దొరసాని సినిమా రివ్యూ

Fri,July 12, 2019 02:37 PM
Dorasani Movie review

తెలంగాణ నేపథ్యంలో ఉద్యమకథలు, పోరాట నేపథ్యాలతో కూడిన సినిమాలే ఎక్కువగా రూపొందాయి. తెలంగాణ సంస్కృతిని, ఇక్కడి సామాజిక జీవనాన్ని కథా వస్తువుగా తీసుకొని ప్రేమకథల్ని తెరకెక్కించే ప్రయత్నాలు అరుదుగా జరిగాయి. దొరసానితో ఈ సాహసానికి సిద్ధపడ్డారు దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ జీవితల తనయ శివాత్మిక ఈ సినిమాతో నాయకానాయికలుగా వెండితెరపై అరంగేట్రం చేస్తుండటంతో ప్రారంభం నుంచే ఈసినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. భిన్నమైన కథాంశం ద్వారా తొలి అడుగులు వేసిన ఆనంద్, శివాత్మికలకు ఈసినిమా శుభారంభాన్ని అందించిందా? నిజాయితీతో కూడిన కథను చెప్పాలన్న దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర ప్రయత్నం ఏ మేరకు సఫలమైందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

జయగిరి ఊరిలో రాజారెడ్డి దొర పెత్తనం చెలాయిస్తుంటాడు. తన గఢీ నుంచే అన్ని పనులు చక్కబెడుతుంటాడు. తన దొరతనానికి, అధికారానికి ఎదురుతిరిగిన వారిని చంపేస్తుంటాడు. దొర కూతురు దేవకి( శివాత్మిక రాజశేఖర్) గఢీ దాటి ఎప్పుడూ బయటకు రాదు. ఆ ఊళ్లో ఉండే రాజు(ఆనంద్ దేవరకొండ) అనే కుర్రాడు దొరసానిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఊరి జనాలంతా గఢీవైపు చూడటానికి, అందులోకి వెళ్లడానికి భయపడుతుంటారు. కానీ దొరసాని ప్రేమ కోసం రాజు ధైర్యం చేసి ప్రతిరోజు గఢీలోకి వెళుతుంటాడు. రాజు తనపై చూపుతున్న ప్రేమకు ముగ్ధురాలైన దొరసాని అతడిని ఇష్టపడుతుంది. కూలి కొడుకైనా రాజు తన కూతురును ప్రేమించడం సహించని దొర అతడిపై నక్సలైట్ అనే ముద్ర వేసి చంపించాలని ప్రయత్నిస్తాడు. తన తండ్రి పన్నిన కుట్రను తెలుసుకున్న దొరసాని రాజు కోసం ఏం చేసింది?కట్టుబాట్లు, కులమతాల సంకెళ్లను దాటి స్వేచ్ఛగా బ్రతకాలని కలలు కన్న రాజు, దొరసానిలా ప్రేమకథ చివరకు ఏ తీరాలకు చేరింది? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

పరువు హత్యల నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథతో దర్శకుడు మహేంద్ర ఈ సినిమాను తెరకెక్కించారు. 1980 కాలం నాటి దొరల సంస్కృతి, వారి పాలనలో మగ్గిపోయే ప్రజల వెతలకు ఆనాడు తెలంగాణ నేలపై ఉధృతంగా కొనసాగిన నక్సలైట్ ఉద్యమాన్ని జోడించి వాస్తవికతకు దగ్గరగా కథను రాసుకున్నారు. కట్టుబాట్ల కారణంగా అమాయకమైన ప్రేమ జంట ఎదుర్కొనే సంఘర్షణను హృదయానికి హత్తుకునేలా చూపించారు.

రొటీన్ ప్రేమకథల్లా నేరుగా కథలోకి వెళ్లకుండా కిషోర్‌తో పాటు మరో పాత్ర ద్వారా ఫ్యాష్‌బ్యాక్ రూపంలో సినిమాను ఆసక్తికరంగా మొదలుపెట్టారు దర్శకుడు. సినిమాటిక్ ఫీల్‌తో కృత్రిమంగా కాకుండా దొరసానిని రాజు చూసే సన్నివేశానికి తెలంగాణ సంస్కృతిలో ఓ భాగమైన బతుకమ్మ పండుగతో ముడిపెట్టి బాగా రాసుకున్నారు. అదే కాకుండా దొరసానిని చూడటం కోసం కప్పతల్లి ఆడుతున్నట్లుగా నటించడం, గఢీలోనే పనిచేసే తన స్నేహితులతో కలిసి వేసే ప్లాన్‌లన్ని నిజమైన ప్రేమకథను తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. తన తెలివితేటలతో హీరో అందరిని ఏమార్చడం, తన కన్న బలవంతులను ఒక్క దెబ్బతో పడగొట్టడం లాంటి కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా రియలిస్టిక్ అప్రోచ్‌లో వెళ్లారు దర్శకుడు. ఓ వైపు ప్రేమకథను నడిపిస్తూనే మరోవైపు దొరల పాలనలో మగ్గిపోయే సామాన్యుల అగచాట్లను, ప్రాణాలకు తెగించి దోపిడీ సంస్కృతికి ఎదురొడ్డి పోరాటానికి సిద్ధమైన నక్సలైట్ల జీవితాల్ని అంతర్లీనంగా చూపించారు. అసలు కథను పక్కదారి పట్టించకుండా ఈ ఉపకథలను చెప్పిన తీరు మెప్పించింది. సెల్‌ఫోన్‌లు, సోషల్‌నెట్‌వర్క్‌ల ఊసే లేని ఆనాటి కాలంలో కవితల రూపంలో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను ఓ జంట వ్యక్తం చేసుకునే సన్నివేశాల్ని మెప్పిస్తాయి.

రాజు, దేవకి మధ్య వచ్చే ముద్ధు సన్నివేశంతో ప్రేమలో అంతరాలకు తావుండదంటూ చూపించిన విధానం ద ర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది. అలాగే పతాక ఘట్టాల్ని భావోద్వేగభరితంగా తీర్చిదిద్దిన తీరు బాగుంది. పేగుబంధం కంటే పరువుకే విలువనివ్వడానికి ఓ తండ్రీకొడుకులు చేసిన కుట్రలు మనసుల్ని కదిలిస్తాయి. . 1980 కాలం నాటి సామాజిక పరిస్థితుల్ని, గఢీల వాతవరణాన్ని యాస, వస్త్రధారణను సినిమాలో కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించారు. అయితే డాక్యుమెంటరీ మాదిరిగా కథాగమనం నిదానంగా సాగడం, తెలిసిన కథే కావడం కొంత సినిమాకు అవరోధాలుగా నిలిచాయి.

రాజు, దేవకి పాత్రలకు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ప్రాణంపోశారు. తొలి సినిమా అనే అనుభూతి ఎక్కడ వారి అభినయంలో కనిపించలేదు. శివాత్మిక కళ్లతోనే అద్భుతంగా హవభావాల్ని పలికించి ఆకట్టుకున్నది. తన ప్రేమ కోసం గఢీ దాటి వచ్చిన దొరసానిగా ఆమె నటించిన తీరు మెప్పిస్తుంది. రాజుగా ఆనంద్‌దేవరకొండ సహజ నటనను కనబరిచారు. ఇద్దరి నటనలో ఎక్కడ కృతిమత్వం కనిపించదు. ఉద్యమకారుడు శంకరన్న కిషోర్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. రాజు స్నేహితులుగా నటించిన కుర్రాళ్లు, చెంద్రి అనే దాసిగా ఫిదా ఫేమ్ శరణ్య, దేవకి తండ్రి పాత్రధారి ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో లీనమైపోయారు.

కథకుడు, దర్శకుడిగానే కాకుండా సంభాషణల రచయితగా మహేంద్ర ప్రతిభను చాటుకున్నారు. పంచ్‌లు, ప్రాసల జోలికి పోకుండా స్వచ్ఛమైన పల్లెపదాలతో కూడిన మాటల్ని రాసుకున్నారు. వాటితో పాటు తెలంగాణ జానపదశైలిలో గోరటి వెంకన్న అందించిన పాటలు సినిమాలోని ఫీల్‌ను ఎలివేట్ చేయడానికి ఉపయోగపడ్డాయి. సన్నీకూరపాటి ఛాయాగ్రహణం, ప్రశాంత్ విహారి సంగీతం, నేపథ్య సంగీతం కథకు తగినట్లుగా కుదిరాయి.

మూస ప్రేమకథలకు అలవాటుపడిపోయిన సగటు తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచే సినిమా ఇది.నలభై ఏళ్లు వెనక్కి తీసుకుపోయి ప్రతి ఒక్కరిని ఆనాటి ప్రపంచంలో విహరింపజేస్తుంది.
రేటింగ్:3/5

8939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles