దేవదాస్ రివ్యూ

Thu,September 27, 2018 04:42 PM

కథాంశాలు, పాత్రల పరంగా నవ్యతకు అమితంగా ప్రాధాన్యతనిస్తుంటారు నాగార్జున. కథ నచ్చితే నవతరం హీరోలతో కలిసి నటించడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. కెరీర్ తొలినాళ్ల నుంచి వినూత్న కథాంశాలతో సినిమాలు చేస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు నాని. వీరిద్దరి కలయికలో రూపొందిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. క్లాసిక్ టైటిట్‌తో ఇద్దరూ అగ్ర కథానాయకులు కలిసి నటించిన ఈ చిత్రంపై ప్రారంభం నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. భలేమంచిరోజు, శమంతకమణి సినిమాలతో ప్రతిభను నిరూపించుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మహానటి విజయం తర్వాత వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన చిత్రమిది.

దేవ(నాగార్జున) పెద్ద గ్యాంగ్‌స్టర్. తన ఉనికి ప్రపంచానికి తెలియకుండా మాఫియా కార్యకలాపాల్ని నిర్వహిస్తుంటాడు. అతడు తండ్రిలా భావించే దాదాను(శరత్‌కుమార్) డేవిడ్(కునాల్‌కపూర్) చంపేస్తాడు. దాదా మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్‌కు వస్తాడు దేవ. దాస్(నాని) ఓ డాక్టర్. గోల్ట్‌మెడలిస్ట్ అయిన అతడు పెద్ద ఆసుపత్రిలో వైద్యుడిగా చేరతాడు. కానీ తన నిజాయితీ కారణంగా కొద్ది రోజుల్లోనే ఉద్యోగం పోతుంది. దాంతో ఓ బస్తీలో ఆసుపత్రి ప్రారంభిస్తాడు. శత్రువుల దాడిలో గాయపడిన దేవకు దాస్ వైద్యం చేస్తాడు. ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోతారు. దేవను మంచిమనిషిగా మార్చేందుకు దాస్ ప్రయత్నిస్తుంటాడు. దాస్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? దేవాలో మార్పు తీసుకురాగలిగాడా? ఈ దేవదాస్‌లో జీవితాల్లోకి జాహ్నవి(ఆకాంక్షసింగ్), పూజ(రష్మిక మందన్నా) ఎలా వచ్చారన్నదే ఈ చిత్ర కథ.

నలుగురిని భయపెట్టి బతకడం కంటే ఆ నలుగురి మధ్య సంతోషంగా జీవించడంలోనే సంతృప్తి ఉంటుంది. ప్రాణం తీయడం కంటే ప్రాణాలు కాపాడటమే గొప్ప అనే పాయింట్‌తో రూపొందిన చిత్రమిది. ప్రాణాలను హరించే ఓ డాన్‌కు ప్రాణాలను పోసే ఓ వైద్యుడికి ఎర్పడిన స్నేహం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సాధారణంగా మాఫియా డాన్ సినిమాలంటే డెన్‌లు, భారీ ఛేజింగ్‌లు, యాక్షన్ సన్నివేశాలు, లెక్కకు మించిన విలన్‌లతో వేగంగా సాగిపోతుంటాయి. కానీ దేవదాస్ సినిమాను అందుకు భిన్నంగా ఆద్యంతం సరదాగా తీర్చిదిద్దారు. నాగ్, నానిల పరిచయ ఘట్టాలు బాగున్నాయి. డాక్టర్‌గా పేరు తెచ్చుకోవడానికి నాని పడే తాపత్రయాన్ని ఎమోషన్స్‌తో పాటు వినోదం మేళవించి చూపించిన విధానం బాగుంది. అలాగే నాగార్జున, నానిల మధ్య పరిచయానికి దారితీసిన సంఘటనలు, దేవ ఓ మాఫియాడాన్ అనే నిజాన్ని కుటుంబ సభ్యులతో పాటు ఎదుటివారి దగ్గర దాచిపెట్టడానికి నాని పడే అవస్థలు నవ్విస్తాయి. అలాగే దాస్‌ను పావుగా వాడుకొని దేవను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్‌గా రష్మిక మందన్నా రహస్య ఆపరేషన్‌ను వినోదత్మకంగా తీర్చిదిద్దారు.

నాగార్జున- ఆకాంక్షసింగ్, నాని-రష్మిక మందన్నాల లవ్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ఆద్యంతం వినోదభరితంగా నడిపిస్తూనే అంతర్లీనంగా అవయవదానం గురించి సందేశాన్ని అందించారు. డబ్బు, పేరు అధికారం అన్ని ఉన్నా అవేవీ ప్రాణాల్ని కాపాడలేవనే నిజాన్ని తెలుసుకున్న దేవాలో పరివర్తన వచ్చే సన్నివేశాలతో పతాక ఘట్టాలు భావోద్వేగభరితంగా సాగుతాయి.

బాలీవుడ్ రచయిత శ్రీరామ్ రాఘవన్ అందించిన మూలకథ బాగుంది. అయితే దానిని తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొంత తడబాటుకు లోనయ్యారు. హాస్పిటల్ ఎపిసోడ్స్ కావాల్సినంత కామెడీని రాబట్టుకోలేకపోయారు. దేవను పట్టుకోవడానికి మురళీశర్మ బృందం చేసే హంగామాలో ఆసక్తిని లోపించింది. ఆ సన్నివేశాలన్ని లాజిక్‌లకు దూరంగా సాగుతాయి. అయితే కామెడీ ఆ లోపాలను చాలా చోట్ల కనిపించకుండా చేసింది.

అరవై ఏళ్ల వయసులో కూడా తన ఎనర్జీతో ఆకట్టుకున్నారు నాగార్జున. చాలా ైస్టెలిష్‌గా అతడి పాత్ర సాగుతుంది. తనదైన శైలి నటనతో దేవ పాత్రకు ప్రాణంపోశారు. డాక్టర్ దాస్‌గా నాని పాత్ర ఆద్యంతం వినోదాల్ని పంచుతుంది. కామెడీ టైమింగ్, సహజ అభినయంతో ఈ పాత్రలో ఇమిడిపోయారు. వారిద్దరి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం సినిమాను నిలబెట్టింది. ఛలో, గీతగోవిందం సినిమాల్లో పక్కింటి అమ్మాయితరహా పాత్రల్లో కనిపించిన రష్మిక మందన్నా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. మరో కథానాయిక ఆకాంక్షసింగ్ కూడా మంచి పాత్రే దక్కింది. వెన్నెలకిషోర్, సత్య కామెడీ కొన్నిచోట్ల నవ్వులు పూయిస్తుంది. బాలీవుడ్ నటుడు కునాల్‌కపూర్ ప్రధాన ప్రతినాయకుడిగా ఈ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టారు. అతడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో విలనిజాన్ని పండించడానికి అవకాశం రాలేదు. మురళీశర్మ, శరత్‌కుమార్, రావురమేష్ తమ పరిధుల మేర నటించారు.

శమంతకమణి తర్వాత మరోమారు మల్టీస్టారర్ సినిమాతో ప్రతిభను చాటుకున్నారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఇద్దరు స్టార్ హీరోలకు సమ ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి తడబాటు లేకుండా కథను సమర్థవంతంగా నడిపించడంలో విజయవంతమయ్యారు. మణిశర్మ, శ్యామ్‌దత్ లాంటి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల నుంచి అతడికి చక్కటి సహకారం లభించింది. మణిశర్మ బాణీల్లో ఏమో ఏమో, వారు వీరు బాణీలు బాగున్నాయి. ఈ సినిమా ద్వారా మరోమారు భారీచిత్రాల నిర్మాణంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు సీనియర్ నిర్మాత అశ్వినీదత్.
ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్వించే మల్టీస్టారర్ సినిమా ఇది. నాగార్జున, నాని అభిమానుల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తుంది.

రేటింగ్: 3/5

7150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles