ఇగో సినిమా రివ్యూ

Fri,January 19, 2018 04:58 PM
Ego movie review

నటీనటులు: ఆశిష్‌రాజ్, సిమ్రాన్, రావురమేష్, అజయ్ తదితరులు
నిర్మాతలు: విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్
దర్శకుడు: ఆర్.వి.సుబ్రహ్మణ్యం
సంగీతం: సాయికార్తీక్

గత ఏడాది తెలుగులో రూపొందిన పలు చిన్న సినిమాలు పెద్ద చిత్రాలకు ధీటుగా వసూళ్లను సాధించడమే కాకుండా కమర్షియల్‌గా మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. తక్కువ బడ్జెట్‌తో సినిమాల్ని రూపొందించే దర్శకనిర్మాతల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. నవ్యమైన కథాంశాలతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించే వెసులుబాటు ఉండటంతో ప్రేక్షకులు ఈ చిన్న సినిమాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఆశిష్‌రాజ్ కథానాయకుడిగా వీకేఏ ఫిలిమ్స్ సంస్థ తెరకెక్కించిన ఇగో చిత్రం ఆ జాబితాలో నిలిచిందా? ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుందా?లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...

గోపి(ఆశిష్‌రాజ్) అమలాపురం కుర్రాడు. వంశపారంపర్యంగా పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులతో అహం అతడికి సంక్రమిస్తుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తూ సరదాగా జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. అదే ఊరిలో ఉండే ఇందు(సిమ్రాన్)తో గోపికి శత్రుత్వం ఉంటుంది. ఇద్దరు ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. గోపిపై ఉన్న ద్వేషంతో తనకు ఇష్టంలేకపోయినా మరొకరిని పెళ్లిచేసుకోవడానికి సిద్ధపడుతుంది ఇందు. మరోవైపు ఇందు కంటే ముందుగానే అందమైన అమ్మాయిని పెళ్లిచేసుకుంటానని స్నేహితులతో ఛాలెంజ్ చేసి గోపి హైదరాబాద్ వెళ్లిపోతాడు. కానీ ఇద్దరి మధ్య ఉన్న ద్వేషం ప్రేమగా మారడంతో గోపిని వెతుక్కుంటూ ఇందు కూడా హైదరాబాద్ వస్తుంది. ఆ తర్వాత వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి?వారిద్దరు ఏకమయ్యారా?లేదా?పూర్ణి(దీక్షాపంథ్) అనే అమ్మాయి కారణంగా గోపికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? ఆ హత్యానేరం నుంచి అతడు ఏ విధంగా బయటపడ్డాడు? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

ఇగో(అహం) అనే పాయింట్ ప్రధానంగా రూపొందిన చిత్రమిది. అహంభావ మనస్తత్వం కలిగిన ఓ జంటకథకు డ్రగ్స్ పేరుతో నగరంలో జరుగుతున్న నేరాలను జతచేస్తూ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు ఆర్.వి. సుబ్రహ్మణ్యం. హీరో తన స్నేహితులతో కలిసి హీరోయిన్‌పై ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాలు, హైదరాబాద్ వచ్చిన తర్వాత అతడికి ఎదురయ్యే అనుభవాలతో ప్రథమార్థం సరదాగా సాగుతుంది.
ద్వితీయార్థంలో నగరాల్లో డ్రగ్స్ సరాఫరాకు చిన్న పిల్లలను ఉపయోగిస్తున్న తీరు, ఆ ముఠాను పట్టుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నాల చుట్టూ కథ సాగుతుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినా కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో తడబాటుకులోనయ్యాడు. నాయకానాయికల మధ్య ఉన్న ద్వేషం, ప్రేమ దేనిని సరిగా తెరపై ఆవిష్కరించలేకపోయారు. ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాల్లో వినోదం సరిగా పండలేదు . ఎలాంటి మలుపులు లేకుండా ఊహజనీతంగా కథనం సాగడం మైనస్‌గా మారింది. డ్రగ్స్ ముఠా పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నాల్లో ఉత్కంఠత ఎక్కడ కనిపించదు. ఈ లోపాలపై దర్శకుడు దృష్టిసారిస్తే ఇగో మంచి ప్రయత్నంగా నిలిచేది.

ఆకతాయి తర్వాత ఆశిష్‌రాజ్ హీరోగా నటించిన చిత్రమిది. తొలి సినిమాతో పోలిస్తే నటుడిగా కొంత పరిణితి కనబరిచాడు. భావోద్వేగ సన్నివేశాల్లో తెలిపోయినా ఫైట్స్, డ్యాన్సుల్లో ఆకట్టుకున్నాడు. సిమ్రాన్ నటన మోస్తారుగా ఉంది. తెలంగాణ యాస సంభాషనలతో రావురమేష్ ఆకట్టుకున్నారు. పృథ్వీ, రాజు, గౌతంరాజు తదితరులుపై చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించాయి. కైరాదత్‌పై చిత్రీకరించిన ప్రత్యేకగీతం మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

సాంకేతికంగా సాయికార్తీక్ సంగీతం సినిమాకు ఆయువు పోసింది. తన నేపథ్య సంగీతం, బాణీలతో మరోమారు ప్రతిభను చాటుకున్నారు. విజయ్‌కరణ్, కౌశల్ కరణ్, అనిల్‌కరణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. గోదావరి పల్లెటూరి అందాలను ఛాయాగ్రహకుడు ప్రసాద్ సహజంగా సినిమాలో చూపించారు.
కొత్తదనం జోలికి పోకుండా రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించిన సాధారణ ప్రేమకథా చిత్రమిది. బీ, సీ వర్గాల మెప్పించేలా దర్శకనిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కించారు.
రేటింగ్:2/5

4784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS