ఎఫ్-2 ఓన్లీ ఫన్ : ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్ మూవీ రివ్యూ

Sat,January 12, 2019 03:32 PM
F2 Telugu Movie review

సున్నితమైన హాస్యంతో పాటు కుటుంబ అనుబంధాలకు చిరునామాగా నిలుస్తాయి వెంకటేష్ సినిమాలు. తన కామెడీ టైమింగ్‌తో ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారాయన. మంచి కథ దొరికితే ఇమేజ్, స్టార్‌డమ్‌లతో పట్టింపులు లేకుండా నవతరం హీరోలతో కలిసి నటించడానికి సిద్ధంగా ఉంటారాయన. కెరీర్ తొలినాళ్ల నుంచి వినూత్నమైన కథాంశాలకు ఎంచుకుంటూ కథానాయకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు వరుణ్‌తేజ్. వీరిద్దరి కలయికలో రూపొందిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్-2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా కాలం తర్వాత ఆయన కనిపించే ప్రతి సన్నివేశం నవ్విస్తుంది. వినోదభరిత కథాంశంతో వెంకటేష్ చేసిన సినిమా ఇది. కామెడీ జోనర్‌లో వరుణ్‌తేజ్ తొలిసారి నటించారు. వీరిద్దరి కలిసి చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరించిందో చూద్దాం...
వెంకీ (వెంకటేష్) అనాథ. ఓ ఎమ్మెల్యే దగ్గర పీఏగా పనిచేస్తుంటాడు. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడపాలని కలలుకంటాడు.

హారిక(తమన్నా) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. జీవితం పట్ల నిర్ధిష్టమైన అభిప్రాయాలున్న ఆమె అత్త, ఆడపడుచులు పోరులేని అబ్బాయిని పెళ్లాడాలని కోరుకుంటుంది. వెంకీతో హారిక పెళ్లి అవుతుంది. పళ్లైన కొద్దిరోజుల్లోనే వెంకీపై హారిక ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తుంది. భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మనస్తత్వం భరించలేక ప్రతిక్షణం ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంటాడు వెంకీ. హారిక సోదరి హనీ(మెహరీన్) వరుణ్‌యాదవ్(వరుణ్‌తేజ్) ప్రేమించుకుంటారు. వారి పెళ్లి కుదురుతుంది. పెళ్లికి ముందే హనీ భర్తను తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. హారిక, హనీల పెత్తనం భరించలేక వెంకీ, వరుణ్ ఎవరికి చెప్పకుండా యూరప్ పారిపోతారు. కొన్నాళ్లు ఎవరికి కనిపించుకుండా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవ్వడంతో పాటు హారిక, హనీలో మార్పులు వస్తాయని ఆశిస్తారు. కానీ ఆ నిర్ణయమే వారి జీవితాల్లో కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది?అదేమిటి? హారిక, హనీ విలువను వెంకీ, వరుణ్ ఎలా తెలుసుకున్నారు? తమ తప్పులను ఏ విధంగా సరిదిద్దుకున్నారు అన్నదే ఈ చిత్ర కథ.


పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఓ మగాడి జీవితంలో వచ్చే మార్పులను వినోదాత్మకంగా ఆవిష్కరిస్తూ దర్శకుడు అనిల్‌రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. వెంకీ, హారిక పాత్రల ద్వారా ఆ సన్నివేశాల్ని కడుపుబ్బా నవ్వించేలా తీర్చిదిద్దారు. వెంకటేష్ పాత్ర పరిచయంతో పాటు పెళ్లిచూపుల్లో కాబోయే భార్యను సమర్థిస్తూ అతడు చెప్పే సంభాషణలు అలరిస్తాయి. పెళ్లి తర్వాత తన ఊహలకు, వాస్తవికతకు మధ్య నలిగిపోతూ నిరంతరం అతడు ఎదుర్కొనే సంఘర్షణను సీరియస్‌గా కాకుండా పూర్తిగా కామెడీ దారిలోనే నడిపించారు. భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై ఆధిపత్యం చెలాయించడానికి అతడు వేసే ప్రయత్నాల్లో వినోదం బాగా పండింది. వరుణ్‌తేజ్, మెహరీన్ పాత్రలను ప్రవేశపెట్టి కథను కొత్త మలుపుతిప్పారు. తల్లిదండ్రులకు, కాబోయే భార్యకు మధ్య నలిగిపోయే యువకుడిగా వరుణ్‌తేజ్ పాత్ర ఆకట్టుకుంటుంది. ప్రథమార్థం మొత్తం ఈ నాలుగు పాత్రల చుట్టే నడిపించిన దర్శకుడు ఆ సన్నివేశాల నుంచి కావాల్సినంత వినోదాన్ని రాబట్టుకున్నారు.

ద్వితీయార్థంలో ఈ నవ్వుల జోరుకు బ్రేకులు పడ్డాయి. కథను యూరప్ తీసుకెళ్లిన దర్శకుడు అక్కడ ఎలా నడిపించాలో తెలియని అయోమయంలో పడినట్లుగా కనిపిస్తుంది. తమ మధ్య ఉన్న అపార్థాల్ని, అపోహల్ని వీడి వారు ఒక్కటయ్యే సన్నివేశాల్ని వినోదభరితంగానే నడిపించాలనే దర్శకుడి ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. కొత్త పాత్రలను ప్రవేశపెట్టి వారి మధ్య ఓ కన్యూజన్ డ్రామాను సృష్టించి కథను ముందుకు నడిపించడంలో కాస్త తికమకపడ్డారు. హారిక, హనీ ఇతరుల్ని పెళ్లాడటానికి సిద్ధపడటం, ఆ పెళ్లిని ఆపడానికి వెంకీ, వరుణ్ చేసే ప్రయత్నాలు రొటీన్‌గా సాగుతాయి. వాటిలో హాస్యం మోతాదు తగ్గింది. ఒకరిపై మరొకరు వేసే ఎత్తుల్లో ఆసక్తి లోపించింది. వెంకీ, వరుణ్‌లో మార్పుకు కారణమయ్యే సన్నివేశాల్ని బలంగా మరింత ఎమోషనల్‌గా ఆవిష్కరిస్తే బాగుండేది. ఓ అపరిచిత వ్యక్తి వచ్చి నాలుగు మాటలు చెప్పగానే వారు మారిపోయినట్లుగా చూపించారు. అలాగే పతాక ఘట్టాల్ని సీరియస్‌నెస్‌తో పాటు కొంత వినోదం జోడించి చెప్పాలని దర్శకుడు చేసిన ప్రయత్నం సరిగా లేదు. చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే సినిమాలో నవ్వులకు లోటు లేకుండా సినిమాను నడిపించడంలో అనిల్ రావిపూడి చాలా వరకు సక్సెస్ అయ్యారు.


సుదీర్ఘ విరామం తర్వాత పూర్థిస్థాయి వినోదభరిత పాత్రలో వెంకటేష్ నటించిన సినిమా ఇది. తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్‌తో మునుపటి వెంకీని గుర్తుచేశారు. నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి నాటి వెంకటేష్‌ను ఈ సినిమాలో మళ్లీ చూస్తారని ప్రచార వేడుకల్లో ఆయన చెప్పిన మాటలు నిజమేనని అనిపిస్తాయి. ఆయన కనిపించే ప్రతి సన్నివేశం నవ్విస్తుంది. వెంకీ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమాను వెంకీ తన భుజాలపై వేసుకున్నాడు,. తొలి సినిమా నుంచి కథ, పాత్రల పరంగా వైవిధ్యతను కనబరుస్తున్న వరుణ్‌తేజ్ ఈ సినిమాలో బోరబండ వరుణ్‌యాదవ్ అనే తెలంగాణ యువకుడిగా కొత్తగా కనిపించారు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే సంభాషణలు అలరిస్తాయి. మాస్ ప్రేక్షకుల్ని ఆయన పాత్ర మెప్పిస్తుంది. తమన్నా, మెహరీన్ అభినయం కంటే గ్లామర్‌తో ఎక్కువగా ఆకట్టుకున్నారు. మరో కీలక పాత్రలో రాజేంద్రప్రసాద్ నవ్వించారు. అన్నపూర్ణమ్మ, వై.విజయ పాత్రల నుండి దర్శకుడు చక్కటి వినోదాన్ని రాబట్టుకున్నారు. సుబ్బరాజు, పృథ్వీ, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి ఇలా సినిమాలో చాలా మంది హాస్యనటులు ఉన్నా పెద్దగా నవ్వించలేకపోయారు. ప్రకాష్‌రాజ్‌తో చేసిన గుండమ్మకథ స్ఫూఫ్ ఆకట్టుకోలేదు.
తొలి సినిమా నుంచి వినోదాన్ని నమ్ముకొని సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో అదే దారిలో ప్రయాణించారు. ప్రత్యేకంగా సృష్టించిన కామెడీ ట్రాక్‌లపై ఆధారపడకుండా నిజజీవితాల నుంచి స్ఫూర్తి పొంది కథను రాసుకున్న దర్శకుడు కుటుంబ వర్గాలతో పాటు యువతరం కనెక్ట్ సినిమాను రూపొందించారు. మల్టీస్టారర్ సినిమా అయినా ఎలాంటి తడబాటు లేకుండా ఇద్దరు హీరోలకు సమప్రాధాన్యతనిస్తూ వారి పాత్ర ద్వారా కామెడీని రాబట్టుకున్న తీరు బాగుంది.


దేవిశ్రీప్రసాద్ బాణీలు కథకు తగ్గట్లుగా కుదిరాయి. యూరప్ అందాలను కెమెరామెన్ సమీర్‌రెడ్డి చక్కగా చూపించారు. లాజిక్‌లను పక్కనపెట్టి కేవలం కామెడీని మాత్రమే నమ్ముకొని తీసిన సినిమా ఇది. రెండుగంటల ఇరవై ఆరు నిమిషాల పాటు ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి చిత్రబృందం తాపత్రయపడ్డారు. అయితే ప్రథమార్థంలో ఉన్న వినోదం ద్వితీయార్థంలో వర్కవుట్ అయితే సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచేది. ఏది ఏమైనా సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకులకు సంపూర్ణంగా వినోదాన్ని పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టికెట్ సరిపడా వినోదం ఎఫ్2 అందిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు..!

ఫైనల్‌గా చెప్పాలంటే: అనిల్ రావిపూడి వెర్షన్‌లో చెప్పాలంటే పెళ్లికి ముందు మగాడి జీవితంలా ఫుల్ ఫన్‌తో ఫస్ట్‌హాఫ్ పూర్తి వినోదంగా వుంటే... పెళ్లి తర్వాత మగాడి జీవితంలా కాస్త నెమ్మదిగా..డల్‌గా సెకండాఫ్ వుంటుంది. ఏది ఏమైనా కాస్త అపార్థాలను పెద్ద మనసుతో అర్థం చేసుకుంటే ఆదర్శ దాంపత్యంలా ఓవరల్‌గా సినిమా నవ్వుల ప్రయాణంలా అనిపిస్తుంది.

ఈ పండగ సినిమా ఇదేగా.. అంతేగా.. అంతేగా..
-రేటింగ్ 3/58382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles