రివ్యూ: ఫలక్‌నుమా దాస్

Fri,May 31, 2019 01:28 PM
Falaknuma Das Movie Review

నటీనటులు: విశ్వక్‌సేన్, సలోనిమిశ్రా, హర్షితాగౌర్, ఉత్తేజ్, తరుణ్‌భాస్కర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్
సంగీతం: వివేక్‌సాగర్
నిర్మాత: కరాటే రాజు
నిర్మాణ సంస్థ: వాన్మయే క్రియేషన్స్, విశ్వక్‌సేన్ సినిమా
దర్శకత్వం: విశ్వక్‌సేన్

కాల్పనిక కథలకంటే ఓ ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి, జీవనవిధానాల్ని నేపథ్యంగా తీసుకొని..వాస్తవికతను ఆవిష్కరిస్తూ సినిమాలు తీయడం కాస్త క్లిష్టమైన అంశమే. ఈ తరహా సినిమాల్లో సహజత్వానికి పెద్దపీట వేస్తూ అక్కడి యాసభాషల విషయంలో ఖచ్చితమైన ప్రామాణికతల్ని పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి లోకల్ ఫ్లేవర్ సినిమాలు తమిళ, మలయాళ చిత్రసీమలో ఎక్కువగా వస్తుంటాయి. ఇటీవలకాలంలో తెలుగులో కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కోవలో రూపొందించిన చిత్రమే ఫలక్‌నుమా దాస్. మలయాళంలో విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా కూడా మంచి విజయాన్ని దక్కించుకున్న అంగమలై డైరీస్‌కు రీమేక్ ఇది. వెళ్లిపోమాకే ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నూమా నేపథ్యంలో తెరకెక్కించారు. ట్రైలర్ ద్వారానే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది? మలయాళ ఇతివృత్తాన్ని పాతబస్తీ నేపథ్యానికి ఎంతవరకు అన్వయించగలిగారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

ఫలక్‌నూమా బస్తీలో పుట్టిపెరుగుతాడు దాస్ (విశ్వక్‌సేన్). అక్కడి లోకల్ పహిల్వాన్ శంకరన్నను చూసి తాను ఓ డాన్‌లా ఎదగాలని స్కూల్ రోజుల నుంచే కలల కంటుంటాడు. శంకరన్న స్ఫూర్తితో నలుగురు మిత్రుల్ని వెంటవేసుకొని ఓ గ్యాంగ్‌ను తయారుచేస్తాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకోవడంతో పాటు జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంతో బస్తీలో మటన్ అమ్మే వ్యాపారం మొదలుపెడతాడు. ఈ కారణంగా అదే బిజినెస్‌లో ఉండే ప్రత్యర్థులతో దాస్‌కు వైరం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా జరిగిన గ్యాంగ్‌వార్‌లో దాస్ మీద హత్యానేరం మోపబడుతుంది. దాని నుంచి బయటపడడానికి 25లక్షలు అవసరమవుతాయి. అందుకోసం దాస్ ఏం చేశాడు? శత్రువులతో దాస్ ఎలాంటి పోరాటం చేశాడు? చివరకు దాస్ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

మలయాళ చిత్రాన్ని పాతబస్తీ నేపథ్యానికి అన్వయించుకోవడం పెద్ద సవాలు. ఇందులో దర్శకుడు, నటుడు విశ్వక్‌సేన్ కృతకృత్యుడయ్యాడు. ఫలక్‌నూమా బస్తీ జీవనం, అక్కడి యాస, భాషల్ని చక్కగా ఆవిష్కరించాడు. ముఖ్యంగా లోకల్ యూత్ చేసే హంగామా, గొడవలు, ఎంజాయ్‌మెంట్..ఈ అంశాల్ని చాలా సహజంగా తెరపై తీసుకొచ్చాడు. ఓల్డ్‌సిటీ తాలూకూ రానెస్‌ను బ్యూటీఫుల్‌గా ప్రజెంట్ చేశాడు. ప్రథమార్థమంతా దాస్ తన స్నేహితుల కలిసి చేసే సందడి, మటన్ వ్యాపారంలో ప్రత్యర్థులతో చేసే గ్యాంగ్‌వార్ మీద సాగుతుంది. వినోదం కూడా బాగానే పండింది. దాస్ హత్యానేరంలో ఇరుక్కుకోవడంతో ఫస్ట్‌హాఫ్‌ను ముగించారు.

ద్వితీయార్థంలో కథాగమనం అదుపుతప్పింది. ఎంతసేపు దాస్ తన ప్రత్యర్థి బ్యాచ్‌తో చేసే గొడవలు, ఛేజింగ్‌లపై దృష్టిపెట్టారు. దాస్ ప్రేమకథలో కూడా ఎలాంటి భావోద్వేగాలు పండలేదు. ప్రేమికుల మధ్య వచ్చే సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. దాస్ మిత్రబృందం చేసుకునే మందుపార్టీలను పదేపదే చూపించడం సమంజసంగా అనిపించదు. ప్రథమార్థంలోని వినోదం ద్వితీయార్థంలో పూర్తిగా మిస్ అయింది. కథతో ఏమాత్రం సంబంధం లేకుండా అనవసర సన్నివేశాలతో సాగతీశారనే భావన కలుగుతుంది. అయితే ఫలహారం బండ్ల నేపథ్యంలో ైక్లెమాక్స్‌లో చిత్రీకరించిన ఎపిసోడ్ బోనాల రోజుల్లోని పాతబస్తీ వాతావరణాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన యువత ఆ సన్నివేశాలతో బాగా కనెక్ట్ అవుతారు. అయితే ఈ పతాకఘట్టాలు సుదీర్ఘంగా సాగినట్లు అనిపిస్తాయి. ముగింపు కూడా ఊహించినట్లుగానే సాగుతుంది.

పాతబస్తీ తెలంగాణ యాసతో సంభాషణల్లో మంచి చమక్కు కనిపించింది. ముఖ్యంగా దాస్ ప్రాతధారి విశ్వక్‌సేన్, పాండుగా ఉత్తేజ్, ఎస్సై సైదులుగా తరుణ్‌భాస్కర్ పలికించే డైలాగ్స్ చాలా సహజంగా అనిపించాయి. అయితే మిగతా పాత్రల తాలూకు సంభాషణల్లో అక్కడక్కడా ఇతర ప్రాంతాల యాసలు పలకడం అపశృతిగా అనిపిస్తుంది. నేటివిటీ ప్రధానమైన కాన్సెప్ట్ కాబట్టి ప్రతి పాత్ర చెప్పే సంభాషణల మీద మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. కథ, కథనాల్ని అర్థవంతంగా రాసుకుంటే ఫలక్‌నూమా దాస్ ప్రేక్షకుల్ని మెప్పించగలిగేవాడు.

విశ్వక్‌సేన్ తన పాత్రకు న్యాయం చేశాడు. అచ్చమైన పాతబస్తీ యువకుడిగా ఆయన హావభావాలు, సంభాషణలు చెప్పే విధానం ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రల్లో ఉత్తేజ్, తరుణ్‌భాస్కర్ మెప్పించారు. వీరిద్దరి పాత్రలు గుర్తుండిపోతాయి. తరుణ్‌భాస్కర్ నటన హైలైట్‌గా నిలిచింది. కథానాయికలకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కలేదు. ఇక సినిమాటోగ్రఫీ పరంగా పాతబస్తీ బ్యూటీని తెరపై ఆవిష్కరించిన విధానం అబ్బురమనిపిస్తుంది. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. నటుడిగా సక్సెస్ అయిన విశ్వక్‌సేన్ దర్శకుడిగా మాత్రం విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. కథలో వాస్తవికతను చక్కగా తెరపై తీసుకొచ్చినప్పటికీ పాత్రలను బలంగా తీర్చిదిద్దలేకపోవడం పెద్దలోటుగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే పరంగా అనేక లోపాలు కనిపిస్తాయి. స్క్రిప్ట్ విషయంలో శ్రద్ధ పెట్టి ఉంటే మంచి సినిమాగా నిలిచిపోయేది.

మలయాళ మాతృకను అనుసరించి ఫలక్‌నూమా దాస్ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథలోని ఆత్మను పూర్తిగా రీమేక్‌లో ఆవిష్కరించలేకపోయారు. దాంతో ఎక్కడో ఫీల్ మిస్సయిన భావన కలుగుతుంది. బాక్సాఫీస్ రేసులో ఫలక్‌నూమా దాస్ ఏమేరకు విజేతగా నిలుస్తాడో వేచిచూడాల్సిందే..
రేటింగ్: 2/5

3343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles