ఈ నగరానికి ఏమైంది! రివ్యూ..

Fri,June 29, 2018 02:04 PM
Ee Nagaraniki Emaindi Movie Review

నేటి యువతరం దర్శకులు సరికొత్త కాన్సెప్టులతో.. సహజమైన పాత్రలతో.. చిత్రాలను రూపొందిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంటున్నారు. ఈ కోవలోనే పెళ్లిచూపులుతో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు తరుణ్‌భాస్కర్. అయితే పెళ్లిచూపులుచిత్రంతో కుటుంబ ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చేసిన ఈ యువ దర్శకుడు తన రెండో ప్రయత్నంగా నూతన తారలతో పూర్తి యూత్‌ఫుల్ చిత్రంగా ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని తెరకెక్కించాడు. మీ గ్యాంగ్‌తో రండి థియేటర్‌లో చూస్కుందా..అంటూ యూత్ టార్గెట్‌ను చేశాడు. ట్రైలర్‌తో అలరించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో తెలియాలంటే ఓ సారి ఈ చిత్ర సమీక్షలోకి వెళదాం..

కార్తీక్, వివేక్, కౌశిక్, ఉపేంద్ర అనే నలుగురు ప్రాణమిత్రుల కథ ఇది. కార్తీక్ (సుశాంత్) ఓ పబ్‌లో పనిచేస్తుంటాడు. వివేక్ లఘు చిత్రాలు తీసి తన ప్రతిభతో వెండితెర దర్శకుడిగా స్థిరపడాలనేది అతని లక్ష్యం ( విశ్వక్‌సేన్) కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ కార్తీక్ తీరు నచ్చకపోవడంతో అతడి ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దాంతో మద్యానికి బానిస అవుతాడు. కౌశిక్ (అభినవ్) నటుడిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను) పెళ్లి వీడియోలకు ఎడిటర్ పనిచేస్తుంటాడు. కొన్ని కారణాలతో స్నేహితులకు దూరంగా వుండాల్సి వచ్చిన కార్తీక్ నాలుగేళ్ల తర్వాత స్నేహితులను కలుసుకుంటారు. తాగిన మైకంలో గోవాకు చేరుకున్న స్నేహితులకు అక్కడ ఎదురైన అనుభవాలేమిటి? తమ లక్ష్యాలను ఎలా చేరుకున్నారు? అనేది కథ. ఇది కథగా చెప్పడం కంటే నలుగురు స్నేహితుల జీవితం అని చెప్పవచ్చు. డబ్బు, విలాసవంతమైన జీవితం, బ్రాండెడ్ దుస్తులో వుండేది అసలైన ఆనందం కాదు. నచ్చిన స్నేహితులతో, మనసుకు నచ్చిన పని చేసుకుంటూ జీవించడంలోనే ఆనందం, సంతృప్తి వుందనే అంశంతో ఈ చిత్రాన్ని పూర్తి హిలేరియస్‌గా మలిచాడు దర్శకుడు తరుణ్‌భాస్కర్.

ఈ చిత్రంలో చెప్పుకోవడానికి పెద్దగా కథ లేనప్పటికీ వినోదానికి పెద్దపీట వేస్తు చిత్రాన్ని నడిపించాడు దర్శకుడు. ఇలాంటి రోడ్ మూవీస్ గతంలో బాలీవుడ్ చిత్రాలు ప్రేరణగా వచ్చినప్పటికీ వాటిలో పూర్తి భిన్నంగా కనిపించే చిత్రమిది. దర్శకుడు నేల విడిచి సాము చేయకుండా పూర్తి సహజమైన సంభాషణలతో, కడుపుబ్బా నవ్వే కామెడీతో చిత్రాన్ని రూపొందించాడు.హృదయాలను పిండేసే సెంటిమెంట్, భావోద్వేగాలు లేనప్పటికీ నేటి యువతరం తమని తాము ఐడెంటిఫై చేసుకునే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. తెలంగాణ యాసలో వచ్చే సంభాషణలు ఎంతో సహజంగా ఆకట్టుకునే విధంగా వున్నాయి. నటీనటులు అందరూ తమ పాత్రల్లో సహజంగా నటించారు. నలుగురు స్నేహితులు కలిసివున్న దగ్గర వారికి తెలియకుండా కెమెరా పెట్టి, వారి లైఫ్‌ైస్టెల్ చిత్రీకరిస్తే ఎలా వుంటుందో ఈ సినిమా కూడా అంతే నేచురల్‌గా వుంది. తొలిచిత్రంతో దర్శకుడిగా జాతీయ అవార్డు సాధించినా.. స్టార్ హీరోల వెంట పడకుండా తన మనసుకు నచ్చిన కథతో... కథకు సరిపోయే నటీనటులతో తరుణ్‌భాస్కర్ తెరకెక్కించిన చిత్రమిది. నటుల్లో ముఖ్యంగా విశ్వక్‌సేన్ నటన ఆకట్టుకుంది. ఈ పాత్రను చూస్తుంటే వివేక్ అర్జున్ రెడ్డిలోని విజయ్ దేవరకొండ పాత్రను అనుకరించాడని అనిపిస్తుంటుంది. అభినవ్ కామెడీతో అలరించాడు. తరుణ్‌భాస్కర్ తల్లి కూడా ఈ చిత్రంలో వివేక్ అమ్మగా నటించింది. విజయ్ దేవరకొండ అతిథి పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా వుంది. మిగతా పాత్రలు కూడా తమ పరిధి మేరకు న్యాయం చేశారు. అయితే ఈ చిత్రాన్ని తరుణ్‌భాస్కర్ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే టార్గెట్ చేయడం వల్ల ఈ చిత్రం కమర్షియల్ రేంజ్ ఏంటో ఇప్పుడే చెప్పలేం. అయితే తరుణ్‌భాస్కర్ తొలిచిత్రానికి పూర్తి భిన్నంగా డిఫరెంట్ జానర్‌లో ఈ చిత్రానికి రూపొందించి యూత్‌ను ఆకట్టుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా నిర్మాత సురేష్‌బాబు మంచి లాభాలను తెచ్చిపెడుతుందని చెప్పడంలో సందేహం లేదు.
రేటింట్: 3/5

4419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles