రివ్యూ: గేమ్ ఓవర్

Fri,June 14, 2019 01:09 PM
Game Over Review

తారాగణం: తాప్సీ, వినోదిని వైద్యనాథన్, సంచన నటరాజన్, అనీష్ కురువిళ్ల తదితరులు..
సినిమాటోగ్రఫీ: ఎ.వసంత్
సంగీతం: రోస్ ఏతాన్ యోహాన్
రచన: అశ్విన్ శరవణన్, కావ్య రాంకుమార్
నిర్మాతలు: ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
నిర్మాణ సంస్థ: వై నాట్ స్టూడియోస్
దర్శకత్వం: అశ్విన్ శరవణన్

కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ నాయికగానే గుర్తింపును సంపాదించుకున్న తాప్సీ ఆ తర్వాత తన పంథాను పూర్తిగా మార్చుకుంది. వరుసగా మహిళా ప్రధాన ఇతివృత్తాల్లో నటిస్తూ ప్రతిభను చాటుకుంటున్నది. పింక్ ముల్క్ వంటి చిత్రాల్లో తాప్సీ అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల మీదే దృష్టిపెడుతున్న తాప్సీ తాజాగా గేమ్ ఓవర్ చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చింది. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించారు. మాయ చిత్రంతో తమిళనాట టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న అశ్విన్ శరవణన్ రెండో ప్రయత్నంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో హారర్ థ్రిల్లర్ చిత్రాల నిర్మాణం ఎక్కువైంది. ఈ పరంపరలో వచ్చిన గేమ్ ఓవర్ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది? కథాపరంగా ఇందులోని కొత్తదనమేమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే చిత్ర సమీక్షలోకి వెళ్లాల్సిందే..

స్వప్న (తాప్సీ) వీడియో గేమ్ ప్రొఫెషనల్. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ దుస్సంఘటనతో చీకటి అంటే భయపడిపోతుంటుంది. వెలుతురులేని గదిలో అస్సలు ఉండలేదు. ఓ సైకో థెరపిస్ట్ (అనీష్ కురువిళ్ల)ను సంప్రదించగా...స్వప్న యానివర్సరీ రియాక్షన్ అనే మానసిక రుగ్మతతో భాదపడుతుందని చెబుతాడు. గతంలో జరిగిన భయానక సంఘటనలు మరో సంవత్సరంలోని అదే నెలలో లేదా అదే రోజులో పునరావృతం అవుతాయని ఆందోళన చెందడమే యానివర్సరీ రియాక్షన్ అని సైకోథెరపిస్ట్ వివరిస్తాడు. ఇదిలావుండగా స్వప్న తన పనిమనిషి కళమ్మ (వినోదిని వైధ్యనాథన్)తో కలిసి నగర శివారులోని ఓ ఇంట్లో నివాసం ఉంటుంది. చేతిపై సంవత్సరం క్రితం వేయించుకున్న టాటూ (పచ్చబొట్టు) వల్ల స్వప్నకు ఇబ్బందులు తలెత్తుతాయి. టాటూ వేయించుకున్న ప్రదేశం ఒక్కోసారి మంటగా అనిపిస్తుండటంతో కారణాలు తెలుసుకుందామని టాటూ స్టూడియోను సంప్రదిస్తుంది. అక్కడ ఆమెకు టాటూ తాలూకు ఓ భయంకర నిజం తెలుస్తుంది? అదేమిటి? అంతకుముందే నగరంలో సైకోకిల్లర్స్‌చే హత్య చేయబడ్డ అమృతతో (సంచన నటరాజన్) స్వప్నకు ఉన్న సంబంధం ఏమిటి? సైకోకిల్లర్ స్వప్నను ఎందుకు చంపాలనుకుంటారు? ఈ చిక్కుముడులన్నింటికి సమాధానమే మిగతా చిత్ర కథ..

హారర్ థ్రిల్లర్ చిత్రాలకు కథకంటే దానిని ఉత్కంఠగా నడిపించే కథనం చాలా ముఖ్యం. ఓ చిన్న పాయింట్ చుట్టూ ఆద్యంత సస్సెన్స్‌ను క్రియేట్ చేయడమే థ్రిల్లర్ చిత్రాల్లోని మ్యాజిక్‌గా చెబుతారు. ఈ విషయంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ సఫలీకృతుడయ్యాడు. అమృత అనే యువతిని హత్య చేసి ఆమెను నరికి తగులబెట్టే సన్నివేశంతో భీతికలిగించేలా కథను ఆరంభించాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న స్వప్న మానసిక సమస్యలతో బాధపడటం, ఆమెను పనిమనిషి కళమ్మ అనునయించే సన్నివేశాలతో ప్రథమార్థంలో సస్సెన్స్‌తో పాటు డ్రామాను పండించాడు. తన చేతిపై వేసింది మెమోరబుల్ టాటూ అని స్వప్న తెలుసుకోవడంతో కథాగమనం కీలక మలుపు తిరుగుతుంది.

ఇక ద్వితీయార్థాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారు. అమృత గురించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో సెంటిమెంట్ పండింది. సెకండాఫ్‌లో స్వప్న కలకు సంబంధించిన రెండు ఎపిసోడ్‌లు చూపించడంతో ఏది నిజమో కలో తెలుసుకోలేక ప్రేక్షకులు కన్‌ఫ్యూజన్‌కు గురవుతారు. ైక్లెమాక్స్ ఘట్టాలు కావాల్సినంత ఉత్కంఠను పంచాయి. వీడియోగేమ్ తరహాలోనే ఒక్కో దశలో క్రొత్త ట్విస్ట్‌లను చూపిస్తూ సినిమాను స్క్రీన్‌ప్లే ప్రధానంగా నడిపించారు. కథలోని ప్రధాన భాగం మొత్తాన్ని కేవలం రెండు పాత్రల మధ్య నడిపించడం దర్శకుడిలోని నేర్పుకు అద్దంపడుతుంది.

అయితే ఈ కథలో థ్రిల్లింగ్ అంశాలతో పాటు చిక్కుముడి వీడని అనే అంశాలు కనిపిస్తాయి. స్వప్న గత జీవితంలో ఏం జరిగిందనే దానిపై దర్శకుడు స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో సైకోకిల్లర్స్ స్వప్నను ఎందుకు టార్గెట్ చేశారని అంశంలో కూడా క్లారిటీ కొరవడింది. సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలతో సినిమా అసంపూర్ణంగా ముగిసిందనే భావన కలుగుతుంది. అయితే హారర్ అంశాలతో పాటు పారానార్మల్ యాక్టివిటీస్‌తో కథను ఆసక్తికరంగా నడిపించారు. వినోదం, పాటలు వంటి అనవసర అంశాలు లేకుండా పూర్తిస్థాయి థ్రిల్లర్‌గా సినిమాను తీర్చిదిద్దారు.

స్వప్న పాత్రలో తాప్సీ అద్భుతమైన నటనను కనబరచింది. సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై మోసింది. నిస్సహాయురాలైన యువతిగా భిన్న కోణాల్లో తన నటనను ప్రదర్శించింది. భావోద్వేగభరిత సన్నివేశాల్లో తాప్సీ నటన ప్రతి ఒక్కరిని కదిలించేలా అనిపిస్తుంది. పనిమనిషి పాత్రలో నటించిన వినోదిని వైధ్యనాథన్ సహజమైన అభినయంతో మెప్పించింది. వీరిద్దరి పాత్రలే సినిమాకు ఆయువుపట్టులా నిలిచాయి. ఇతర పాత్రల్లో అనీష్ కురువిళ్ల, రమ్య సుబ్రమణ్యం, సంచన నటరాజన్ తమ పరిధుల మేరకు మెప్పించారు. కేవలం రెండే రెండు ప్రధాన పాత్రల చుట్టూ ఇంటెన్స్ థ్రిల్లర్‌ను రూపొందించడం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథకు బలంగా నిలిచాయి. సాంకేతికంగా ప్రతి విభాగంలో ఉన్నతంగా అనిపిస్తుంది. తాప్సీ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే చిత్రంగా గేమ్ ఓవర్ నిలిచిపోతుంది.
హారర్ థ్రిల్లర్ చిత్రాల వరుసలో గేమ్ ఓవర్ కొత్త ప్రయత్నమని చెప్పుకోవచ్చు. అయితే థ్రిల్లర్ చిత్రాల ఫలితాన్ని అంత సులభంగా అంచనా వేయలేము. తాప్సీ వంటి అగ్రతార ప్రధానబలంగా ఉండటంతో వాణిజ్యపరంగా కూడా ఈ సినిమాకు విజయావకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
రేటింగ్: 3/5

2755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles