సీబీఐ అధికారులు ఈ నకిలీ గ్యాంగ్‌ను పట్టుకున్నారా? ఈ క్రమంలో చోటుచేసుకునే ఆసక్తికరమైన పరిణామాలేమిటి? అసలు గ్యాంగ్ లక్ష్యం ఏమిటి? అనే విషయాలన్నింటికి సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
హిందీ మాతృక స్పెషల్ 26లో తమిళ నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హీరో సూర్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథలో వాణిజ్య విలువల్ని జోడించారు. మాతృక ఆసాంతం సీరియస్‌గా సాగితే గ్యాంగ్‌లో వినోదానికి పెద్దపీట వేశారు. సమాజంలోని అవినీతి, లంచగొండితనంపై విసిగిపోయి తిరుగుబాటు తత్వాన్ని అలవరుచుకున్న యువకుడిగా సూర్య చక్కటి నటనను కనబరిచారు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. ఝాన్సీలక్ష్మీబాయిగా రమ్యకృష్ణ తనదైన అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఆమె స్థాయి నటి ఈ పాత్ర చేయకుండా ఉండాల్సిందనే భావన కలుగుతుంది. ప్రథమార్థమంతా వినోదమే ప్రధానంగా సోదాల పేరుతో గ్యాంగ్ వేసే ఎత్తుకుపై ఎత్తులతో కథనం సాగుతుంది. ద్వితీయార్థంలో గ్యాంగ్‌ను పట్టుకునేందుకు సీబీఐ అధికారులు సాగించే ప్రయత్నాలు..ఈ క్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు వేసే ఎత్తులు ప్రధానంగా వుంటాయి. ఈ సినిమాలో కథానాయిక కీర్తి సురేష్‌కు అంతగా ప్రాధాన్యత లేదు. కొన్ని సన్నివేశాలు, పాటలకే పరిమితమై పోయింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సీనియర్ నటుడు కార్తీక్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించాడు. వ్యంగ్యంతో పాటు సీరియస్‌నెస్‌తో కూడిన పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. మిగతా నటీనటులందరూ తమ పరిధుల మేరకు నటించారు. సంగీతపరంగా మాస్ బీట్‌తో వచ్చే సూర్య ఉపోద్ఘాత గీతం ఆకట్టుకుంటుంది. మిగతా పాటలు ఫర్వాలేదనిపించాయి. దినేష్ ఛాయాగ్రహణం ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా ఆవిష్కరించింది. తన ప్రమాణాలకు తగినట్లుగా శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాడు. సాంకేతికంగా అన్ని విభాగాల్లో ఈ చిత్రం బాగా కుదిరింది. ముఖ్యంగా 1980 దశకం నాటి రెట్రోలుక్‌ను తెరపై సహజంగా ఆవిష్కరించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యారు. ఇక ఈ సినిమాలో సూర్య తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఎలాంటి ఉచ్ఛారణ దోషాలు లేకుండా చక్కటి తెలుగు సంభాషణల్ని పలికించారు.

కథావలోకనం..
ఈ సినిమాకు మాతృక అయిన స్పెషల్ 26 స్క్రిప్ట్‌లో అనేక మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దక్షిణాది ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వాణిజ్య అంశాలు, కామెడీని జోడించారు. గ్యాంగ్ చేసే విన్యాసాలతో ప్రథమార్థమంతా సరదాగ సాగుతుంది. అయితే ద్వితీయార్థంలో కథాగమనం కొంత పట్టుతప్పి నట్టు కనబడుతుంది. సీబీఐ అధికారుల్ని బురిడీ కొట్టిస్తూ గ్యాంగ్ చేసే ప్రయత్నాలు వాస్తవానికి దూరంగా డ్రామాటిక్‌గా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే చిన్న చిన్న లాజిక్‌లు కూడా దర్శకుడు మిస్ అయ్యాడమే అనిపిస్తుంది. అవినీతి, లంచగొండితనంపై కథానాయకుడు చేసే వాదన నిజమే అనిపించినా...దానికి వ్యతిరేకంగా నకిలీ సీబీఐ అధికారిగా మారాలనుకోవడం సమంజసంగా అనిపించదు. ముఖ్యంగా సూర్య అంటే ప్రేక్షకులు రొమాంచితమైన పోరాట ఘట్టాల్ని ఆశిస్తారు. ఈ సినిమాలో యాక్షన్ కొరవడిందని చెప్పొచ్చు. క్లెమాక్స్ ఘట్టాల్లో వచ్చే సన్నివేశాలు కొన్ని ఆలోచించజేసేలా వున్నాయి. సూర్య, రమ్యకృష్ణ, కార్తీక్ పాత్రలు గుర్తుండిపోతాయి. ఇంట్రస్టింగ్ స్క్రీన్‌ప్లే, కథా ఆవిష్కరణలోని మలుపులు ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచేలా వున్నాయి. మొత్తంగా చూస్తే గ్యాంగ్ సమ్‌థింగ్ స్పెషల్ చిత్రమేమీ కాదు. కాకపోతే సంక్రాంతి రేసులో గ్యాంగ్ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా అలరించే అవకాశం వుంది.

రేటింగ్: 2.75/5

4652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles